తెలంగాణ

telangana

ETV Bharat / sports

నాపై ఆ ఒత్తిడి లేదు.. దాని గురించి ఆలోచిస్తే అంతే: నీరజ్ చోప్రా - జావెలిన్ త్రో

ఈ ఏడాది 90 మీటర్ల లక్ష్యాన్ని అందుకుంటాననే ఆత్మవిశ్వాసంతో ఉన్నాడు భారత జావెలిన్ త్రోయర్​.. నీరజ్ చోప్రా. ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ కోసం సన్నద్ధమవుతున్న అతడు.. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడతానని చెప్పాడు. ఇటీవలే డైమండ్​ లీగ్​లో తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపాడు.

Neeraj Chopra
neeraj chopra diamond league

By

Published : Jul 1, 2022, 4:41 PM IST

నాపై ఆ ఒత్తిడి లేదు.. 90మీ.ల గురించి ఆలోచిస్తే అంతే: నీరజ్ చోప్రా

ఒలింపిక్స్​ పసిడి పతక విజేత అనే ఒత్తిడి తనపై ఎప్పుడూ లేదన్నాడు జావెలిన్ త్రో స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా. ప్రతి ఈవెంట్​కు మెరుగవుతూ వస్తున్న అతడు.. ఈ ఏడాది ఎలాగైనా 90 మీటర్ల లక్ష్యాన్ని చేరుకుంటానని ధీమాగా ఉన్నాడు. అయితే ప్రపంచ ఛాంపియన్​షిప్స్​​లో పాల్గొనేందుకు వెళ్తున్న క్రమంలో ఈ మైలురాయి గురించి ఆలోచించడం లేదని చెప్పాడు. దానివల్ల అనవసర ఒత్తిడికి గురికావాల్సి వస్తుందని అన్నాడు.

జావెలిన్ ప్రపంచంలో గోల్డ్ స్టాండర్డ్​గా భావించే 90 మీటర్ల మార్కుకు నీరజ్ చేరువలో ఉన్నాడు. ఇటీవలే జరిగిన టోర్నీల్లో రెండు సార్లు అతడు తన వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శనను అధిగమించాడు. పావో నుర్మి గేమ్స్​లో 89.30 మీ. త్రోతో జాతీయ రికార్డు నెలకొల్పిన నీరజ్​.. స్టాక్​హోమ్​ డైమండ్​ లీగ్​లో గురువారం తొలి ప్రయత్నంలోనే 89.94 మీ. దూరం బల్లెం విసిరాడు. స్వర్ణ విజేత అండర్సన్ పీటర్స్ తన మూడో ప్రయత్నంలో 90.31 మీటర్లు విసిరేంతవరకు నీరజ్​దే అత్యుత్తమ ప్రదర్శన. మ్యాచ్​ అనంతరం ఫోన్​లైన్​లో మాట్లాడుతూ తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు చెప్పాడు నీరజ్.

నీరజ్ చోప్రా

"ఈరోజు (గురువారం) చాలా బాగా అనిపిస్తోంది. మొదటి త్రో అవ్వగానే 90 మీ. కూడా విసురుతానని అనుకున్నా. అయినా ఫర్వాలేదు. ఈ ఏడాది ఇంకా చాలా పోటీలున్నాయి. 90మీ.లకు చాలా దగ్గరగా ఉన్నా. ఈ ఏడాదే ఆ లక్ష్యాన్ని పూర్తి చేస్తా. ఈ రోజు నేను గెలవనప్పటికీ.. నా అత్యుత్తమ ప్రదర్శన చేసినందుకు సంతోషంగా ఉన్నా. అండర్సన్ పీటర్స్ 90మీ.లు విసిరినప్పుడు.. నేను కూడా దానిని ఛేదించాలనుకున్నా. అయితే అందుకు అన్నీ కుదరాలి. జావెలిన్ ఒకే లైన్​లో వెళ్లాలి. టెక్నిక్ సరిగ్గా ఉండాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. పోటీ తీవ్రంగానే ఉంది. అయినా నా ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నా. వచ్చే కాంపిటీషన్​లో అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నిస్తా"

- నీరజ్ చోప్రా, జావెలిన్ త్రో అథ్లెట్

ఒత్తిడి లేకుండా ఆడతా: "ప్రతి పోటీ, ప్రతి రోజు భిన్నంగా ఉంటుంది. ఒలింపిక్​ ఛాంపియన్​ అనే ఒత్తిడి నాకు ఉందా లేదా అనేది ప్రపంచ ఛాంపియన్​షిప్స్​లో ఆడేటప్పుడు తెలుస్తుంది. నేనైతే మనసులో ఎలాంటి ఆలోచనలు, ఒత్తిడి లేకుండా ఆడతా. అందుకోసం ఎంతో శ్రమిస్తున్నా" అని నీరజ్ చెప్పాడు.

నీరజ్

ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ అథ్లెటిక్స్​లో ఇప్పటివరకు భారత్​ ఖాతాలో కేవలం ఒకే పతకం ఉంది. 2003లో లాంగ్​ జంప్​లో కాంస్యం సాధించాడు దిగ్గజ అంజు బాబీ జార్జ్. అయితే భారత్​కు ఒకే పతకం ఉందన్న ఒత్తిడి కూడా తనపై లేదన్నాడు నీరజ్. టోర్నీలో బాగా రాణించేందుకు ప్రయత్నిస్తానని అన్నాడు. జులై 15 నుంచి 24 వరకు అమెరికా వేదికగా ప్రపంచ ఛాంపియన్​షిప్స్​ పోటీలు జరగనున్నాయి.

ఇదీ చూడండి:నీరజ్‌@ 89.94.. డైమండ్‌ లీగ్‌లో 'రజతం' కైవసం

ABOUT THE AUTHOR

...view details