మరో రెండు వారాల్లో టోక్యోలో ఒలింపిక్స్ జరగనున్న వేళ జపాన్ ప్రభుత్వం అత్యయిక స్థితి విధించింది. టోక్యోలో రోజువారి కరోనా కేసులు పెరుగుతుండటం వల్ల వైరస్ వ్యాప్తిని అదుపు చేసేందుకు, మంత్రులు, నిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు జపాన్ ప్రధానమంత్రి యుషిహ్డె సుగా తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎమెర్జెన్సీ ఆదివారంతో పూర్తి కానుండగా ఈ నెల 12 నుంచి ఆగస్టు 22 వరకు కొత్త అత్యయిక స్థితి అమల్లో ఉంటుందని వెల్లడించారు.
ఒలింపిక్స్ క్రీడలు అత్యయిక పరిస్థితుల్లోనే జరగనున్నాయి. విశ్వక్రీడలు ఈ నెల 23న ప్రారంభమై ఆగస్టు 8న ముగియనున్నాయి. బార్లు, రెస్టారెంట్లలలో మధ్యం అమ్మకాలపై నిషేధం విధించిన జపాన్ ప్రభుత్వం.. ఒలింపిక్స్ క్రీడలకు సంబంధించిన ఉత్సవాలకు ప్రజలు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. విజయాలను పురస్కరించుకుని ఎలాంటి పార్టీలు, ఉత్సవాలు జరుపుకోరాదని సూచించింది. టోక్యో వాసులు విశ్వక్రీడలను టీవీల్లో వీక్షించాలని విజ్ఞప్తి చేసింది.
ప్రేక్షకులు లేకుండానే
టోక్యోలో బుధవారం 920 కొవిడ్ కేసులు నమోదవగా, గతవారం ఇదే రోజున 714 కేసులు వెలుగు చూసినట్లు అధికారులు తెలిపారు. గత 18 రోజులుగా రోజువారి కేసుల్లో పెరుగుదల నమోదవుతున్నట్లు వివరించారు. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ఒలింపిక్స్ హాజరయ్యే విదేశీ ప్రేక్షకులపై జపాన్ ప్రభుత్వం ఇప్పటికే నిషేధం విధించింది. రెండువారాల క్రితం ఒలింపిక్స్ క్రీడా వేదికలను 50 శాతం మంది ప్రేక్షకులతో నింపాలని నిర్వాహకులు నిర్ణయించారు. అయితే తాజాగా జపాన్ ప్రభుత్వం తీసుకున్న అత్యయిక స్థితి నిర్ణయంతో.. ఒలింపిక్స్ నిర్వహణ ప్రణాళికలు మారే అవకాశం కనిపిస్తోంది. కేసులు కొనసాగితే విశ్వక్రీడలు రద్దు లేదా.. ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశం కనిపిస్తోంది. జులై 23న జాతీయ మైదానంలో నిర్వహించే ప్రారంభ వేడుకలు కూడా ప్రేక్షకులు లేకుండానే జరగనున్నట్లు సమాచారం.
విస్తృత వ్యాప్తి దశలో