విశ్వనాథన్ ఆనంద్ ప్రపంచ ఛాంపియన్ కావడం.. కోనేరు హంపి ర్యాపిడ్ ప్రపంచ విజేతగా నిలవడం.. చిన్న వయసులోనే ప్రజ్ఞానంద, నిహాల్ సరీన్ లాంటి వాళ్లు గ్రాండ్‌మాస్టర్ హోదా సంపాదించడం.. ఇలా ఎన్నో ఘనతలు ఉన్నాయి భారత చెస్ చరిత్రలో!
కానీ వీటన్నింటినీ మరిపిస్తూ.. అభిమానులను మురిపిస్తూ భారత్ ఓ గొప్ప విజయాన్ని సాధించింది. చెస్‌కు తలమానికమైన ఒలింపియాడ్‌లో ఛాంపియన్‌గా నిలిచి ఔరా అనిపించింది.
96 ఏళ్ల ఒలింపియాడ్ చరిత్రలో ఎన్నోసార్లు టోర్నీకి వెళ్లి 2014 (కాంస్యం)లో మినహాయించి రిక్తహస్తాలతో తిరిగొచ్చిన భారత్.. తొలిసారి స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. మొదటిసారి ఆన్‌లైన్‌లో నిర్వహించిన టోర్నీలో రష్యా లాంటి బలమైన జట్టును ఫైనల్లో ఎదుర్కొని ఉమ్మడిగా పసిడి పతకాన్ని అందుకుంది. నాటకీయంగా సాగిన ఫైనల్లో మొదట భారత బృందం ఓడినా.. సాంకేతిక కారణాలతోనే వెనకబడిందని సమీక్షలో తేల్చిన ప్రపంచ చెస్ సమాఖ్య.. రష్యాతో పాటు సంయుక్తంగా భారత్‌ను విజేతగా ప్రకటించింది. తెలుగు తేజాలు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ ఈ చరిత్రాత్మక విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం.
ఆనంద్, ప్రజ్ఞానంద, విదిత్ భారత చెస్‌లో అపురూపమైన విజయం! అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయే గెలుపు! ఒలింపియాడ్‌లో మన బృందానికి పసిడి కళ వచ్చింది.. దాదాపు శతాబ్ద చరిత్ర ఉన్న ఈ టోర్నీలో కంచు తప్ప వేరే పతకం తెలియని భారత్ ఏకంగా స్వర్ణాన్నే కొట్టేసింది. రష్యా లాంటి బలమైన జట్టును దీటుగా ఎదుర్కొన్న విదిత్ బృందం చెస్ చరిత్రలో ఓ అధ్యాయాన్ని లిఖించింది.
తొలి రౌండ్ సమం
ఫైనల్లో తొలి రౌండ్లో భారత్-రష్యా హోరాహోరీ ఆడాయి. నెపొమ్‌నియాచితో హరికృష్ణ డ్రా చేసుకోగా.. డానియల్ దుబోవ్‌తో కెప్టెన్ విదిత్ గుజరాతి పాయింట్లు పంచుకున్నాడు. లాగ్‌నోతో హంపి.. కోస్తెనిక్‌తో హారిక డ్రా చేసుకోగా.. సరానాతో ప్రజ్ఞానంద, షువలోవాతో దివ్య దేశ్‌ముఖ్ పాయింట్లు పంచుకోవడంతో తొలి రౌండ్లో భారత్, రష్యా 3-3 పాయింట్లతో సమఉజ్జీలుగా నిలిచాయి. దీంతో రెండో రౌండ్‌పైనే అందరి దృష్టి నిలిచింది. కానీ ఈ రౌండ్లో పరిణామాలు అనూహ్యంగా మారిపోయాయి.
అప్పుడు ఆర్మేనియా..ఇప్పుడు భారత్
రెండో రౌండ్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారత్‌తో సెమీఫైనల్లో ఇంటర్నెట్‌కు అంతరాయం కలిగిందని ఆరోపిస్తూ ఆర్మేనియా పోటీల నుంచి తప్పుకుంది. కానీ ఫైనల్లో అదే పరిస్థితి భారత్‌కు ఎదురైంది. కానీ ఈసారి అదృష్టం మన పక్షాన నిలిచింది. రెండో రౌండ్ నిపోమ్‌నియాచితో గేమ్‌ను విశ్వనాథన్ ఆనంద్ డ్రా చేసుకోగా.. దుబోవ్‌తో విదిత్ పాయింట్లు పంచుకున్నాడు. కానీ అలెగ్జాండ్రా గోర్యాచ్‌కినా చేతిలో హంపి ఓడడంతో భారత్ వెనకబడింది. కోస్తెనిక్‌తో హారిక డ్రా చేసుకోగలిగింది. దీంతో రష్యా 2.5-1.5తో ఆధిక్యంలో నిలిచింది.
ఓడి.. గెలిచారు!
దీంతో ఫైనల్లో ఆశలు నిలబెట్టుకోవాలంటే చివరి రెండు గేమ్‌లలో మన జట్టు కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి. షువలోవాపై దివ్యదేశ్ ముఖ్, ఇసిపెంకోపై నిహాల్ ఆధిపత్యం ప్రదర్శిస్తున్న సమయంలో ఇంటర్నెట్ కనెక్షన్‌కు అంతరాయం కలిగింది. నిర్ణీత సమయంలో ఎత్తులు వేయలేకపోవడంతో భారత్ చివరి రెండు గేమ్‌లు ఓడినట్లు ప్రకటించిన ఫిడే.. రష్యాను విజేతగా తేల్చింది. అయితే దివ్య, నిహాల్ మంచి స్థితిలో ఉండి కూడా సాంకేతిక అంతరాయం కారణంగా ఓడడంతో విదిత్ బృందం.. ఫిడేకు అప్పీల్ చేసింది. మళ్లీ చివరి రెండు గేమ్‌లు నిర్వహించాలనే వాదన చేసింది. పరిస్థితిని సమీక్షించిన ప్రపంచ చెస్ సమాఖ్య (ఫిడే).. భారత్, రష్యాలను ఉమ్మడి విజేతలుగా ప్రకటించింది. నిజానికి క్వార్టర్స్‌లో ఆర్మేనియా కూడా ఇలాంటి స్థితిలోనే అప్పీల్ చేసినా.. భారత్ లాంటి గెలిచే పరిస్థితి ఆ జట్టుకు లేదు. అందుకే ఆర్మేనియా అప్పీల్‌ను ఫిడే తిరస్కరించింది.
మనకు దక్కాల్సిందే..
ఉమ్మడిగా రష్యాతో కలిసి స్వర్ణాన్ని పంచుకున్నా ఈ టోర్నీలో ఆడిన తీరు చూస్తే భారత్‌కు పసిడి గెలవడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. ఆరంభంలో బలమైన చైనాతో పాటు నాకౌట్లో ఆర్మేనియా, పోలెండ్ లాంటి జట్లను ఓడించిన విదిత్ బృందం ఫైనల్లోనూ అదే జోరు ప్రదర్శించింది. కానీ ఇంటర్నెట్‌కు అంతరాయం కలగడంతో తుది సమరంలో భారత్ ఓడినట్లు ఫిడే మొదట ప్రకటించినా.. తిరిగి మళ్లీ విజేతగా నిలవగలిగిందంటే అది మనవాళ్ల ప్రతిభ వల్లే. ఎందుకంటే ఇంటర్నెట్ ఆగే సమయానికి దివ్య దేశ్‌ముఖ్, నిహాల్ సరీన్‌లు మంచి స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా దివ్య ప్రత్యర్థిపై తిరుగులేని ఆధిక్యంలో నిలిచింది. దివ్య, నిహాల్ ఇద్దరూ గెలిచి ఉంటే పసిడి మనకే దక్కేది. ఒకవేళ దివ్య నెగ్గి.. నిహాల్ డ్రా చేసుకున్నా 3-3తో పోరు సమమై ఆర్మగెడెన్‌కు అవకాశం ఉండేది. ఇలాంటి మెరుగైన స్థితిలో ఉన్నందునే భారత్‌కు స్వర్ణం పతకం దక్కింది.
చెస్ ఒలింపియాడ్.. అలా మొదలైంది
1924 ప్యారిస్ ఒలింపిక్స్‌లో చెస్‌ను క్రీడాంశంగా ప్రవేశపెట్టాలని ప్రయత్నించారు. కానీ అప్పటికీ అమెచ్యూర్, ప్రొఫెషనల్ ఆటగాళ్ల మధ్య తేడాలను గుర్తించడం సాధ్యపడకపోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. దీంతో అదే ఏడాది, ప్యారిస్‌లోనే తొలి చెస్ ఒలింపియాడ్ నిర్వహించారు. ఆ పోటీల చివరి రోజు అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే)ను ఏర్పాటు చేశారు. మొదటి చెస్ ఒలింపియాడ్‌కు ముందు ఫిడే లేదు కాబట్టి దాన్ని అనధికార టోర్నీగా భావిస్తారు. తొలి ఫిడే అధికారిక ఒలింపియాడ్ 1927లో లండన్‌లో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం ముందు వరకూ ఈ టోర్నీ ప్రతి ఏడాది లేదా రెండేళ్లకోసారి జరిగేది. కానీ 1950 తర్వాత కచ్చితంగా రెండోళ్లకోసారి నిర్వహిస్తున్నారు. ఫిడే గుర్తింపు పొందిన దేశాలు ఈ ఒలింపియాడ్‌లో పాల్గొనవచ్ఛు 2018 నాటికి అధికారికంగా 43 ఒలింపియాడ్ టోర్నీలు జరిగాయి. కరోనా కారణంగా ఈ ఏడాది తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఒలింపియాడ్ నిర్వహించారు. పురుషులు, మహిళలు, జూనియర్ విభాగాల్లో జట్లు పోటీపడాల్సి ఉంటుంది.
ఇప్పుడే ఎందుకు అందిందంటే..
ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్‌లో భారత్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటి రష్యాతో కలిసి సంయుక్తంగా పసిడి సొంతం చేసుకుంది. అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆనంద్‌తో పాటు హరికృష్ణ, హంపి, హారిక లాంటి ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎంతో చరిత్ర కలిగిన ఒలింపియాడ్‌లో మన గత ప్రదర్శన మాత్రం నిరాశ కలిగించేదే. ఈ పసిడి మినహాయిస్తే 2014లో గెలిచిన కాంస్యమే చెప్పుకోదగింది. ఆ జట్టులో తెలుగబ్బాయి లలిత్‌బాబు కూడా ఉన్నాడు. ప్రపంచ వేదికపై సత్తాచాటిన భారత చెస్ ప్లేయర్లు ఒలింపియాడ్‌లో మాత్రం అనుకున్న స్థాయిలో రాణించలేకపోయేవాళ్లు.
అయితే వ్యక్తిగతంగా ఛాంపియన్‌షిప్‌లో పోటీపడడానికి, ఒలింపియాడ్‌లో తలపడడానికి తేడా ఉంది. ఒలింపియాడ్‌లో జట్టుగా కలిసి ఆడాలి. పురుషుల, మహిళల, జూనియర్ విభాగాల్లో గొప్పగా రాణించాలి. ఓ విభాగంలో అద్భుతంగా ఆడి, మరో విభాగంలో విఫలమైతే ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే గతంలో వైఫల్యాలు ఎదురయ్యాయి. ఈసారి పురుషుల్లో కెప్టెన్ విదిత్, ఆనంద్, హరికృష్ణ.. మహిళల్లో హంపి, హారిక, భక్తి.. జూనియర్ విభాగంలో నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, దివ్య కలిసికట్టుగా రాణించారు. ఆన్‌లైన్‌లో టోర్నీ నిర్వహించడమూ భారత్‌కు మేలు చేసిందనే చెప్పాలి.
మేమే గెలిచేవాళ్లమని అంగీకరించారు
"చెస్ ఒలింపియాడ్ ఫైనల్ వింతగా ముగిసింది. అన్ని బోర్డులు డ్రా అవడం వల్ల తొలి మ్యాచ్ డ్రాగా ముగిసింది. రెండో మ్యాచ్‌లో మూడు బోర్డులు పూర్తయ్యాయి. నేను, నిహాల్, దివ్య దేశ్‌ముఖ్ ఆడుతున్నాం. ఒక్కసారిగా సర్వర్ డౌన్ అయింది. నా గేమ్ నిమిషాల నుంచి సెకన్లకు వచ్చింది. అప్పటికీ ఎత్తులు వేశా. చివరి వరకు ఆడాను కానీ ఓటమి ఎదురైంది. సెకన్లలో ఉన్న నిహాల్, దివ్యల గేమ్‌లు టైమ్ లాస్ కింద వచ్చేశాయి. ఇద్దరూ ఓడిపోయినట్లు ప్రకటించారు. రష్యా విజేత అని చెప్పారు. అయితే సర్వర్ డౌన్ కాకముందు ఇద్దరిలో ఒకరు గెలిచే స్థితిలో ఉన్నారు. మరొకరు మెరుగైన స్థితిలో కొనసాగుతున్నారు. ఇందులో భారత క్రీడాకారుల లోపం లేదు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. ఈ విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లాం. సర్వర్ డౌన్ కాకుండా ఉంటే భారత్ గెలిచేదన్న వాదనతో అందరూ అంగీకరించారు. సమ న్యాయం కోసం భారత్, రష్యాలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. ఈ టోర్నీలో టీమ్‌ఇండియా అత్యుత్తమంగా ఆడింది. చివరి వరకు పోరాట స్ఫూర్తి కనబరిచింది."
కోనేరు హంపి, చెస్ ఛాంపియన్
"96 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా స్వర్ణం సాధించాం. 2014లో కాంస్యం సాధించడమే ఇప్పటి వరకు అత్యుత్తమ ప్రదర్శన. జట్టులో ప్రతి ఒక్కరు అద్భుతంగా ఆడారు. స్థాయికి తగ్గ ఆటతీరు కనబరిచారు. సెమీస్‌లో పోలెండ్‌పై కీలకమైన విజయం సాధించాం. పురుషుల్లో విశ్వనాథన్ ఆనంద్, మహిళల్లో నేను టాప్ బోర్డుల్లో ఆడాం. అక్కడ అత్యున్నత స్థాయిలో పోటీ ఉంటుంది. సాహసాలు చేయలేం. జాగ్రత్తగా ఆడాలి. లోయర్ బోర్డులో అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మొత్తంగా చెస్ ఒలింపియాడ్ మంచి అనుభవం. ఆన్‌లైన్‌లో జరగడం ఇదే మొదటి సారి. భౌతికంగా క్రీడాకారులంతా ఒకేచోట కలిసే అవకాశం లేదు కాబట్టి ఆన్‌లైన్‌లో నిర్వహించారు. 163 దేశాలు పాల్గొన్నాయి. మూడు నెలల క్రితం నేషన్స్ కప్‌లో భారత్ ఘోరంగా విఫలమైంది. ప్రాథమిక దశ కూడా దాటలేదు. ఇప్పుడు స్ఫూర్తిమంతమైన ప్రదర్శనతో ఒలింపియాడ్ విజేతగా నిలవడం గర్వంగా ఉంది." అని కోనేరు హంపి పేర్కొన్నారు.
ఆ విజయమే మలుపు
చరిత్ర సృష్టించిన భారత జట్టులో సభ్యురాలిని కావడం ఆనందంగా ఉంది. సర్వర్ ఆగుండకపోతే కచ్చితంగా భారత్ గెలిచేది. ఆట మళ్లీ మొదలయ్యే సమయానికి హంపికి కొంచెం సమయమే మిగలగా.. మిగతా ఇద్దరూ టైమ్ లాస్‌లో ఓడిపోయారు. భారత్ గెలిచే స్థితిలో ఉందని రష్యా కూడా అంగీకరించడం వల్ల ఇరు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. టోర్నీ ఆసాంతం భారత క్రీడాకారులు కలిసికట్టుగా ఆడారు. ఒక్కోరోజు ఒక్కొక్కరు మెరుపులు మెరిపించారు. కీలక సమయాల్లో జట్టుకు విజయాల్ని అందించారు. నా కెరీర్‌లో అత్యుత్తమ విజయాల్లో ఇదొకటి. ఇంట్లోనే ఉన్నా చాలా ఒత్తిడికి లోనయ్యా. మొత్తంగా సానుకూల ఫలితం రావడం ఆనందంగా ఉంది. గత ఒలింపియాడ్‌లో ప్రదర్శన ఆధారంగా టాప్ సీడింగ్ లభించడం వల్ల టాప్ పూల్‌లోకి వచ్చాం. చైనా కూడా మా పూల్‌లోనే ఉంది. గ్రూపు దశలో చైనాపై విజయం మలుపు. 27న ప్రిలిమినరీ ఆడకుండానే నేరుగా నాకౌట్‌కు చేరుకున్నాం. పెయిరింగ్ కూడా అనుకూలంగా వచ్చింది. సెమీస్‌లో హంపి అదరగొట్టింది. మొత్తంగా చిరస్మరణీయ విజయం.
- ద్రోణవల్లి హారిక
మాటల్లో చెప్పలేను
ఆన్‌లైన్ చెస్ ఒలింపియాడ్ గొప్పగా సాగింది. స్వర్ణ పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. సమష్టిగా రాణించి తొలిసారిగా స్వర్ణం నెగ్గాం. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్కరు స్ఫూర్తిమంతంగా ఆడారు. చివరి వరకు పోరాట స్ఫూర్తి కనబరిచారు. ఫైనల్లో తొలి మ్యాచ్‌లో టాప్ బోర్డులో విశ్వనాథన్ ఆనంద్‌కు విశ్రాంతినివ్వడం వల్ల తన స్థానంలో నేను ఆడా. వ్లాదిస్లవ్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నా. తొలి మ్యాచ్‌లో అన్ని బోర్డులు డ్రా అయ్యాయి. రెండో మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగింది. ఆనంద్, విదిత్, హారికల గేమ్‌లు డ్రా అయ్యాయి. హంపి, నిహాల్, దివ్యల గేమ్‌లు కొనసాగుతుండగా సర్వర్ సమస్య తలెత్తింది. ఆ సమయంలో నిహాల్ గెలుపు ముంగిట్లో ఉండగా.. హంపి, దివ్య మెరుగైన స్థితిలో కొనసాగుతున్నారు. సర్వర్ బాగయ్యాక నిహాల్, దివ్యలు గేమ్‌లు కోల్పోయారు. ఏకాగ్రత్త దెబ్బతినడం వల్ల హంపి ఓడిపోయింది. ఇది క్రీడాకారుల వైఫల్యం కాదు. నిర్వాహకుల నుంచి ఎదురైన సమస్య. దీన్ని అర్థం చేసుకుని భారత్, రష్యాలను సంయుక్త విజేతలుగా ప్రకటించారు. చెస్ ఒలింపియాడ్‌లో విజేతగా నిలవడం గర్వంగా ఉంది.
-పెంటేల హరికృష్ణ