WFI Elections Date : భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికను జులై 4న నిర్వహించాలని భారత ఒలింపిక్ సంఘం(IOA) నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా జమ్ముకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేశ్ మిట్టల్ కుమార్‌ను నియమించినట్లు తెలిపింది.
"డబ్ల్యూఎఫ్‌ఐ కార్యనిర్వాహక కమిటీని నియమించేందుకు ఎన్నికలను నిర్వహించాలని ఐఓఏ నిర్ణయించింది. ఇందుకోసం రిటర్నింగ్ ఆఫీసర్ బాధ్యతలను చేపట్టాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహాయ రిటర్నింగ్ అధికారితోపాటు మరికొంత మంది సిబ్బంది మీకు తోడుగా ఉంటారు" అని భారత ఒలింపిక్ సంఘం జస్టిస్ మహేశ్ మిట్టల్‌కు రాసిన లేఖలో పేర్కొంది.
డబ్ల్యూఎఫ్‌ఐ మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్‌ఐ ప్యానెల్‌ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నూతన కార్యవర్గాన్ని నియమించేందుకు ఐఓఏ ఎన్నికకు సిద్ధమైంది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై ప్రస్తుతం దిల్లీ పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికి సంబంధించిన నివేదికను గురువారంలోగా దిల్లీ ట్రయల్ కోర్టుకు అందించాల్సి ఉంది.
కేంద్రమంత్రిని కలిసిన రెజ్లర్లు..
ఇటీవలే కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌తో అగ్రశ్రేణి రెజ్లర్లు భేటీ అయ్యారు. స్టార్ రెజ్లర్ బజరంగ్ పూనియా సహా పలువురు రెజ్లర్లో ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్.. ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత రెజ్లర్ బజరంగ్ పూనియా మీడియాతో మాట్లాడారు. జూన్ 15వ తేదీ వరకు నిరసన కార్యక్రమాలను నిలిపివేస్తున్నట్లు తెలిపాడు. ఉద్యమం మాత్రం ఇంకా ముగియలేదని చెప్పాడు. "జూన్ 15 లోపు పోలీసు విచారణ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం మాకు హామీ ఇచ్చింది. రెజ్లర్లపై ఉన్న అన్ని ఎఫ్‌ఐఆర్‌లను వెనక్కి తీసుకోవాలని కోరాం. అందుకు ప్రభుత్వం అంగీకరించింది. బ్రిజ్ భూషణ్ సింగ్‌పై జూన్ 15లోగా ఎలాంటి చర్యలు తీసుకోకుంటే మళ్లీ నిరసన కొనసాగిస్తాం" అని తెలిపాడు. పార్లమెంట్ ప్రారంభోత్సవం నాడు రెజ్లర్లపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లను దిల్లీ పోలీసులు ఉపసంహరించుకుంటారని రెజ్లర్ సాక్షి మాలిక్ చెప్పింది.
రెజ్లర్లతో సమావేశమైన తర్వాత కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడారు. ఆరు గంటల పాటు రెజ్లర్లతో సుదీర్ఘంగా చర్చించారని తెలిపారు. జూన్ 15వ తేదీలోగా విచారణ పూర్తి చేసి ఛార్జిషీట్లు సమర్పిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. "ఒక మహిళ నేతృత్వంలో రెజ్లింగ్ ఫెడరేషన్‌కు అంతర్గత ఫిర్యాదు కమిటీ ఏర్పాటు చేస్తాం. రెజ్లర్లపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను పోలీసులు వెనక్కి తీసుకోవాలి. బ్రిజ్ భూషణ్ సింగ్‌తో పాటు ఆయన సహచరులను తిరిగి ఎన్నుకోవద్దని రెజ్లర్లు అభ్యర్థించారు. మహిళను ఎన్నుకోవాలని కోరారు. జూన్ 15వరకు రెజ్లర్లు ఎలాంటి నిరసనలు చేపట్టరు" అని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.