తెలంగాణ

telangana

ETV Bharat / sports

'పట్టు'లో పసిడి పంట.. మెరిసిన బజరంగ్​, సాక్షి, దీపక్​.. అన్షుకు రజతం.. దివ్యకు కాంస్యం - రెజ్లింగ్​లో పతకాల పంట

indian wrestler
indian wrestler

By

Published : Aug 5, 2022, 10:41 PM IST

Updated : Aug 6, 2022, 7:28 AM IST

22:34 August 05

'పట్టు'లో పసిడి పంట.. మెరిసిన బజరంగ్​, సాక్షి, దీపక్​.. అన్షుకు రజతం.. దివ్యకు కాంస్యం

commonwealth games 2022: కామన్వెల్త్‌ క్రీడల్లో రెజ్లింగ్‌ పోటీలు మొదలయ్యాయంటే భారత్‌కు పతకాల పంట పండాల్సిందే. నాలుగేళ్ల కిందట అయిదు స్వర్ణాలు సహా పన్నెండు పతకాలు కొల్లగొట్టారు మన కుస్తీ యోధులు. ఈసారి కూడా భారత రెజ్లర్లు అదే దూకుడు ప్రదర్శిస్తున్నారు. తొలి రోజు బరిలోకి దిగిన ఆరుగురూ పతకాలు గెలిచారు. అందులో మూడు స్వర్ణాలు. బజ్‌రంగ్‌ పునియా వరుసగా మూడో పర్యాయం కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం గెలిచాడు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన అతను వరుసగా రెండో పసిడి సాధించాడు. దీపక్‌ పునియా పట్టుకు సైతం స్వర్ణం దక్కింది. రియో ఒలింపిక్స్‌ కాంస్యం తర్వాత అంచనాలను అందుకోలేకపోయిన సాక్షి మలిక్‌ కూడా బంగారు పతకం సాధించింది. అన్షు మలిక్‌ రజతం, దివ్య, మోహిత్‌ కాంస్యం గెలిచారు.

కామన్వెల్త్‌ క్రీడల్లో భారత రెజ్లర్లు మరోసారి అదరగొట్టారు. శుక్రవారం పురుషుల 65 కేజీల విభాగంలో బజ్‌రంగ్‌ పునియా 9-2తో లాచ్లన్‌ మెక్‌నీల్‌ (కెనడా)ను చిత్తుచేసి టైటిల్‌ నిలబెట్టుకున్నాడు. అదును కోసం ఎదురు చూసిన బజ్‌రంగ్‌ ప్రత్యర్థి కాలును లక్ష్యంగా చేసుకుని తలపడ్డాడు. కాలు ఎత్తి కిందపడేసి ప్రత్యర్థి మీదకు చేరిన అతను 3-0తో ఆధిక్యం సాధించాడు. కానీ మధ్యలో ప్రత్యర్థికి రెండు పాయింట్లు కోల్పోయాడు. తిరిగి బలంగా పుంజుకున్న అతను మరోసారి ప్రత్యర్థి కాలిని ఎత్తి కిందపడేసి 6-2తో తిరుగులేని ఆధిక్యం సాధించాడు. చివర్లో మరింత దూకుడు ప్రదర్శించి వరుసగా రెండో స్వర్ణాన్ని ఖాతాలో వేసుకున్నాడు. మొత్తంగా అతనికిది మూడో పతకం. 2014లో 61 కేజీల విభాగంలో రజతం నెగ్గిన అతను.. నాలుగేళ్ల క్రితం 65 కేజీల ఛాంపియన్‌గా నిలిచాడు.

మహిళల 62 కేజీల ఫైనల్లో సాక్షి మలిక్‌.. గోంజాలెజ్‌ (కెనడా)ను కిందపడేసి విజయాన్ని అందుకుంది. మొదట్లో ప్రత్యర్థిని పడగొట్టేందుకు విఫల యత్నం చేసిన సాక్షి కింద పడిపోవడంతో ప్రత్యర్థికి రెండు పాయింట్లు దక్కాయి. పాయింట్లు సమం చేసేందుకు ఆమె పోరాడింది. కానీ తొలి మూడు నిమిషాలు ముగిసే సరికి 0-4తో వెనకబడింది. విరామానంతరం ఒక్కసారిగా ప్రత్యర్థిని ఎత్తిపడేసి, పైకి లేవకుండా అలాగే మ్యాట్‌కు అదిమి పట్టిన సాక్షి విజయాన్ని అందుకుంది. ఇక 86 కేజీల ఫైనల్లో దీపక్‌ పునియా 3-0తో ఈ విభాగంలో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ పాకిస్థాన్‌ రెజ్లర్‌ మహ్మద్‌ ఇనామ్‌ను ఓడించాడు. మహిళల 57 కేజీల ఫైనల్లో పుట్టిన రోజు నాడు అన్షు 3-7తో ఒడునాయో (నైజీరియా) చేతిలో ఓడి రజతం అందుకుంది. 68 కేజీల విభాగంలో దివ్య కక్రాన్‌ కాంస్యం గెలిచింది. పతక పోరులో ఆమె టోంగా రెజ్లర్‌ టైగర్‌ లైలీని ఓడించింది. 125 కేజీల కాంస్య పోరులో మోహిత్‌ గ్రెవాల్‌ 6-0తో అరోన్‌ (జమైకా)పై విజయం సాధించాడు.

సుధీర్‌ స్వర్ణ కాంతులు
భారత పారా పవర్‌లిఫ్టర్‌ సుధీర్‌ కుమార్‌ సత్తా చాటాడు. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో పురుషుల హెవీ వెయిట్‌ విభాగంలో స్వర్ణంతో మెరిశాడు. ఈ విభాగంలో తొలి ప్రయత్నంలో 208 కేజీలు ఎత్తిన 27 ఏళ్ల సుధీర్‌.. తర్వాత 212 కేజీలు లిఫ్ట్‌ చేశాడు. ఆపై 217 కేజీలు ఎత్తే ప్రయత్నంలో విఫలమయ్యాడు. మొత్తం మీద 134.5 పాయింట్లతో క్రీడల రికార్డును సృష్టిస్తూ సుధీర్‌ పసిడి గెలుచుకున్నాడు. క్రిస్టియన్‌ (నైజీరియా, 133.6 పాయింట్లు) రజతం గెలవగా, మికీ యూల్‌ (స్కాట్లాండ్‌, 130.9 పాయింట్లు) కాంస్యం సాధించాడు. టోక్యో పారాలింపిక్స్‌లో టేబుల్‌ టెన్నిస్‌లో రజతం గెలిచిన భవీనా పటేల్‌ కామన్వెల్త్‌ క్రీడల్లోనూ పతకం ఖాయం చేసుకుంది. సింగిల్స్‌లో ఆమె ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీస్‌లో భవీనా 3-0తో బెయిలీ (ఇంగ్లాండ్‌)ను చిత్తు చేసింది.

కామన్వెల్త్‌లో ఈనాడు

  • అథ్లెటిక్స్‌: మంజు బాల, మహిళల హ్యామర్‌త్రో ఫైనల్‌ (రా.11.30 నుంచి); మహిళల 4×100 మీ రిలే, హిమదాస్‌, ద్యుతిచంద్‌, శర్బాని, సిమి (సా.4.45 నుంచి)
  • బాక్సింగ్‌ (సెమీస్‌): అమిత్‌ ఫంగాల్‌ (సా.3.30 నుంచి); నిఖత్‌ జరీన్‌ (రా.7.15 నుంచి)
  • హాకీ: పురుషుల సెమీస్‌, భారత్‌ × దక్షిణాఫ్రికా (రా.10.30 నుంచి)
  • క్రికెట్‌: మహిళల సెమీస్‌, భారత్‌ × ఇంగ్లాండ్‌ (మ.3.30 నుంచి)
  • టేబుల్‌ టెన్నిస్‌: శ్రీజ-శరత్‌కమల్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌ సెమీస్‌ (సా.6 నుంచి)రెజ్లింగ్‌ (సా.3 నుంచి) వినేశ్‌ ఫొగాట్‌; రవికుమార్‌ దహియా; పూజ గెహ్లాట్‌; దీపక్‌

ఇవీ చదవండి:సిరీస్​పై భారత్​ కన్ను.. విండీస్‌తో చివరి రెండు టీ20లు.. కళ్లన్నీ శ్రేయస్‌పైనే

ఈ క్రికెటర్ల జెర్సీ నెంబర్ల వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

Last Updated : Aug 6, 2022, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details