వచ్చే ఏడాది జరిగే టోక్యో ఒలింపిక్స్‌కు దేశం తరఫున 125మంది అథ్లెట్లను పంపిస్తామని ధీమా వ్యక్తం చేశారు భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు (ఐఓఏ) నరీందర్ బత్రా. ఒలింపిక్స్ డే(జూన్ 23) సందర్భంగా కరోనా నేపథ్యంలో ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలనపై దిగ్గజ క్రీడాకారులు లియాండర్ పేస్, ఒలింపిక్ విజేత అభినవ్ బింద్రా, మాజీ క్రికెటర్ అంజూ బాబీ జార్జ్ సహా పలువురు ఆటగాళ్లతో బత్రా సమావేశమయ్యారు. ఈ చర్చలో భాగంగా పలు విషయాల్ని వెల్లడించారు.
"వచ్చే ఏడాది ఎంతో క్లిష్టంగా ఉండబోతుంది. ప్రతి ఒక్కరి దృష్టి అథ్లెట్లపైనే ఉంటుంది. ఇప్పటికే 78మంది ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. మొత్తంగా 125మంది మెగాటోర్నీకి అర్హత సాధిస్తారనే నమ్మకం ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఐఓఏ, ఎన్ఎస్ఎఫ్ సంయుక్తంగా కలిసి అథ్లెట్లను ఎంపిక చేసి పంపించే ప్రక్రియపై సన్నాహాలు చేస్తున్నాయి. ఇప్పటికే హాకీ, వెయిట్ లిఫ్టింగ్ క్రీడల అథ్లెట్లు జులై మధ్యలో నిర్వహించబోయే పోటీలకు సంసిద్ధంగా ఉన్నారు. ఒలింపిక్స్‌లో మనవాళ్లు విజయం సాధిస్తారని ఆశిస్తున్నాను"