తెలంగాణ

telangana

ETV Bharat / sports

డాకర్‌ ర్యాలీలో ప్రమాదం... ఆసుపత్రిలో భారత రేసర్‌ - డాకర్ ర్యాలీ 2021

డాకర్​ ర్యాలీలో భారత్​ తరఫున చరిత్ర సృష్టించిన రేసర్ సంతోష్.. అదే రేసులో ప్రమాదానికి గురయ్యాడు. ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

indian racer santhosh
రేసర్ సంతోష్

By

Published : Jan 8, 2021, 7:52 AM IST

ప్రపంచంలోనే కఠినమైన మోటర్‌ సైకిల్‌ రేసు.. డాకర్‌ ర్యాలీలో భారత రేసర్‌ సీఎస్‌ సంతోష్‌ ప్రమాదానికి గురయ్యాడు. సౌదీ అరేబియాలో జరుగుతున్న నాలుగో దశ రేసులో తన ద్విచక్ర వాహనం క్రాష్‌ అయ్యింది. దీంతో గాయాలపాలైన అతణ్ని హెలికాప్టర్‌లో రియాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించడం కోసం వైద్యులు.. అతనికి తాత్కాలిక కోమా స్థితిని కల్పించారు. అతణ్ని 24 గంటల పరిశీలనలో ఉంచారు.

రేసర్ సంతోష్

బెంగళూరుకు చెందిన 37 ఏళ్ల సంతోష్‌.. హీరో మోటోస్పోర్ట్స్‌ తరపున ఈ ర్యాలీ బరిలో నిలిచాడు. "వైద్యుల ప్రాథమిక సమాచారం ప్రకారం అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. కుడి భుజం స్థానభ్రంశం, తలకు దెబ్బ మినహా పెద్దగా శరీరంపై ఎలాంటి గాయాలు కాలేదు. తాజా స్కానింగ్‌ ఫలితాల ప్రకారం అతను పూర్తిగా కోలుకోవడానికి ప్రధాన ఇబ్బందులేవీ లేవని తేలింది. అతను త్వరగా కోలుకోవాలని మాతో కలిసి ప్రార్థించండి" అని హీరో మోటోస్పోర్ట్స్‌ ట్వీట్‌ చేసింది.

ప్రమాద ఘటనకు వైద్య సిబ్బంది చేరుకున్న తర్వాత అతను స్పృహ కోల్పోయినట్లు తెలిసింది. కంకర రోడ్డులో సాగిన ఈ దశ రేసులో 135 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత అతను ప్రమాదానికి గురయ్యాడు. నిరుడు ఇదే దశ రేసులో హీరో మోటోస్పోర్ట్స్‌ రైడర్‌ పాలో గాన్‌కాల్వ్‌స్‌ ప్రమాదం బారిన పడి ప్రాణాలు విడిచాడు.

డాకర్‌ ర్యాలీలో సంతోష్‌ పాల్గొనడం ఇది ఏడో సారి. 2015లో తొలిసారి ఈ రేసును పూర్తిచేసి ఆ ఘనత సాధించిన మొదటి భారత రేసర్‌గా అతను చరిత్ర సృష్టించాడు. మరో రెండుసార్లు అతడు రేసు పూర్తిచేశాడు. 2013 అబుదాబి ఎడారి ఛాలెంజ్‌ సందర్భంగానూ సంతోష్‌ గాయపడ్డాడు.

అమ్మో.. ఈ రేసు

డాకర్‌ రేసు.. ఈ పేరు వినగానే చాలా మంది రేసర్లు అది 'డెత్‌ రేసు' కదా అని చెబుతుంటారు. ప్రపంచంలోనే ఇది ప్రమాదకరమైన రేసు కావడమే అందుకు కారణం. ఈ రేసు చరిత్రలో ఇప్పటివరకూ సుమారు 75 మంది ప్రాణాలు విడిచారంటేనే ఇది ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకోవచ్చు. అత్యంత కఠిన పరిస్థితుల్లో.. కొండల్లో, గుట్టల్లో, మంచుల్లో, బురదలో, ఇసుకలో, మట్టిలో, కంకరలో.. ఇలా సవాలు విసిరే మార్గాల్లో రేసర్లు బైక్‌ను నడపాల్సి ఉంటుంది. అది కూడా ఒక్క రోజులో ముగిసేది కాదు. ఒక్క ప్రాంతానికే పరిమితం కాదు. తొలిసారి 1978లో ఈ డాకర్‌ రేసును నిర్వహించారు. ఫ్రాన్స్‌లోని పారిస్‌ నుంచి సెనెగల్‌లోని డాకర్‌ వరకూ 10 వేల కిలోమీటర్ల దూరం ఆ రేసు సాగింది. అందుకే ఈ రేసుకు 'డాకర్‌' అనే పేరు వచ్చింది.

ఎన్నో సవాళ్లతో, ప్రమాదాలతో కూడుకున్నప్పటికీ ఈ రేసుకు ఆదరణ పెరుగుతూనే వచ్చింది. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి రేసర్లు గమ్యాన్ని చేరాల్సి ఉంటుంది. ఇదివరకు మూణ్నాలుగు దేశాలను దాటుకుంటూ ఈ రేసు సాగుతుండేది. కానీ ఈ ఏడాది రేసును సౌదీ అరేబియాకే పరిమితం చేశారు. ఈ నెల 2న ప్రారంభమైన ఈ రేసు 16న ముగుస్తుంది. కఠినమైన మార్గాలను దాటుకుంటూ రేసర్లు 7646 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. ఈ దూరాన్ని 12 దశలుగా విభజించారు. అందులో సుదీర్ఘమైన దశ నాలుగోదే. అందులో భాగంగా రేసర్లు 813 కిలోమీటర్లు ప్రయాణించారు.

ఒక్కో దశ దాటిన తర్వాత ప్రతి రేసర్‌ తమ జట్టు బేస్‌ క్యాంప్‌ను చేరుకోవాలి. అక్కడ విశ్రాంతి తీసుకోవచ్చు. గాయాలైతే చికిత్స చేయించుకోవచ్చు. మరుసటి రోజు రేసుకు సిద్ధంగా ఉండాలి. రేసుల్లో పాల్గొన్న వాళ్లందరూ లక్ష్యాన్ని చేరుకోలేరు. మధ్యలోనే చాలా మంది నిష్క్రమిస్తారు. అయినప్పటికీ ఎంతో మంది ఈ రేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని లక్ష్యాన్ని చేరేందుకు ప్రాణాలు పెట్టి బైక్‌ను పరుగులు పెట్టిస్తారు.

ఇదీ చూడండి:రేసర్​ హామిల్టన్​కు అరుదైన గౌరవం

ABOUT THE AUTHOR

...view details