రెండో టీ-20లో ఇంగ్లాండ్ చిత్తు.. మరో సిరీస్ భారత్ కైవసం - టీమ్‌ఇండియా టీ20 సిరీస్
22:12 July 09
రెండో టీ-20లో ఇంగ్లాండ్ చిత్తు.. మరో సిరీస్ భారత్ కైవసం
IND vs ENG t20: ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. 49 రన్స్ తేడాతో గెలుపొందింది. దీంతో సిరీస్‌ను టీమ్ ఇండియా కైవసం చేసుకుంది. ఈ విజయంతో రోహిత్ శర్మ కెప్టెన్సీలో నాలుగో సిరీస్ గెలుచుకుంది టీమ్‌ఇండియా. 17 ఓవర్లలో 121 పరుగులకు ఇంగ్లాండ్‌ను భారత్ ఆల్ అవుట్ చేసింది. ఇంగ్లాండ్ జట్టులో మొయిన్ అలీ (35; 21 బంతుల్లో 3x4, 2x6), డేవిడ్ విల్లే (33 నాటౌట్; 22 బంతుల్లో 3x4, 2x6) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లు ఆది నుంచీ క్రమం తప్పకుండా వికెట్లు తీయడంతో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. భువనేశ్వర్ కుమార్ 3, బుమ్రా, చాహల్ 2 వికెట్లు తీయగా హార్దిక్ పాండ్య, హర్షల్ పటేల్ చెరో వికెట్ పడగొట్టారు.
భారత్ స్కోరు:తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (46 నాటౌట్; 29 బంతుల్లో 5x4) ఆఖరి వరకు ఒంటరిపోరాటం చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా మరోవైపు అతడు పరుగులు సాధించాడు. కాగా, టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ (31; 20 బంతుల్లో 3x4, 2x6), రిషభ్ పంత్ (26; 15 బంతుల్లో 4x4, 1x6) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ 4.5 ఓవర్లలోనే తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించారు. అయితే, అరంగేట్రం బౌలర్ రిచర్డ్ గ్లీసన్ తన వరుస ఓవర్లలో రోహిత్, కోహ్లీ (1), పంత్‌ను ఔట్ చేసి ఇంగ్లాండ్‌కు భారీ ఉపశమనం కలిగించాడు. తర్వాత సూర్యకుమార్ (15; 11 బంతుల్లో 2x4), హార్దిక్ పాండ్య (12; 15 బంతుల్లో 1x4) ఆదుకునేందుకు ప్రయత్నించినా క్రిస్‌జోర్డాన్ వారిని 11వ ఓవర్‌లో వరుస బంతుల్లో పెవిలియన్ పంపాడు. ఆపై దినేశ్ కార్తీక్ (12; 17 బంతుల్లో 1x4), జడేజా కాసేపు నెమ్మదిగా ఆడి వికెట్లు కాపాడుకున్నారు. అయితే, కీలక సమయంలో కార్తీక్ రనౌటయ్యాడు. ఈ క్రమంలోనే టెయిలెండర్లతో కలిసి పోరాడిన జడేజా చివరికి టీమ్ఇండియాకు పోరాడే స్కోర్ అందించాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోర్డాన్ 4, గ్లీసన్ 3 వికెట్లు తీశారు.
ఇదీ చదవండి:చరిత్ర సృష్టించిన రిబకినా.. వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ కైవసం