ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో అద్భుత ప్రదర్శనతో సంతోషంలో మునిగిపోయిన భారత క్రీడా రంగానికి ఎదురు దెబ్బ. భారత ఫుట్‌బాల్‌కు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) రెడ్ కార్డు చూపించింది. అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్)పై నిషేధం విధిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. అంతే కాకుండా ఈ ఏడాది అక్టోబర్ 11 నుంచి 30 వరకు స్వదేశంలో జరగాల్సిన అండర్-17 మహిళల ప్రపంచకప్‌ను ప్రస్తుతానికి భారత్‌లో నిర్వహించడం లేదని వెల్లడించింది. 85 ఏళ్ల చరిత్రలో ఏఐఎఫ్‌ఎఫ్‌పై నిషేధం పడడం ఇదే తొలిసారి. ఏఐఎఫ్‌ఎఫ్‌లో బయట వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో ఫిఫా ఈ నిర్ణయం తీసుకుంది. క్రీడా సంఘాల్లో పారదర్శకత రావాలని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ వ్యాఖ్యానించిన ఒక్క రోజులోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం.
"బయటి వ్యక్తుల ప్రభావం ఎక్కువగా ఉందనే కారణంతో తక్షణమే ఏఐఎఫ్‌ఎఫ్‌ను నిషేధించాలని ఫిఫా మండలి బ్యూరో ఏకగ్రీవంగా నిర్ణయించింది. ఫిఫా చట్టాలను అది ఉల్లంఘించింది. ఏఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ అధికారాలను పొందేలా పాలకుల కమిటీ (సీఓఏ)ని ఏర్పాటు చేయాలనే ఉత్తర్వును రద్దు చేస్తే అప్పుడు ఈ నిషేధాన్ని ఎత్తివేస్తాం. సమాఖ్య రోజువారీ కార్యకలాపాలపై తిరిగి ఏఐఎఫ్‌ఎఫ్ పూర్తి నియంత్రణ సాధించాల్సి ఉంటుంది. ఈ నిషేధం కారణంగా అక్టోబర్‌లో భారత్‌లో జరగాల్సిన అండర్-17 మహిళల ప్రపంచకప్‌ను ప్రస్తుతానికి షెడ్యూల్ ప్రకారం ఈ దేశంలో నిర్వహించడం లేదు. ఈ టోర్నీ నిర్వహణ దిశగా అవసరమైన చర్యలను ఫిఫా పరిశీలిస్తుంది. ఈ విషయాన్ని అవసరమైనప్పుడు మండలి బ్యూరో దృష్టికి తీసుకెళ్తుంది. ఈ నిషేధం ప్రకారం ఏఐఎఫ్‌ఎఫ్, దీని ప్రతినిధులు, సభ్యులు ఫిఫా కార్యక్రమాల నుంచి కానీ లేదా కోర్సులు, శిక్షణ నుంచి ఎలాంటి లబ్ది పొందరు. భారత క్రీడా మంత్రిత్వ శాఖతో ఈ విషయంపై ఫిఫా నిరంతరం చర్చలు జరుపుతోంది. ఈ విషయంలో ఇప్పటికీ సానుకూల ఫలితం రాబట్టవచ్చనే నమ్మకంతో ఉన్నాం" అని ఫిఫా తెలిపింది.
అసలేం జరిగింది?
గత కొన్ని రోజులుగా నిషేధం తప్పదంటూ ఏఐఎఫ్‌ఎఫ్‌ను హెచ్చరిస్తూ వచ్చిన ఫిఫా చివరకు అన్నంత పని చేసింది. క్రీడా మంత్రిత్వ శాఖలోని సీనియర్ ప్రతినిధులు, సీఓఏ సభ్యులతో ఫిఫా నలుగురు ప్రతినిధుల బృందం శుక్రవారం, సోమవారం చర్చలు జరిపింది. ఆ తర్వాత నిషేధాన్ని ప్రకటించింది. అసలు ఫిఫా ఈ నిర్ణయం తీసుకోవడానికి వెనక చాలా తంతు నడిచింది. 2020 డిసెంబర్‌లో ఏఐఎఫ్‌ఎఫ్ అధ్యక్షుడిగా మూడో సారి ప్రఫుల్ పటేల్ పదవీ కాలం ముగిసింది. కానీ అతను ఎన్నికలు నిర్వహించకుండా 2017 నుంచి సుప్రీం కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసును ఉపయోగించుకుంటూ పదవిలో ఉన్నాడు. నియమావళి ప్రకారం 12 ఏళ్లకు మించి ఎవరూ ఆ పదవిలో కొనసాగకూడదు. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం కొత్త నియమావళి అందుబాటులోకి వచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహిస్తామన్నాడు. కానీ ఈ ఏడాది మే 18న అతణ్ని పదవి నుంచి తప్పించడంతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీని కోర్టు రద్దు చేసింది. ఏఐఎఫ్‌ఎఫ్ ఎన్నికల నిర్వహణ, నూతన నియమావళిని రూపొందించడం కోసం మాజీ న్యాయమూర్తి జస్టిస్ అనిల్ రమేశ్ దవె సారథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ ఎస్‌వై ఖురేషీ, భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్ భాస్కర్ గంగూలీతో కూడిన సీఓఏను నియమించింది.
సీఓఏతో చర్చలు జరిపిన ఫిఫా- ఆసియా ఫుట్‌బాల్ సమాఖ్య బృందం జులై 31లోపు కొత్త నియమావళికి ఆమోదం పొందాలని, సెప్టెంబర్ 15లోపు ఎన్నికలు నిర్వహించాలని గడువు విధించింది. నియమావళి తుది ముసాయిదాను ఫిఫాకు పంపిన సీఓఏ.. ఆమోదం కోసం కోర్టుకూ సమర్పించింది. కానీ సీఓఏ రూపొందించిన ఈ నియమావళిపై ఏఐఎఫ్‌ఎఫ్ రాష్ట్ర సంఘాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. అందులో కొన్ని విషయాలు అర్థరహితంగా ఉన్నాయని అవి ఫిఫాకు లేఖ రాశాయి. ఏఐఎఫ్‌ఎఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సీఓఏ సూచించినట్లుగా కో ఆప్షన్ సభ్యులుగా మాజీ ఆటగాళ్ల శాతం 50 కాకుండా 25గా ఉండాలని ఫిఫా ప్రతిపాదించింది. కానీ దీన్ని పట్టించుకోకుండా సీఓఏ ఎన్నికల ప్రక్రియ మొదలెట్టింది. ఈ నెల 28న ఎన్నికలు నిర్వహించాలనుకుంది. అందుకు వీలుగా 36 మంది మాజీ ప్లేయర్లతో సహా ఓటర్ల జాబితాను తయారు చేసింది. రిటర్నింగ్ అధికారిని కూడా నియమించింది. బుధవారం నుంచి శుక్రవారం వరకూ నామినేషన్లు స్వీకరించాల్సి ఉంది. వ్యక్తిగత హోదాలో మాజీ ఆటగాళ్లను ఓటర్ల జాబితాను చేర్చడంపై ఫిఫా అసంతృప్తి వ్యక్తం చేసింది. చివరకు సీఓఏ తీరుపై అసహనంతో నిషేధం విధించింది. చర్చలు ఇంకా పూర్తి కాకుండానే ఫిఫా నిషేధం విధించడంపై సీఓఏ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు, ఫిఫాకు ఆమోదయోగ్యంగానే ఎన్నికలు నిర్వహించాలనుకున్నామని ఆ కమిటీ తెలిపింది. భారత ఫుట్‌బాల్‌ను తిరిగి సరైన దారిలోకి తీసుకొద్దామనే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఫిఫా ఈ నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని సీఓఏ ఛైర్మన్ విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అనిల్ దవె పేర్కొన్నారు.