Neeraj Chopra Javelin: ఒలంపిక్ స్వర్ణ పతక విజేత, భారత స్టార్ జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి డైమండ్ లీగ్‌లో సత్తా చాటాలని కసరత్తలు చేస్తున్నాడు. గాయం నుంచి కోలుకున్న ఈ స్టార్ ప్లేయర్.. శుక్రవారం ప్రారంభం కానున్నడైమండ్ లీగ్‌లుసానె టోర్నీలో బరిలో దిగనున్నాడు. ఈ ఏడాది దోహాలో జరిగిన తొలి డైమండ్ లీగ్ టోర్నీలో 88.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరి అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత గాయంతో ఎఫ్‌బీకే క్రీడలు (నెదర్లాండ్స్), పావో నూర్మి ఈవెంట్ (ఫిన్లాండ్)లకు దూరమయ్యాడు. అయితే ఈ సీజన్లో ఎలాగైనా 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్‌కు ఇప్పుడు లుసానె టోర్నీ మరో అవకాశాన్ని ఇస్తోంది.
ఈ పోటీల్లో విజేతగా నిలవడం చోప్రాకు అంత సులభం కాకపోవచ్చు. ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ (గ్రెనెడా), టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత జాకబ్ వాద్లిచ్ (చెక్ రిపబ్లిక్),జులియన్ వెబర్ (జర్మనీ), అలివర్ హెలాండర్ (ఫిన్లాండ్), వాల్కాట్ (ట్రినిడాడ్ అండ్ టొబాగో), లాంటి స్టార్లు నీరజ్‌కు గట్టి పోటీనివ్వనున్నారు. అంతే కాకుండా మరో భారత అథ్లెట్ మురళీ శ్రీశంకర్ (లాంగ్‌జంప్) కూడా ఈ లుసానె ఈవెంట్ బరిలో ఉన్నాడు.