చరిత్రాత్మక థామస్ కప్ విజయంతో భారత్ "బ్యాడ్మింటన్ సూపర్ పవర్"గా ఎదిగిందని దిగ్గజ షట్లర్ ప్రకాశ్ పదుకొనె అభిప్రాయపడ్డాడు. ఫైనల్లో భారత్ 3-0తో 14 సార్లు ఛాంపియన్ ఇండోనేసియాను ఓడించి తొలిసారి థామస్‌కప్‌ను గెలుచుకున్న సంగతి తెలిసిందే. "ఇంత త్వరగా భారత్ థామస్ కప్ గెలుస్తుందని అనుకోలేదు. కనీసం వచ్చే 8-10 ఏళ్లలో సాధ్యమవుతుందని అనుకోలేదు. మనం నిజంగా ఎదిగాం. భారత్‌ను ఇక గొప్ప బ్యాడ్మింటన్ శక్తిగా, ప్రమాదకర ప్రత్యర్థిగా పరిగణిస్తారు. దేశంలో బ్యాడ్మింటన్‌కు గొప్ప ఊపు వస్తుంది" అని పదుకొనె అన్నాడు.
"ఈ విజయం సమష్టి కృషి ఫలితం. ఇతర భారత షట్లర్లు సాధించిన వ్యక్తిగత విజయాలతో ఇది సమానం. అంతకన్నా ఎక్కువే కావొచ్చు. ప్రపంచంలో ఎవరినైనా ఓడించగల డబుల్స్ జోడీ పాత్ర ఈ విజయంలో కీలకం. గతంలో సింగిల్స్ ఆటగాళ్లపై ఒత్తిడి తీవ్రంగా ఉండేది. నాణ్యమైన డబుల్స్ ఆటగాళ్లు ఉండటం జట్టుకు సమతూకాన్ని తెచ్చింది. ఇక వెనక్కి తిరిగి చూడొద్దు. ఈ విజయాన్ని ఉపయోగించుకుని భారత బ్యాడ్మింటన్‌ను మరింత బోలపేతం చేయాలి" అని చెప్పాడు.