తెలంగాణ

telangana

ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​: టోక్యో ఒలింపిక్స్​ 2021కి వాయిదా! - టోక్యో ఒలింపిక్స్‌ 2020

టోక్యో ఒలింపిక్స్‌ వాయిదా పడడం ఇక లాంఛనమే! కరోనా వణికిస్తోన్న నేపథ్యంలో క్రీడల నుంచి వైదొలుగుతున్నట్లు కెనడా ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆటల నిర్వహణ మంచిది కాదని ప్రపంచ అథ్లెటిక్స్‌ అధిపతి.. ఐఓసీకి లేఖ రాయగా, ఒలింపిక్స్‌ వాయిదా వేయక తప్పకపోవచ్చని జపాన్‌ ప్రధానమంత్రే అభిప్రాయపడ్డాడు. ఫలితంగా ఈ క్రీడాసంబరం 2021లో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది.

టోక్యో ఒలింపిక్స్​ 2021లో..!

By

Published : Mar 24, 2020, 9:14 AM IST

Updated : Mar 24, 2020, 9:50 AM IST

టోక్యో 2020 ఒలింపిక్స్‌ వాయిదా పడడం ఇక దాదాపుగా లాంఛనమే. ఒలింపిక్స్‌ను వాయిదా వేయాలని వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అధిపతి సెబాస్టియన్‌ కో అంతర్జాతీయ ఒలింపిక్‌ సంఘానికి లేఖ రాయగా.. స్వయంగా జపాన్‌ ప్రధాన మంత్రే క్రీడల వాయిదా తప్పేలా లేదని వ్యాఖ్యానించారు. కెనడా గేమ్స్‌ నుంచి తప్పుకోగా.. 2021లో టోక్యో ఒలింపిక్స్‌కు సిద్ధం కావాలని ఆస్ట్రేలియా తన అథ్లెట్లకు చెప్పింది.

షెడ్యూల్​ ప్రకారం ఒలింపిక్స్‌ జులై 24న ఈ క్రీడాసంబరం ఆరంభం కావాల్సివుంది. జపాన్‌, ఒలింపిక్‌ అధికారులు టోర్నీ కచ్చితంగా జరుగుతుందని పదే పదే చెబుతూ విమర్శలకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వెంటనే వాయిదా వేయాలని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌కు.. వరల్డ్‌ అథ్లెటిక్స్‌ అధ్యక్షుడు సెబాస్టియన్‌ కో ఇప్పటికే లేఖ రాశాడు.

" ప్రపంచంలో భిన్న ప్రాంతాల్లో వైరస్‌ భిన్న దశల్లో ఉంది. కానీ జులైలో ఒలింపిక్స్‌ సాధ్యం, అభిలషనీయం కావన్నది అందరి అభిప్రాయం" అని లేఖలో కో పేర్కొన్నాడు.

తాజాగా జపాన్‌ ప్రధాని షింజో ఏబ్‌ పార్లమెంటులో మాట్లాడుతూ.. "క్రీడల నిర్వహణకు మేం కట్టుబడి ఉన్నాం. కానీ వాయిదా నిర్ణయం తీసుకోక తప్పకపోవచ్చు" అని అన్నారు.

జపాన్​ ప్రధాని షింజో ఏబ్​

ఉపసంహరించుకున్న కెనడా:

కొవిడ్‌-19 కారణంగా చాలా దేశాల్లో ఆంక్షలు నిర్వహించడం పోటీల షెడ్యూల్​ను దెబ్బతీసింది. సాధన చేయడం అసాధ్యం కావడమే కాదు.. ప్రమాదకరంగానూ మారింది. చాలా మంది అథ్లెట్లు క్రీడలను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో కెనడా.. ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌ నుంచి తప్పుకొన్న తొలి దేశంగా నిలిచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఒలింపిక్స్‌ నిర్వహణ సరికాదని, ఏడాదిపాటు వాయిదా వేయాలని అభిప్రాయపడింది.

ఐఓసీ నోట కూడా..

మొన్నటిదాకా షెడ్యూల్​ ప్రకారమే ఒలింపిక్స్‌ జరుగుతాయని చెప్పిన అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ).. ఇప్పుడు వాయిదా గురించి మాట్లాడుతోంది. కచ్చితంగా రద్దు ఆలోచన మాత్రం లేదని ఐఓసీ అధ్యక్షుడు థామస్‌ బాక్‌ స్పష్టం చేశాడు. ఎప్పుడు ఒలింపిక్స్‌ జరుగుతాయనేది నాలుగు వారాల్లో నిర్ణయిస్తామని తెలిపాడు.

థామస్‌ బాక్‌, ఐఓసీ అధ్యక్షుడు

" క్రీడల నిర్వహణ సహా అన్నింటికన్నా మనుషుల ప్రాణాలు ముఖ్యం. భిన్న ప్రత్యామ్నాయాల గురించి ఆలోచిస్తున్నట్లు ఇంతకుముందే చెప్పాం. టోక్యో 2020 ఒలింపిక్స్‌ గురించి ఇప్పుడే నిర్ణయం తీసుకోవడం తొందరపాటే అవుతుంది. ఆరోగ్య అధికారులు, ఆటలతో ముడిపడి ఉన్న ఇతరులతో మాట్లాడుతున్నాం. వచ్చే నాలుగు వారాల్లో తుది నిర్ణయం తీసుకుంటాం. క్రీడల రద్దుతో సమస్యలు పరిష్కారం కావు. ఏదో ఒక సమయంలో టోక్యోలో ఒలింపిక్స్‌ ఉంటాయి".

- థామస్‌ బాక్‌, ఐఓసీ అధ్యక్షుడు

ఓ నెల రోజులు ఆగుతాం..

టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడడంపై.. నెల రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) చెప్పింది.

" మరో 4, 5 వారాలు నిరీక్షించాక.. ఐఓసీ, క్రీడా మంత్రిత్వ శాఖలను సంప్రదించి ఓ నిర్ణయం తీసుకుంటాం. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో పరిస్థితి అంత ఘోరంగా ఏమీ లేదు" అని ఐఓఏ కార్యదర్శి రాజీవ్‌ మెహతా అన్నాడు.

వాయిదా తేలిక కాదు

ఒలింపిక్స్‌ను వాయిదా వేయడం అంత తేలికేమీ కాదు. అది ఎంతో వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. " ఒలింపిక్స్‌ను వాయిదా వేయడమంటే ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ను వచ్చే శనివారానికి మార్చడం కాదు" అని థామస్‌ బాక్‌ అన్నాడు.

నిజమే ఇందులో చాలా సవాళ్లే ఉన్నాయి. ఎంత కాలం వాయిదా వేస్తారన్న దానిపై అంతా ఆధారపడి ఉంది. ఇప్పటికే 2021 ఆటల క్యాలెండర్‌ కిక్కిరిసిపోయి ఉంది. ఆ ఏడాదికి ఒలింపిక్స్‌ను వాయిదా వేస్తే.. అథ్లెట్లు, పాలకులు, ప్రసారదారులకు పెను సమస్యలు తప్పవు. ఉదాహరణకు 2021 ఆగస్టులో అమెరికాలో ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ జరగాల్సి వుంది. ఈ ఛాంపియషిప్స్‌లో అథ్లెట్లు, ప్రసారదారులు భారీగా ఆర్జిస్తారు. ఇక ప్రపంచ స్విమ్మింగ్‌ ఛాంపియన్‌షిప్‌ జులై 16 నుంచి ఆగస్టు 1 వరకు జపాన్‌లోనే జరగాల్సివుంది. వీటికి తోడూ 2020లో జరగాల్సిన ఫుట్‌బాల్‌ ఐరోపా ఛాంపియన్‌షిప్‌.. 2021కి వాయిదా పడింది.

టోక్యో 2020
  • ఇక ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే 43 ప్రదేశాల్లో కొన్ని నిర్మాణాలను తాత్కాలికంగా, కొన్నింటిని ప్రత్యేక అవసరాల కోసం, మరికొన్నింటిని బహుళ విధాలుగా ఉపయోగపడేలా నిర్మించారు. ఉదాహరణకు 68 వేల ప్రేక్షక సామర్థ్యం ఉన్న ఒలింపిక్‌ స్టేడియాన్ని.. గేమ్స్‌ తర్వాత సాంస్కృతిక, క్రీడా ఈవెంట్ల ఆతిథ్యం ఇవ్వడానికి ఉపయోగించాలన్నది ఉద్దేశం. ఒకవేళ ఒలింపిక్స్‌ వాయిదా పడితే ఆ స్టేడియంలో నిర్వహించాలనుకున్న ఈవెంట్లను మరో చోటుకు తరలించాల్సివుంటుంది.
  • క్రీడలను కవర్‌ చేయడం కోసం వచ్చే వేల మంది పాత్రికేయులకు ఆతిథ్యమిచ్చేందుకు నిర్వాహకులు.. టోక్యో బిగ్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌ను బుక్‌ చేశారు. చాలా రోజుల ముందే దీన్ని బుక్‌ చేశారు. వాయిదాపడ్డ ఒలింపిక్స్‌ కోసం దీన్ని మళ్లీ బుక్‌ చేయాలనుకుంటే.. ఆ సమయంలో బుక్‌ చేసుకున్న వాళ్లను మరో చోటుకు పంపించడం సవాలే.
  • టోక్యోలో ఖరీదైన ప్రాంతంలో ఒలింపిక్‌ విలేజ్‌ను నిర్మించారు. 14 నుంచి 18 అంతస్తులు ఉన్న 21 టవర్లు ఇందులో ఉన్నాయి. క్రీడల తర్వాత దీన్ని నవీకరించి.. ఖరీదైన ఫ్లాట్లుగా మలిచి అమ్మడం లేదా అద్దెకు ఇవ్వాలన్నది ఉద్దేశం. 940 ఫ్లాట్లను ఇప్పటికే అమ్మకానికి పెట్టారు. అందులో చాలా వరకు అమ్ముడయ్యాయి కూడా. క్రీడల వాయిదా వేస్తే నవీకరణ వాయిదా పడుతుంది. అప్పుడు కుదుర్చుకున్న కాంట్రాక్టులు అనిశ్చితిలో పడతాయి.

ఒలింపిక్‌ విజేతకు కరోనా

ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, దక్షిణాఫ్రికా స్విమ్మర్‌ వాండర్‌ బర్గ్‌ కరోనా బారిన పడ్డాడు. తాను గత పద్నాలుగు రోజులుగా కరోనాతో బాధపడుతున్నట్లు బర్గ్‌ వెల్లడించాడు. "సిగరెట్‌ లాంటి అలవాట్లు లేకపోయినా, ఒక ఆటగాడిగా మంచి శరీర దారుఢ్యం ఉన్నా, ఊపిరితిత్తులు ఆరోగ్యకరంగా ఉన్నా కూడా ఈ వైరస్‌ చుట్టుకుంది. తీవ్రమైన జ్వరంతో పాటు అలసట, దగ్గుతో బాధపడుతున్నా" అని వాండర్‌ బర్గ్‌ ట్వీట్‌ చేశాడు. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో ఈ స్విమ్మర్‌ 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో పసిడి గెలిచాడు.

Last Updated : Mar 24, 2020, 9:50 AM IST

ABOUT THE AUTHOR

...view details