ప్రపంచ టేబుల్ టెన్నిస్(టీటీ) చరిత్రలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా భారత పురుషుల జట్టు.. అత్యుత్తమంగా 8వ ర్యాంక్ సాధించింది. డిసెంబర్ 3న ఈ ర్యాంకింగ్స్ విడుదల చేసింది అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య(ఐటీటీఎఫ్).
తాజా జాబితా ప్రకారం చైనా, జపాన్, జర్మనీ మొదటి మూడు స్థానాల్లో కొనసాగుతున్నాయి. గతేడాది 13వ ర్యాంక్‌లో ఉన్న భారత్.. 5 స్థానాలు మెరుగుపర్చుకుంది. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు మెరుగైన ఆటతీరు ప్రదర్శించడమే ఇందుకు కారణం.
భారత ఆటగాళ్లలో సత్యన్ 30, శరత్ కమల్ 36, హర్మీత్ దేశాయ్ 104 ర్యాంకుల్లో ఉన్నారు. భారత్, ఆస్ట్రియా జట్లు చెరో 272 పాయింట్ల చొప్పున సాధించి సమానస్థితిలో ఉన్నాయి. అయితే సత్యన్, శరత్ కమల్ వ్యక్తిగతంగా మొదటి టాప్-40లో నిలవడం వల్ల భారత్ 8, ఆస్ట్రియా 10 ర్యాంకులు సాధించాయి.
దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణాలు..
కాఠ్మాండు వేదికగా జరుగుతోన్న దక్షిణాసియా క్రీడల్లో.. భారత పురుషుల, మహిళల టీటీ జట్లు స్వర్ణాలు కైవసం చేసుకున్నాయి. పురుషులు నేపాల్ జట్టుపై.. మహిళలు శ్రీలంకపై గెలిచారు. ఇరు జట్లు 3-0 తేడాతోనే విజయం సాధించాయి.
పసిడి పతకాలతో భారత పురుషుల బృందం(ఎడమ నుంచి రెండోది) స్వర్ణాలతో భారత మహిళల బృందం(ఎడమ నుంచి రెండో గ్రూప్)