Indonesia open 2023 Badminton : ఈ ఏడాది నిలకడగా రాణిస్తున్న భారత పురుషుల డబుల్స్ బ్యాడ్మింటన్ జోడీ.. సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి. ఇప్పుడు మరో సంచలన ప్రదర్శన చేసింది. ఇండోనేసియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నీలో.. పురుషుల డబుల్స్‌లో సాత్విక్- చిరాగ్ జోడీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. హోరా హోరీగా సాగిన సెమీస్‌లో ఈ ఏడో సీడ్ భారత జంట 17-21, 21-19, 21-18 తేడాతో సౌత్ కొరియాకు చెందిన కాంగ్ మిన్ హిక్–సియో సెంగ్ జె జోడీని ఓడించింది. టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఫలితంగా బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్ 1000 ఈవెంట్లో ఫైనల్‌కు చేరిన మొదటి భారత జోడీగా రికార్డు సృష్టించారు. ఈ సెమీస్ 67 నిమిషాల పాటు సాగింది. థ్రిల్లింగ్ సాగిన మూడో సెట్లో ఓ దశలో 16-16తో టై కూడా అయింది. కానీ ఆ తర్వాత భారత జోడీ పైచేయి సాధించింది.
అంతకుముందు ఈ ద్వయం క్వార్టర్స్‌లో 21-13, 21-13 తేడాతో టాప్ సీడ్ ఫజర్ అల్ఫియాన్- మహమ్మద్ రియాన్ (ఇండోనేసియా)పై గెలిచింది. మంచి స్మాష్‌లు, డ్రాప్‌లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగిన ఈ ద్వయం 41 నిమిషాల్లోనే ప్రత్యర్థిని మట్టికరిపించింది. ఇక ఈ సీజన్‌లో ఈ జోడీ.. స్విస్ ఓపెన్, ఆసియా ఛాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి స్వర్ణ పతకాలను ముద్దాడగా.. మలేసియా ఓపెన్‌లో సెమీఫైనల్ చేరింది.
ప్రణయ్‌కు నిరాశ.. పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో 21-18, 21-16 తేడాతో మూడో సీడ్ కొడాయ్ నరోకా (జపాన్)ను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లిన హెచ్ ఎస్ ప్రణయ్‌కు ఈ పోరులో నిరాశ ఎదురైంది. డెన్మార్క్‌కు చెందిన విక్టర్ యాక్సల్సెన్చేతిలో ఓడిపోయాడు. 15-21 15-21 తేడాతో ఓటమి చెందాడు.