ఒలింపిక్స్‌లో(Tokyo Olympics) దేశం గర్వించగదగ్గ స్థాయిలో భారత అథ్లెట్లు ప్రదర్శన చేస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది స్టార్ షట్లర్ పీవీ సింధు. మంగళవారం.. మెగాక్రీడల్లో పాల్గొనే మన క్రీడాకారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ఆటలు, కెరీర్‌కు సంబంధించి పలు విశేషాలను అథ్లెట్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానితో మాట్లాడిన సింధు ఈ వ్యాఖ్యలు చేసింది.
"ప్రధాని నరేంద్రమోదీ సహా మిగతా అథ్లెట్లతో మాట్లాడటం ఎంతో ఆనందం, గౌరవంగా ఉంది. మమల్ని ప్రోత్సాహిస్తున్న ప్రధానికి సహా యావత్ దేశానికి నా కృతజ్ఞతలు. ఒలింపిక్స్‌లో దేశం గర్వించదగ్గ స్థాయిలో బాగా రాణిస్తామని ఆశిస్తున్నాను."
-సింధు, స్టార్ షట్లర్.
"వాళ్లలో స్ఫూర్తిని నింపాలి. ప్రోత్సహించాలి. ప్రభుత్వం క్రీడాకారులకు అన్నీ రకాల సాకర్యాలను అందిస్తుంది. ఇవన్నీ వారికి తెలియజేయాలి. 'దేశానికి మంచి పేరు తీసుకురావాలి, బాగా శ్రమించాలి, ఇతరులను గౌరవించాలి' అని మంచి మాటలు వారికి చెప్పాలి."
-సింధు తల్లిదండ్రులు
మోదీ: ఆటలో ఛాంపియన్‌గా ఎదగడానికి ఎటువంటి అర్హతలు ఉండాలి?
"టెన్నిస్‌లో చాలామంది పెద్ద ప్లేయర్స్ అవ్వాలని అనుకుంటారు. అందుకు కష్టపడేతత్వం, ప్రోత్సాహం, నిబద్ధత వారికి ఉండాలి. శ్రమ, ప్రతిభ లేకపోతే ఏమి చేయలేం."
-సానియా మీర్జా, టెన్నిస్ స్టార్.
మోదీ: ఈ మెగాఈవెంట్ పట్ల మీ ఆలోచన ఏంటి?
"నేను చేనేత కుటుంబానికి చెందిన వ్యక్తిని. నాకు ఆరుగురు సోదరిలు, ఓ సోదరుడు, అమ్మ, నాన్న ఉన్నారు. ఇదే నా కుటుంబం. ఇంత మంది ఆడపిల్లలను జన్మనిచ్చినందుకు మా అమ్మను గ్రామస్థులంతా విమర్శిస్తున్నారు. ఈ మెగా క్రీడాల్లో బాగా ఆడితే నాకు ప్రభుత్వం ఉద్యోగం వస్తుంది. దీంతో నా కుటుంబాన్ని బాగా చూసుకోవచ్చు. ఇది నాకు రెండో ఒలింపిక్స్. ఎటువంటి భయం లేకుండా నేను పాల్గొంటున్నాను. దేశానికి పతకం తీసుకురావాలని భావిస్తున్నా. అదే నా లక్ష్యం."
-ద్యుతి చంద్, స్ప్రింటర్.