ఈ ఏడాది జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్ క్రీడలను నిర్వహించాల్సి ఉంది. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ పోటీలు వాయిదా పడేలా కనిపిస్తున్నాయి. ఈ విషయంపై పార్లమెంటు ఎగువసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జపాన్ ఒలింపిక్ మంత్రి సీకో హషిమోటో సమాధానమిచ్చారు. కరోనా (కొవిడ్-19) కారణంగా ప్రణాళిక ప్రకారం జులై 24 నుంచి ఈ విశ్వటోర్నీ ప్రారంభమయ్యే అవకాశం లేదని తెలిపారు. ఆగస్టు 25 నుంచి పారాలింపిక్స్ నిర్వహించాలని ఇదివరకే ప్రణాళికలు రూపొందించారు.
ఈ ఏడాది ఒలింపిక్స్‌ను నిర్వహించకపోతే దాన్ని రద్దు చేసే హక్కు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ)కి ఉందని ఆమె అన్నారు. అయితే 2020లో ఎప్పటివరకైనా ఈ టోర్నీని వాయిదా వేసే అవకాశాలూ ఉన్నాయని తెలిపారు. అయితే మరోవైపు యథావిధిగా ఈ టోర్నీ జరుగుతుందని ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ ఇప్పటికే అనేకసార్లు స్పష్టం చేశారు.