Jr Wrestlers Protest:భారత రెజ్లర్ల నిరసన అనూహ్య టర్నింగ్ తీసుకుంది. దిల్లీ నగరం జంతర్ మంతర్ వద్ద వందల సంఖ్యలో జూనియర్ రెజ్లర్లు ఆందోళన ప్రారంభించారు. ఏడాది నుంచి తమ కెరీర్లో ఎంతో విలువైన సమయాన్ని కోల్పోయామంటూ, సీనియర్ రెజ్లర్లు సాక్షి మలిక్, బజరంగ్ పునియా, వినేశ్ ఫొగాట్‌కు వ్యతిరేకంగా జూనియర్లు నిరసన తెలిపారు. ఉత్తర్‌ప్రదేశ్, దిల్లీ, హరియాణాకు చెందిన జూనియర్ రెజ్లర్లు బుధవారం దిల్లీకి చేరుకొని 'ఈ ముగ్గురు రెజ్లర్ల నుంచి మా రెజ్లింగ్‌ను కాపాడండి' అంటూ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్‌ను అభ్యర్థిస్తూ ప్లెక్సీలు ప్రదర్శించారు.
అయితే ఏడాది కింద స్టార్ రెజ్లర్లు అప్పటి డబ్ల్యూఎఫ్ఐ ఆధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రారంభించారు. అనేక రోజుల పాటు సాగిన నిరసన పలువురు కేంద్ర మంత్రుల జోక్యంతో తగ్గుముఖం పట్టింది. ఆ తర్వాత బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై సరైన చర్యలు తీసుకోలేదంటూ రెజర్లు మళ్లీ రోడ్డెక్కారు. దీంతో WFI అధ్యక్ష పదవి నుంచి బ్రిజ్‌భూషణ్‌ను తొలగించారు. కాగా ప్రస్తుతం ఆ ముగ్గురికి వ్యతిరేకంగా జూనియర్ రెజ్లర్లు తాజాగా నిరసనకు దిగడం గమనార్హం.
WFI President Election:డిసెంబర్ 21న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్ష ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ప్యానెల్ భారీ మెజారిటీతో నెగ్గింది. అయితే కొత్తగా ఎన్నికైన సంజయ్ సింగ్, బ్రిజ్ భూషణ్‌కు అత్యంత సన్నిహితుడైన కారణంగా రెజ్లర్లు సాక్షి మాలిక్, బజ్రంగ్ పూనియా సహా పలువురు అథ్లెట్లు అసహనం వ్యక్తం చేశారు. ఎన్నిక ఫలితాల పట్ల అసహనం వ్యక్తం చేస్తూ సీనియర్ స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్ ఆటకు గుడ్‌బై చెప్పింది. ఆ తర్వాత మరుసటి రోజు రెజ్లర్ బజ్రంగ్ పునియా అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేశాడు. తన నిర్ణయానికి గల కారణాలను పేర్కొంటూ ప్రధాని నరేంద్రమోదీకి ఓ లేఖ రాశాడు.