తెలంగాణ

telangana

ETV Bharat / sports

'రెజ్లర్ల నిరసన బాధాకరం.. వారి గౌరవం కాపాడే బాధ్యత మనపైనే'.. నీరజ్ చోప్రా ట్వీట్

రెజ్లర్ల సమాఖ్య మద్దతుగా జరుగుతున్న నిరసనపై స్టార్​ ప్లేయర్​ నీరజ్​ చోప్రా స్పందించాడు. ఈ క్రమంలో ట్విట్టర్​ వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశాడు.

neeraj chopra tweet on wrestlers protest
neeraj chopra

By

Published : Apr 28, 2023, 9:55 AM IST

Updated : Apr 28, 2023, 11:05 AM IST

రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలన్న రెజ్లర్ల డిమాండ్​కు ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా మద్దతు పలికాడు. రెజ్లర్లు న్యాయం కోసం ఆందోళన చేయాల్సి రావడం బాధాకరమని పేర్కొన్నాడు. అథ్లెట్ అయినా.. కాకపోయినా.. ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంటుందని ట్వీట్ చేశాడు.

"మన అథ్లెట్లు న్యాయం కోరుతూ వీధుల్లోకి రావడం నాకు బాధ కలిగించింది. వారు మన దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి, మనల్ని గర్వపడేలా చేయడానికి చాలా కష్టపడ్డారు. ప్రతి వ్యక్తి సమగ్రతతో పాటు గౌరవాన్ని కాపాడే బాధ్యత మనపై ఉంది. అది క్రీడాకారుడైనా కాకపోయినా కూడా. ఇప్పుడు జరుగుతున్న విషయం మరెప్పుడూ జరగకూడదు. ఇది సున్నితమైన సమస్య. నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించాలి. న్యాయం జరిగేలా సంబంధిత అధికారులు సత్వర చర్యలు తీసుకోవాలి" అని నీరజ్ చోప్రా ట్వీట్​ చేశాడు.

ఇక లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్ ఎట్టకేలకు మౌనం వీడారు. తనపై మహిళా రెజ్లర్లు చేసిన ఆరోపణలపై పరోక్షంగా స్పందించారు. ఈ మేరకు గురువారం ఓ వీడియో మెసేజ్​ను విడుదల చేశారు. అందులో తనపై వచ్చిన లైంగిక ఆరోపణల అంశాన్ని ప్రస్తావించకుండానే.. తన నిస్సహాయతను ఎప్పటికీ అంగీకరించలేనని స్పష్టం చేశారు.

"మిత్రులారా.. నేనెప్పుడూ జీవితంలో ఏం సాధించాను? ఏం కోల్పోయాను? అన్న విషయాల గురించి ఆలోచించను. నాలో పోరాడేందుకు శక్తి లేదని భావించిన రోజున, నేను నిస్సహాయుడినని భావిస్తాను. అలాంటి జీవితాన్ని నేను ఎప్పటికీ ఇష్టపడను. దానికంటే నేను చనిపోవడం మేలు అని భావిస్తా" అని బ్రిజ్‌ భూషణ్‌ ఆ వీడియోలో పేర్కొన్నారు.

బ్రిజ్‌ భూషణ్‌ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదని మహిళా రెజ్లర్లు మరోసారి జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళనకు దిగారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు, బ్రిజ్‌ భూషణ్‌పై కేసు నమోదు చేయాలని రెజ్లర్లు సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం దిల్లీ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో నోటీసులకు స్పందించిన దిల్లీ పోలీసులు కేసు నమోదుకు ముందు కొంత ప్రాథమిక దర్యాప్తు జరగాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీని కలిసి తమ సమస్యలు చెప్పేందుకు సమయం ఇవ్వాలని మహిళా రెజ్లర్లు మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా వీరికి మద్దతుగా ఒలింపిక్‌ ఛాంపియన్‌ షూటర్‌ అభినవ్‌ బింద్రా సామాజిక మాధ్యమాల వేదికగా రెజ్లర్లకు సంఘీభావం ప్రకటించాడు.

Last Updated : Apr 28, 2023, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details