కరోనా విరామం తర్వాత తిరిగి తుపాకీ పట్టి.. లక్ష్యాన్ని గురి చూసేందుకు భారత పిస్టల్, రైఫిల్ షూటర్లు సిద్ధమయ్యారు. శుక్రవారం దేశ రాజధానిలో ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ షూటింగ్ ఛాంపియన్ షిప్ ఆరంభం కానుంది. మహమ్మారి కాలంలో ఎక్కువ సంఖ్యలో దేశాలు పాల్గొంటున్న తొలి టోర్నీ ఇదే.
ఒలింపిక్స్‌పై గురి.. నేటి నుంచే షూటింగ్ ప్రపంచకప్
కరోనా విరామం తర్వాత షూటింగ్ ప్రపంచకప్ నిర్వహించేందుకు సిద్ధమైంది భారత్. దేశ రాజధానిలో జరగనున్న ఈ టోర్నీలో 53 దేశాల నుంచి 294 మంది షూటర్లు పాల్గొననున్నారు.
వైరస్ విరామం తర్వాత పిస్టల్, రైఫిల్ విభాగంలో ఇదే మొదటి ప్రపంచకప్. గత నెలలో ఈజిప్టులో స్కీట్, ట్రాప్ విభాగాల్లో పోటీలు జరిగాయి. సొంతగడ్డపై జరిగే ఈ టోర్నీ కోసం భారత్ 57 మంది షూటర్లతో బరిలో దిగనుంది. ఇప్పటికే ఒలింపిక్స్ కోటా స్థానాలు సంపాదించిన 15 మంది షూటర్లూ వాళ్లలో ఉన్నారు. ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌కు సన్నాహకంగా వాళ్లకు ఈ టోర్నీ ఉపయోగపడనుంది.
పురుషుల 25మీ విభాగంలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలన్న లక్ష్యంతో అనీశ్ భన్వాలా పోటీల్లో అడుగుపెడుతున్నాడు. ప్రస్తుతం తన విభాగంలో ప్రపంచంలో 12వ ర్యాంకులో ఉన్న అతను.. ఈ టోర్నీలో సత్తాచాటితే టోక్యోకు టికెట్ సాధించే అవకాశం ఉంటుంది. విరామం తర్వాత పోటీ పడుతున్న భారత షూటర్లు పతకంపై ఆశలు రేపుతున్నారు. దివ్యాంశ్ సింగ్, అర్జున్, దీపక్ కుమార్, ఎలవెనిల్ వలరివన్, అంజుమ్, అపూర్వ, మను బాకర్, సౌరబ్ చౌదరి, అలిషేక్ వర్మ, యశస్విని సింగ్ లాంటి షూటర్లపై మంచి అంచనాలున్నాయి. 53 దేశాల నుంచి 294 మంది షూటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. అయితే చైనా, జపాన్ మాత్రం పోటీలకు దూరంగా ఉన్నాయి.