ఊహించినట్టే జరిగింది. కరోనా మహమ్మారి తీవ్రతకు అతిపెద్ద క్రీడా సమరం ఒలింపిక్స్ వాయిదా పడింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ సమాఖ్య (ఐఓసీ) ప్రకటించింది. జపాన్ ప్రధాని షింజో అబే విజ్ఞప్తి మేరకు ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.
ఏడాది పాటు ఒలింపిక్స్ వాయిదా - Olympics chief agree to postpone Tokyo Games over virus
కరోనా వైరస్ ప్రభావంతో ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి. జపాన్ ప్రధానమంత్రి షింజో అబే వినతి మేరకు మెగాటోర్నీని ఏడాది వాయిదా వేస్తున్నట్లు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ప్రకటించింది.
"ఒలింపిక్స్‌ను ఏడాది పాటు వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశాను. ఐఓసీ అధ్యక్షుడు బాచ్ దీన్ని అంగీకరించారు" అని షింజో మీడియాకు తెలిపారు. కరోనా వైరస్ భయంతో ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని సభ్యదేశాలు ఒత్తిడి తెచ్చిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ముందుగా జులై 24 నుంచి ఈ క్రీడల్ని నిర్వహించాల్సి ఉండగా.. కరోనా ప్రభావంతో కెనడా గేమ్స్ నుంచి తప్పుకోగా ఆస్ట్రేలియా కూడా అదే బాటలో వెళ్లింది. మిగతా దేశాలు అలాంటి ఆలోచనతోనే ఉన్నట్లు గ్రహించిన ఐఓసీ.. క్రీడాకారుల రక్షణ దృష్ట్యా వాయిదా వేసింది. ఏడాది పాటు వాయిదాపడ్డా ఈ మెగాటోర్నీని టోక్యో ఒలింపిక్స్-2020 గానే పిలుస్తామని నిర్వాహకులు తెలిపారు.