తల్లిదండ్రులు ఎప్పుడైతే క్రీడలకు అధిక ప్రాధాన్యతనిస్తారో అప్పుడే దేశం నుంచి అన్ని ఆటల్లో మరింత మంది ఛాంపియన్లు పుట్టుకొస్తారని క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్ అభిప్రాయపడ్డాడు. కొన్నేళ్లుగా క్రీడల పట్ల తల్లిదండ్రుల వైఖరి మారుతుందని, కానీ జరగాల్సింది ఇంకా చాలా ఉందని అతను చెప్పాడు. 'స్వాతంత్య్ర అమృత మహోత్సవం (అజాదీ కా అమృత్ మహోత్సవ్)' సంబరాల్లో భాగంగా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో కపిల్ పాల్గొన్నాడు. ఇటీవల తొలిసారి థామస్ కప్ గెలిచి భారత బ్యాడ్మింటన్ జట్టు చరిత్ర సృష్టించిన నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు.
' క్రీడల విషయంలో తల్లిదండ్రుల వైఖరి ఇంకా మారాలి' - azadi ka amrit mahotsav
కొంతకాలంగా క్రీడల పట్ల తల్లిదండ్రుల వైఖరి మారుతుందని, అయితే అది ఇంకా జరగాల్సిన అవసరం ఉందన్నారు క్రికెట్ దిగ్గజం కపిల్‌దేవ్. 'అజాదీ కా అమృత్ మహోత్సవ్' సంబరాల్లో భాగంగా న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు కపిల్.
''పిల్లలది కాదు తల్లిదండ్రుల దృక్పథం మారాలి. మన దేశంలో చాలా మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను తయారు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ల తల్లిదండ్రులు తమ పిల్లలను అలాగే తీర్చిదిద్దాలనుకుంటున్నారు. ఏ రోజయితే వాళ్లు తమ పిల్లలు క్రీడాకారులు కావాలని కోరుకుంటారో అప్పుడు మన దేశం నుంచి మరింత మంది ఛాంపియన్లు వస్తారు. ఒకవేళ నా తనయకు కూడా ఒకేసారి పదో తరగతి పరీక్ష, జూనియర్ స్థాయిలో భారత్ తరపున మ్యాచ్ ఉంటే నేను కచ్చితంగా చదువుకోమని చెప్పేవాణ్ని. కానీ అమెరికా, ఐరోపా లేదా ఆస్ట్రేలియాలో తల్లిదండ్రులు మాత్రం ఆటల్లో దేశానికి ప్రాతినిథ్యం వహించమనే చెప్తారు. పరీక్ష వచ్చే ఏడాది రాసుకోవచ్చని అంటారు. మన దేశంలో ఆ ఆలోచనా దృక్పథంలో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. తమ చిన్నారులను మైదానాలకు తీసుకెళ్తున్న అమ్మానాన్నలను చూస్తుంటే గర్వంగా ఉంది'' అని కపిల్ పేర్కొన్నాడు.