కజకిస్థాన్ వేదికగా జరుగుతున్న ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో రాహుల్ అవారే సత్తా చాటాడు. ఆదివారం.. కాంస్యం కోసం 61 కిలోల విభాగంలో బరిలోకి దిగిన ఈ స్టార్ రెజ్లర్... లీ గ్రాఫ్(అమెరికా)ను ఓడించి పతకం అందుకున్నాడు.
కాంస్య పోరులో గెలిచిన రాహుల్ అవారే - World Wrestling Championship 2019
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ మరో పతకం సొంతం చేసుకుంది. కాంస్యం కోసం ఆదివారం జరిగిన పోరులో రాహుల్ అవారే గెలిచాడు. 61 కేజీల విభాగంలో లీ గ్రాఫ్(అమెరికా)ను ఓడించాడు. ఈ టోర్నీలో భారత్.. స్వర్ణం లేకుండానే తన ప్రయాణాన్ని ముగించింది.
ఈ టోర్నీలో భారత్ మిగతా రెజ్లర్లు దీపక్ పునియా (86 కిలోలు) వెండి పతకంతో సరిపెట్టుకున్నాడు. ఆదివారం జరగాల్సిన ఫైనల్ నుంచి గాయం కారణంగా తప్పుకున్నాడు. ఆదివారంతో ముగిసిన ఈ టోర్నీలో ఒక వెండి, నాలుగు కాంస్యాలు సాధించారు భారత రెజ్లర్లు. దీపక్ పునియా(వెండి), వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా, రవి దహియా, రాహుల్ అవారే... కాంస్యాలతోనే సరిపెట్టుకున్నారు.
ఇప్పటివరకు ఈ మెగా టోర్నీలో బంగారు పతకం గెలిచిన ఆటగాడిగా సుశీల్‌కుమార్ (66 కిలోలు) మాత్రమే ఉన్నాడు. 2010 మాస్కోలో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ఈ ఘనత సాధించాడు సుశీల్.