తెలంగాణ

telangana

ETV Bharat / sports

Neeraj Chopra World Ranking : జావెలిన్‌లో నీరజ్​ నం.1.. ఆ స్టార్ అథ్లెట్​ను వెనక్కి నెట్టి!​ - ప్రపంచ అథ్లెటిక్స్‌ ర్యాంకింగ్స్‌లో నీరజ్ చోప్రా

స్టార్‌ అథ్లెట్​ నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Neeraj Chopra World Ranking
Neeraj Chopra

By

Published : May 23, 2023, 6:51 AM IST

Updated : May 23, 2023, 7:25 AM IST

జావెలిన్‌ ప్రపంచంలో అద్భుత విజయాలను సాధిస్తున్న 25 ఏళ్ల స్టార్‌ అథ్లెట్​ నీరజ్‌ చోప్రా మరో అరుదైన ఘనతను తన ఖాతాలోకి వేసుకున్నాడు. జావెలిన్‌ త్రోలో నంబర్‌వన్‌ ర్యాంకు సాధించిన తొలి భారతీయుడిగా ఈ ఒలింపిక్‌ ఛాంపియన్​ తన పేరిట ఓ నయా చరిత్రను లిఖించుకున్నాడు. ప్రపంచ అథ్లెటిక్స్‌ తాజా ర్యాంకింగ్స్‌లో నీరజ్‌ 1455 పాయింట్లతో.. ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్ ని వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. ఇక 1416 పాయింట్లతో మూడో స్థానంలో జాకుబ్‌ వాద్లెచ్‌ ఉన్నారు. మరోవైపు ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో నంబర్‌వన్‌ అయిన తొలి భారత అథ్లెట్‌గా కూడా నీరజ్‌ నిలిచాడు.

గత ఐదేళ్లుగా అంతర్జాతీయ స్థాయిలో నీరజ్‌ నిలకడగా రాణిస్తున్నాడు. వెళ్లిన ప్రతి పోటీలోనూ విజయాన్ని కైవసం చేసుకుంటున్నాడు. అన్నీ అంతర్జాతీయ వేదికలపై నీరజ్‌ పతకాల పంట పండిస్తూ చరిత్ర సృష్టిస్తున్నాడు. 2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్​లో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ గెలిచాడు. ఆ మెగా ఈవెంట్​లో జావెలిన్​ను 87.58 మీటర్ల దూరానికి విసిరాడు.

ఇక ఆ ఒలింపిక్స్ తర్వాతి నుంచి రెండేళ్లుగా తన ఫామ్​ను కొనసాగించిన నీరజ్.​. జ్యూరిక్​లో జరిగిన డైమండ్​ లీగ్​లోనూ తన సత్తా చాటాడు. ఆ ఈవెంట్​లో సుమారు 89.63 మీటర్ల దూరానికి జావెలిన్​ను విసిరి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. తాజాగా జరిగిన దోహా డైమండ్ లీగ్ ఈవెంట్​లో 88.67 మీటర్ల దూరానికి విసిరి.. మరో గోల్డ్​ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ విజయంతో అతడు ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్థానానికి దూసుకెళ్లాడు.

2024 పారిస్ ఒలింపిక్స్ లక్ష్యంగా తాను నిలకడగా రాణిస్తున్నట్లు దోహా ఈవెంట్ తర్వాత నీరజ్ చెప్పాడు. టోక్యో ఒలింపిక్స్​తో స్టార్​గా ఎదిగిన నీరజ్​.. తన ఫామ్​ను కొనసాగిస్తునే ఉన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏ ఇతర భారతీయుడికీ సాధ్యం కాని విజయాలతో ర్యాంకుల్లోనూ నంబర్ వన్​గా నిలుస్తున్నాడు. ఇక నెదర్లాండ్స్‌లో జూన్‌ 4న జరిగే ఫానీ బ్లాంకర్స్‌ కొయెన్‌ (ఎఫ్‌బీకే) ఈవెంట్ల కోసం త్వరలోనే బరిలో దిగబోతున్నాడు. ఈ ఏడాది ఎలాగైనా 90 మీటర్ల దూరాన్ని అందుకోవాలనే పట్టుదలతో ఉన్న నీరజ్‌.. ఎఫ్‌బీకే టోర్నీలో అయినా ఆ లక్ష్యాన్ని సాధిస్తాడని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎఫ్​బీకే గేమ్స్ అనేది డచ్ అథ్లెటిక్స్ మీట్. ఇది ఏటా హెంగెలోలోని ఫ్యానీ బ్లాంకర్స్-కోయెన్ స్టేడియంలో జరుగుతుంది. ఈ ఒక్క రోజు ఈవెంట్​ను మీట్ ఎలైట్-లెవల్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ గోల్డ్ సిరీస్‌లో భాగంగా నిర్వహిస్తున్నారు. కాగా 2023 సంవత్సరంలో నీరజ్ చోప్రాకు ఇది రెండవ ఈవెంట్.

Last Updated : May 23, 2023, 7:25 AM IST

ABOUT THE AUTHOR

...view details