కంబళ వీరుడు శ్రీనివాసగౌడకు బెంగళూరులో శిక్షణ ఇచ్చేందుకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(శాయ్) సుముఖత వ్యక్తం చేసింది. వంద మీటర్ల పరుగును అతి తక్కువ సమయంలో పూర్తి చేసిన ఘనత సాధించటం వల్ల అతడికి దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఈ కారణంగా శ్రీనివాస్‌కు తగిన శిక్షణ ఇప్పించాలని సోషల్ మీడియాలో క్రీడాశాఖ మంత్రి కిరణ్రిజుజుకు పలువురు సూచించారు. ఈ విషయంపై స్పందించిన కేంద్రమంత్రి రిజుజు అతడి శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని శాయ్‌కు సూచించారు .
శాయ్ దక్షిణభారత డైరెక్టర్ అజయ్‌కుమార్ నేతృత్వంలోని అధికారులు ఈ విషయంపై గౌడతో చర్చించి, బెంగళూరులోని స్వరాజ్ మైదానంలో శిక్షణకు రావాలని సూచించారు. శ్రీనివాస్ గౌడకు ట్రాక్‌ల గురించి ఎటువంటి అవగాహన లేదు కాబట్టి అందుకు ప్రాథమిక తర్ఫీదు ఇస్తామని వారు తెలిపారు.