లాక్‌డౌన్ కారణంగా ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమైపోయారు. ఎప్పుడూ ఫిట్‌గా ఉండే క్రీడాకారులు కూడా ఆటలను వదిలేయడం వల్ల శారీరక శ్రమ లేకుండా పోయింది. దీంతో కొందరు తమ శరీర ఆకృతులు మారిపోయాయని తెలిపారు. తన సిక్స్ ప్యాక్ కాస్తా ఫ్యామిలీ ప్యాక్ అయిందని చెప్పాడు ప్రముఖ జావెలిన్ త్రో ప్లేయర్ శివపాల్ సింగ్.
'లాక్‌డౌన్ వల్ల సిక్స్‌ప్యాక్ కాస్త ఫ్యామిలీ ప్యాక్ అయింది' - జావెలిన్ త్రో ప్లేయర్ శివపాల్ సింగ్
కరోనా కారణంగా దాదాపు రెండు నెలలు ఆటలు నిలిచిపోయాయి. ఫలితంగా స్టార్ ఆటగాళ్లు ఫిట్నెస్ కోల్పోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా నాలుగో దశ సడలింపుల్లో భాగంగా ప్రాక్టీస్ చేసుకునే అవకాశం వచ్చింది. మళ్లీ ప్లేయర్లు కసరత్తుల్లో మునిగితేలుతున్నారు. ఈ నేపథ్యంలో తన బాధను చెప్పాడు జావెలిన్ త్రో ప్లేయర్ శివపాల్ సింగ్.
"లాక్‌డౌన్ వల్ల ఇంట్లోనే ఉండిపోయాను. ఫలితంగా బాగా బరువు పెరిగాను. దీనివల్ల సిక్స్‌ప్యాక్‌తో ఉండే నా శరీరం ఫ్యామిలీ ప్యాక్‌లా మారిపోయింది. ఇప్పుడు ఉదయం 6గంటలకు నిద్ర మేల్కోవడం కూడా సాధ్యపడడం లేదు. మునుపటిలా కావాలంటే మళ్లీ రెండు నెలలు కష్టపడాలి" అని చెప్పుకొచ్చాడు శివపాల్.
గతంలో 118 కిలోల బరువును అలవోకగా ఎత్తే శివపాల్.. 100 కిలోల బరువు ఎత్తడానికి ఇబ్బందిపడుతున్నట్లు తెలిపాడు. మళ్లీ ఫిట్నెస్ పొందేందుకు బాగా కష్టపడతానని చెప్పాడు. దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన పోటీల్లో 85.47 మీటర్లు జావెలిన్ విసిరి ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడీ ప్లేయర్.