స్పెయిన్ ఆతిథ్యమిచ్చిన ఫుట్‌బాల్ టోర్నీ 'కాటిఫ్ కప్'లో భారత మహిళా క్రీడాకారిణులు అద్భుత ప్రదర్శన చేశారు. నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండింటిలో గెలిచారు. బొలీవియా, మారిటేనియా దేశాలపై విజయం సాధించి... విల్లారియల్, స్పెయిన్ అండర్-19 చేతిలో ఓడిపోయారు. ఫలితంగా మూడో స్థానంతో సరిపెట్టుకున్న మహిళా జట్టుకు మంచి ప్రదర్శనకు గానూ 'ఫెయిర్ ప్లే' ట్రోఫీ లభించింది.
2018 ఎడిషన్ కన్నా ఈ సారి గొప్ప ప్రదర్శన ఇచ్చారని కాటిఫ్ టోర్నీ అధ్యక్షుడు ఎలిస్యూ గోమెజ్ భారత ఆటగాళ్లపై ప్రశంసలు కురిపించారు.
" భారత మహిళలు గతేడాది కన్నా బాగా ఆడారు. వారి ఆటను టోర్నీ సంఘం గుర్తించింది. యుద్ధంలో వీరుల్లా తలపడిన భారత జట్టు ప్రదర్శనకు కాటిఫ్ కప్ అభిమానులు ముగ్ధులయ్యారు. ఆతిథ్య దేశంతో మ్యాచ్‌లోనూ చాలా సంయమనంతో వ్యవహరించారు. 2020లో ఇంతకంటే మంచి ప్రదర్శన చేయాలని ఆశిస్తున్నా. వారి ఆటతీరు మెచ్చుకుని ఫెయిర్‌ప్లే ట్రోఫీ అందజేస్తున్నాం".
- ఎలిస్యూ గోమెజ్ , కాటిఫ్ టోర్నీ అధ్యక్షుడు
మ్యాచ్ అనంతరం భారత జట్టు కోచ్ మయ్మోల్ రాఖీని కలిసిన ఎలిస్యూ.. ఆమెకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు.
" ఈ ఏడాది మంచి ప్రదర్శన చేశాం. టోర్నీ నిర్వాహకులు ఆటను గుర్తించారు. రెండు మ్యాచ్‌లు ఓడిపోయినా గతేడాది కన్నా ఇప్పుడు గొప్పగా రాణించినందుకు మంచి ప్రశంసలు దక్కాయి".
-రాఖీ, భారత మహిళా ఫుట్‌బాల్ ప్రధాన కోచ్