తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైకల్యాన్ని ఓడించారు.. విజయాన్ని సాధించారు! - tokyo paralympic indian winners list

దివ్యాంగులైతేనేమి.. అంతర్జాతీయ సమాజం ముందు దేశాన్ని గర్వించేలా చేశారు. తమ వైకల్యాన్ని ఓడించి.. అద్భుత విజయాలు సాధించారు. ఆ గెలుపు చప్పట్లతోనే తమను హేళన చేసిన వారికి సమాధానం చెప్పారు. అడుగు ముందుకు వేయనీయకుండా నలువైపుల నుంచీ ఉక్కిరిబిక్కిరి చేసే ముళ్ల కంచెల్ని దాటి ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఒకరు ఒంటిచేత్తో.. మరొకరు ఒంటి కాలితో ఇలా.. ఎవరి పంథాలో వారు టోక్యో పారాలింపిక్స్​లో పతకాల పండించారు. వారెవరో తెలుసుకుందాం.

Paralympics winner
పారాలింపిక్స్​ విజేతలు

By

Published : Sep 12, 2021, 10:57 AM IST

గెలుపు.. పలకడానికి చాలా చిన్న మాటే కానీ దాని వెనక పెద్ద కథే ఉంటుంది. కొన్నేళ్లపాటు అలుపులేని సాధన, లెక్కలేనన్ని త్యాగాలూ చేస్తేనే ఎవరైనా జిల్లానీ, రాష్ట్రాన్నీ, దేశాన్నీ దాటి అంతర్జాతీయ వేదికల పైకి వెళ్లగలుగుతారు. ఎందరికో ప్రేరణ అవుతారు. అలాంటిది ఒంటిచేత్తోనో, అవిటికాలితోనో, చక్రాలకుర్చీతోనో ఆ గెలుపును సాధించాలనుకుంటే.. అది నిత్య పోరాటమే. ఆ విజయం ఓ అద్భుతమే. అలాంటి అద్భుతాన్ని సాధ్యం చేసి చూపారు వీళ్లు. దివ్యాంగుల్ని అడుగుముందుకు వేయనీయకుండా నలువైపుల నుంచీ ఉక్కిరిబిక్కిరి చేసే ముళ్ల కంచెల్ని దాటి విజయతీరాల్ని చేరారు. ఆ క్రమంలో ఏర్పడ్డ గాయాలని గెలుపు గేయాలుగా ఆలపించారు. ఒక్క ఆటలపోటీల్లోనే కాదు, జీవనపోరాటంలో అయినా.. ఇంతకుమించిన స్ఫూర్తిప్రదాతలు మనకు ఇంకెవరుంటారు!

గురి తప్పదు!

'లక్ష్యం ముందు వైకల్యం ఓడిపోయింది' అనడానికి ప్రత్యక్ష నిదర్శనం.. పందొమ్మిదేళ్ల అవనీ లేఖరా. పారాలింపిక్స్‌లో మొదటిసారి పాల్గొని ఒకేసారి రెండు పతకాలు గెల్చుకున్న తొలి భారత యువతిగా చరిత్ర సృష్టించిన ఈ టీనేజీ షూటర్‌ చక్రాల కుర్చీలో కూర్చునే ఆ ఘనత సాధించింది.

తొమ్మిదేళ్ల క్రితం సంగతి.

ప్రభుత్వ ఉద్యోగి అయిన అవని తండ్రి ప్రవీణ్‌కు జైపూర్‌ నుంచి ధోలాపూర్‌కి బదిలీ అయింది. కుటుంబమంతా కారులో వెళ్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. అవనికి వెన్నెముక దెబ్బతినడం వల్ల నడుము కింది భాగం చచ్చుబడిపోయింది. కన్నబిడ్డను ఆ పరిస్థితిలో చూసి కన్నవాళ్ల గుండె తరుక్కుపోయింది. ఏడు నెలలపాటు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స చేయించారు. ఆ తర్వాత కూడా సర్జరీలు, ఫిజియోథెరపీ సెషన్లంటూ తిరగని ఆసుపత్రి లేదు. అయినా నిరాశే మిగిలింది. ఆటలన్నా నృత్యం అన్నా ప్రాణం పెట్టే అవని, ఇక తన జీవితం చక్రాల కుర్చీకే పరిమితమన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది. మనోవేదనతో తల్లడిల్లిపోతూ ఒంటరిగా గదిలో ఉండిపోతున్న బిడ్డను ధ్యాస మళ్లించి మామూలు మనిషిని చేయడానికి తల్లి శ్వేత చాలా కష్టపడింది.

అవనీ లేఖరా

ఎప్పుడూ బిడ్డ వెన్నంటి ఉండి, కథలూ కబుర్లూ చెబుతూ నవ్వించేది. తండ్రి వెంట ఉండి ఆర్చరీ, షూటింగ్‌లకు తీసుకెళ్లేవాడు. స్ఫూర్తినిచ్చే పుస్తకాలు చదివించేవాడు. అప్పుడు చదివిన అభినవ్‌ బింద్రా ఆత్మకథ 'ఎ షాట్‌ ఎట్‌ హిస్టరీ' అవని జీవితానికో లక్ష్యాన్ని చూపించింది. ఆ తరవాత ఆమె తుపాకీని వదిలిపెట్టలేదు. జైపూర్‌లో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. మొదట్లో సొంత తుపాకీ లేక కోచ్‌ని అడిగి తెచ్చుకున్న దాంతోనే పోటీలకు వెళ్లేది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలు గెలిచాక పారాలింపిక్స్‌ లక్ష్యంగా ప్రత్యేక శిక్షణ కోసం ముంబయి వెళ్లింది. బరువైన తుపాకీని పట్టుకోలేక వెన్నెముక పటుత్వాన్ని పెంచుకోవటానికి కష్టమైన వ్యాయామాలెన్నో చేసేది. ఆహారపుటలవాట్లూ మార్చుకుంది. కొవిడ్‌ సమయంలో ముంబయి వెళ్లడానికి వీల్లేక జూమ్‌లో తీసుకున్న శిక్షణతోనే టోక్యోలో అడుగుపెట్టినా అనుకున్నది సాధించింది.

నొప్పిని మరిచిపోవడానికి..

నిరుపేద కుటుంబంలో ఆరుగురు పిల్లల మధ్య ఒకడిగా పుట్టి, వైకల్యం బారిన పడిన ప్రమోద్‌ భగత్‌కు తన కష్టాలన్నీ మర్చిపోయే ఏకైక సాధనం ఆట అయింది. 'ఎప్పుడు చూసినా అవిటి కాలీడ్చుకుంటూ గ్రౌండ్‌లో పడి ఉంటావ్‌.. దానికి ఏమన్నా అయిందంటే ఆ మాత్రం కూడా నడవలేవు' అని పెద్దవాళ్లు తిడుతుంటే వాళ్లకి కనపడకుండా ఉండడానికి ఇంకా దూరంగా ఉండే గ్రౌండ్‌కి వెళ్లేవాడు ప్రమోద్‌. బిహార్‌లోని హాజీపూర్‌ అనే చిన్న పల్లెటూళ్లో పుట్టిన అతడికి పోలియో వల్ల ఎడమకాలు పూర్తిగా దెబ్బతింది. కాలునొప్పి అని చెబితే ఆడుకోనివ్వరని పంటి బిగువున నొప్పిని భరిస్తూ ఆడుతూనే ఉండేవాడు. క్రికెట్‌ అంటే పిచ్చి ఇష్టం. ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌గా వీధిలో తనకంటూ ఓ ప్రత్యేకత కూడా సంపాదించుకున్నాడు. పదమూడో ఏట మొదటిసారి బ్యాడ్మింటన్‌ ఆట చూసి ఆకర్షితుడైన ప్రమోద్‌ వెంటనే సాధన మొదలెట్టి అందులో లీనమైపోయాడు. తన వైకల్యాన్ని మర్చిపోయి సాధారణ పిల్లలతో పోటీపడి ఆడుతూ జిల్లాలో ఎక్కడ టోర్నమెంట్‌ జరిగినా విజేతగా నిలిచేవాడు. బ్యాడ్మింటన్‌ రాకెట్‌ కొనే స్తోమత లేక ఇతరులు ఆడి తీసేసిన వాటితోనే సరిపెట్టుకునేవాడు.

అదే మలుపు

అలాంటి సమయంలో ప్రమోద్‌ని మేనత్త వాళ్ల ఊరు భువనేశ్వర్‌ తీసుకెళ్లింది. ఆరోజుల్లో బ్యాడ్మింటన్‌కు ఇప్పుడున్నంత క్రేజ్‌ లేదు. మంచి కోర్టులూ ఉండేవి కావు. అయినా ఆట మీద మోజు అతడిని వదల్లేదు. అతడిలోని పట్టుదలను గమనించిన కోచ్‌ ఎస్పీ దాస్‌ శిక్షణ ఇచ్చి జాతీయస్థాయి పోటీలకు పంపాడు. అందులో బంగారు పతకం సాధించడం వల్ల ప్రమోద్‌ దశ తిరిగింది. అంతర్జాతీయ పోటీల్లోకి ప్రవేశం లభించింది. ఇక ఆ తర్వాత అతడు వెనుదిరిగి చూసింది లేదు. నాలుగుసార్లు ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌ సాధించి వరల్డ్‌ నంబర్‌ వన్‌గా వెలిగిపోతున్న ప్రమోద్‌ లండన్‌లో సైనా పతకం సాధించడం చూసి తానూ ఆ స్థాయికి వెళ్లాలని కలలు కన్నాడు. పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ని తొలిసారి ప్రవేశపెట్టడం వల్ల స్వర్ణం సాధించి ఆ కల నెరవేర్చుకున్నాడు. పట్టుదల ఉంటే ఏదీ అసాధ్యం కాదనే ప్రమోద్‌ తనని చూసి కొందరైనా స్ఫూర్తి పొందితే చాలంటాడు.

ప్రమోద్‌ భగత్‌

ఒక్క కాలుతోనే సాధించాడు!

సుమిత్‌ తండ్రి రామ్‌కుమార్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఉద్యోగం చేసేవాడు. ముగ్గురమ్మాయిల తర్వాత పుట్టిన కొడుకుని ఎంతో గారాబంగా చూసుకున్న ఆయన సుమిత్‌ ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు హఠాత్తుగా మరణించారు. దాంతో తల్లి నిర్మలాదేవి నలుగురు పిల్లలతో సోనెపట్‌కు దగ్గర్లోని ఖ్వేరాకు నివాసం మార్చింది. చిన్నప్పటి నుంచీ సుమిత్‌కు ఆటలంటే ఇష్టం. ఒలింపిక్‌ పతక విజేత యోగేశ్వర్‌ దత్‌ స్ఫూర్తితో తానూ రెజ్లర్‌ అవ్వాలనుకున్నాడు. కుస్తీలో శిక్షణ తీసుకోవడమూ మొదలుపెట్టాడు.

ఊహించని ఘటన

అంతా సాఫీగా సాగిపోతోందనుకుంటుండగా జరిగిందో దుర్ఘటన. ఆరేళ్ల క్రితం ఓరోజు శిక్షణ ముగించుకుని రాత్రివేళ బైక్‌ మీద ఇంటికి వెళ్తున్న సుమిత్​ను ట్రాక్టర్‌ ఢీకొట్టింది. కాలు పైనుంచి చక్రం వెళ్లడం వల్ల ఎడమ మోకాలి కిందభాగం నుజ్జునుజ్జయి పూర్తిగా తీసేయాల్సి వచ్చింది. ఆ హఠాత్పరిణామం సుమిత్‌ను తీవ్రంగా కలచివేసింది. కుస్తీయోధుడు కావాలన్న తన కలలన్నీ కల్లలు కావడం అటుంచి జీవితమంతా అవిటివాడిగా బతకడం అన్న ఆలోచన అతడిని వణికించేది. అప్పటికి ప్లస్‌టూ చదువుతున్న సుమిత్‌ తీవ్ర కుంగుబాటుకు లోనయ్యాడు. స్నేహితులను కూడా కలిసేవాడు కాదు. ఊరంతా నిద్రపోయాకే ఇంటినుంచి బయటకు వచ్చి ఒంటరిగా తిరిగేవాడు. తల్లి, అక్కలు ధైర్యం చెప్పగా చెప్పగా వాస్తవాన్ని అర్థం చేసుకుని జీవితంతో రాజీపడడానికి అతడికి చాలానే సమయం పట్టింది.

సుమిత్‌

ఖాళీగా ఉండకుండా చదువు కొనసాగించమని తల్లి ప్రోత్సహిస్తే బీకామ్‌లో చేరడానికి దిల్లీ వెళ్లిన సుమిత్‌కు ఆ ప్రయాణం తన జీవితాన్ని మరో మలుపు తిప్పబోతోందని తెలియదు. 'కాలేజీలో చేరాక పారా అథ్లెటిక్స్‌ గురించి తెలిసింది. మొదటి నుంచీ ఆటల మీద ఉన్న ఇష్టంతో గ్రౌండ్‌లోకి వస్తే నన్ను నేను మరచిపోయేవాడిని. కానీ ఒంటికాలితో నేనేం ఆడగలనని బాధపడుతున్నప్పుడు జావెలిన్‌ గురించి నాకు తెలిసింది. కోచ్‌ నావల్‌ సింగ్‌ శిక్షణలో ప్రాక్టీసు మొదలుపెట్టా. తోటి స్నేహితులందరూ గాఢనిద్రలో ఉంటే పొద్దున్నే మూడింటికల్లా లేచి నేను స్టేడియంకి వెళ్లేవాణ్ని. అదే పనిగా పరిగెత్తుతూ ప్రాక్టీసు చేయడం వల్ల కృత్రిమ కాలు అమర్చినచోట రాపిడి వల్ల రక్తం కారిపోయేది. చాన్నాళ్లు ఆ బాధ భరించా. ఒకసారి తట్టుకోలేక ఇంట్లో ఏడ్చేస్తోంటే అమ్మ చూసి ఖరీదెక్కువైనా మరింత నాణ్యమైన కాలు కొనిపెట్టింది. ఎంత కష్టమైనా పడుతున్నానే తప్ప సాధన మానడం లేదని గమనించిన కోచ్‌ ఫిన్లాండ్‌లో శిక్షణ తీసుకుంటే బాగుంటుందని సూచించాడు. ఆర్థికంగా పెద్ద ఇబ్బంది లేకపోవడం వల్ల ఆయన చెప్పినట్లే వెళ్లి అక్కడ శిక్షణ పొందా. నిజంగానే అక్కడి శిక్షణ నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది' అని చెబుతాడు సుమిత్‌. ఆ తర్వాత ఆసియా పారా గేమ్స్‌తో మొదలైన సుమిత్‌ విజయపరంపర టోక్యోలో తన రికార్డును తానే బద్దలుగొట్టి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించడం దాకా నిరంతరాయంగా కొనసాగింది. 'ఇది పతకం కాదు నా జీవితం' అంటాడు సుమిత్‌ పారాలింపిక్‌ స్వర్ణ పతకాన్ని ముద్దాడుతూ.

అమ్మ ఆసరాతో..

రాజస్థాన్‌లో చురు జిల్లాలో ఓ మారుమూల గ్రామం దేవేంద్ర ఝఝరియాది. ఎనిమిదేళ్ల వయసులో పిల్లలతో దొంగా-పోలీసు ఆడుకుంటూ ఎవరికీ కనిపించకుండా దాక్కోవాలని చెట్టెక్కాడు. కానీ గుబురుల్లో దాగిన ఓ హై-టెన్షన్‌ విద్యుత్తు తీగని గమనించలేదా చిట్టితండ్రి. దాని దగ్గరగా చేయిపెట్టాడో లేదో 'అమ్మా' అంటూ అంతెత్తు నుంచి కిందపడిపోయాడు. కట్టెలా బిగుసుకుపోయిన బిడ్డని అప్పటికప్పుడు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రాణంతో బయటపడ్డా విద్యుదాఘాతంతో కాలిపోయిన ఎడంచేయిని తొలగించక తప్పలేదు. ఒంటిచేత్తో బిడ్డ ఎక్కడ ఆత్మన్యూనతకు లోనవుతాడో అని భయపడిన తల్లి జీవని ఆ పరిస్థితి రాకుండానే చూడాలనుకుంది. ఆర్నెల్ల చికిత్స తర్వాత ఇంటికొచ్చిన అతడి చేతికి బ్యాట్‌ ఇచ్చి స్నేహితులతో క్రికెట్‌ ఆడుకోమని పంపించింది. తన మొండి చేతినీ బ్యాట్‌నీ మార్చి మార్చి చూసుకుంటూ సందేహిస్తూనే వీధిలోకి వెళ్లిన అతణ్ణి ఎవరూ జట్టులో చేర్చుకోకపోగా 'ఏమిటీ, క్రికెట్‌ ఆడదామనే..' అంటూ వెక్కిరించారు. ఏడుస్తూ తిరిగి వచ్చి గదిలోకి వెళ్లి గడియపెట్టుకున్నాడు దేవేంద్ర. అలా ఒకసారీ రెండుసార్లూ కాదు.. లెక్కలేనన్ని సార్లు. తల్లి పంపడం, దేవేంద్ర ఏడుస్తూ రావడం. ఓసారి పాఠశాలలో జరుగుతున్న ఆటల పోటీల్లో 'జావెలిన్‌'ని చూసిన దేవేంద్ర తనలాంటి ఒంటి చేతివాళ్లకి అది సరిగ్గా సరిపోతుందనుకున్నాడు. పైగా ఎవరినీ జట్టులో చేర్చుకోమని బతిమాలనక్కర్లేదు. తాను ఒక్కడే ఎంత సేపన్నా ఆడుకోవచ్చన్న విషయం బాగా నచ్చింది.

దేవేంద్ర ఝఝరియా

కానీ అనుకున్నంత తేలిక కాలేదు అది నేర్చుకోవడం. పరుగెడుతూ వచ్చి జావెలిన్‌ని బలంగా విసిరేటప్పుడు శరీరాన్ని బ్యాలన్స్‌ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేది. మెలికలు తిరుగుతూ లుంగచుట్టుకు పడిపోయిన రోజులెన్నో. అయినా పెదవి బిగువున సాధన చేస్తూ ఏడాదికల్లా జిల్లా ఛాంపియన్‌ అయ్యాడు. 'ఆ రోజు మా అమ్మ నేను ఒలింపిక్‌ పతకం సాధించినంత సంబరపడిపోయింది' అంటాడు దేవేంద్ర. ఆ గెలుపు జాతీయ కోచ్‌ ఆర్‌.ఎస్‌.సింగ్‌ దృష్టిలోనూ పడింది. దేవేంద్ర పట్టుదలకి ఆయన శిక్షణ తోడుకాగా ఏథెన్స్‌ పారాలింపిక్స్‌లో ప్రపంచ రికార్డు సొంతమైంది. కానీ ఆ తర్వాతి రెండు పారాలింపిక్స్‌లో జావెలిన్‌కి అవకాశం ఇవ్వలేదు. అయినా ఆ సమయాన్ని వృథా చేయక మరింతగా శ్రమించి రాటుదేలాడు. కబడ్డీ క్రీడాకారిణి మంజుని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 'మా బాబు పుట్టిన మూడేళ్లదాకా నేను ఇంటికి వెళ్లకుండా దేశవిదేశాల్లో శిక్షణలోనే గడిపా. నా ఫొటో చూపిస్తూ వాణ్ణి పెంచింది మంజు' అంటాడు దేవేంద్ర. ఆ శ్రమ ఊరికే పోలేదు. రియో పారాలింపిక్స్‌లో తన పాత రికార్డునీ అధిగమించి రెండుసార్లు స్వర్ణం అందుకున్న తొలి భారతీయ క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు. ఆ పట్టుదలని ఏమాత్రం సడలనివ్వకుండా 40 ఏళ్ల వయసులోనూ తాజాగా తన పాత రికార్డుని బద్దలు కొట్టి మూడు పారాలింపిక్స్‌లో పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు దేవేంద్ర!

అవమానాలు భరించి..

తోటి పిల్లలంతా 'పొట్టోడు' అని గేలిచేస్తుంటే అవమానంతో ఇంట్లో దాక్కున్న అబ్బాయికీ.. తలెత్తుకుని ప్రపంచ వేదిక మీద సగర్వంగా నిలబడి దేశ ప్రజల చేత జేజేలు పలికించుకున్న అబ్బాయికీ.. మధ్య ఇరవయ్యేళ్ల పోరాటం ఉంది. 22 ఏళ్ల కృష్ణ నాగర్‌ది రాజస్థాన్‌. మూడేళ్లొచ్చినా పిల్లవాడు పొడుగు పెరగడం లేదని డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్లిన ఆ తల్లిదండ్రులకు వారు చెప్పిన మాట పిడుగుపాటే అయింది. గ్రోత్‌ హార్మోన్ల లోపం వల్ల పిల్లవాడు అందరిలా సాధారణ పొడుగు పెరగడని వైద్యులు తేల్చి చెప్పారు. మరుగుజ్జుగానే జీవితం గడపాల్సి ఉంటుందన్నారు. కనీసం చదువన్నా ఉంటే తన బతుకు తాను బతకగలుగుతాడని భావించిన తల్లిదండ్రులు బడిలో చేర్పించారు. అక్కడ మొదలయ్యాయి కృష్ణ కష్టాలు. ఇతర దివ్యాంగులను చూసి సానుభూతి చూపించే వారు కూడా అతడి మరుగుజ్జుతనాన్ని వైకల్యంగా అర్థం చేసుకోలేకపోయేవారు. అదేదో అతడి తప్పయినట్లు ఒక్కరు కూడా పేరుపెట్టి సరిగ్గా పిలిచేవారు కాదు. రకరకాలుగా పేర్లు పెట్టి పిలుస్తూ గేలిచేసేవారు. ఆ అవమానాలు తట్టుకోలేక ఎవరికీ కనబడకుండా దాక్కోవాలనుకునేవాడు. అలా గడప దాటి బయటకు వెళ్లని పిల్లాణ్ణి చూసి ఆటలు ఆడితే పొడుగు పెరుగుతారని పెద్దవాళ్లు మాట్లాడుకోవడం విన్న కృష్ణ ఇక ఆ తర్వాత క్షణం కూడా ఇంట్లో ఉండేవాడు కాదు. వీధిలో, స్కూల్లో ఎక్కడ పిల్లలు ఏ ఆట ఆడుతున్నా వాళ్ల మధ్యలోకి దూరిపోయేవాడు. 'నేలకు జానెడు లేవు, నువ్వేం ఆడతావు. నీ వల్ల కాదు అవతలికి పో' అని ఎంత దూరం పెట్టాలని చూసినా వినకుండా అంతకన్నా గట్టి పట్టుదలతో పిచ్చిపట్టినట్టు ఆడేవాడు. ఎలాగైనా సరే పొడుగు పెరగాలన్న ఒకే ఒక లక్ష్యం ఆ చిన్నారికి నిద్రపట్టనిచ్చేది కాదు. కసి కొద్దీ రకరకాల వ్యాయామాలు చేసేవాడు. కానీ ఎంత చేసినా మరుగుజ్జుతనంతో రాజీపడక తప్పలేదు. అయితే పొడుగు పెరగాలన్న లక్ష్యం నెరవేరకపోయినా ఆటల్లో అనుభవం అతడిని భౌతికంగా మానసికంగా దృఢంగా తయారుచేసింది. మంచి క్రీడాకారుడిగా తీర్చిదిద్దింది. దాంతో క్రీడల్లో అతడి ప్రతిభ చాటున వైకల్యం మరుగునపడిపోయింది. అప్పటివరకూ ఒక పద్ధతి అంటూ లేకుండా అన్ని ఆటలూ ఆడుతున్న అతడికి ఐదేళ్ల క్రితం కాలేజీలో చేరినప్పుడు పారా బ్యాడ్మింటన్‌ గురించి తెలిసింది. అప్పుడు పూర్తిగా ఆ ఒక్క ఆట మీదే దృష్టిపెట్టి ప్రత్యేకంగా తర్ఫీదు పొందడం మొదలెట్టాడు. నిజానికి ఆ ఆట ఆడేవాళ్లకి మంచి ఎత్తు కలిసొస్తుంది. అలాంటిది అతడు ఆడుతుంటే మాత్రం ఎవరికీ ఆ విషయమే స్ఫురించదు. వేగంగా కోర్టంతా కలయతిరుగుతూ, ఎగిరి బలంగా షాట్‌ కొడుతూ అతడు ఆడే తీరు క్రీడాభిమానులకు ముచ్చట గొలుపుతుంది. ఒకసారి కోర్టులోకి వెళ్లాక నేనన్నీ మర్చిపోతాను. ఆటని పూర్తిగా ఆస్వాదిస్తాను. ఆటలో ఓడినా ప్రపంచాన్ని గెలిచిన అనుభూతి చెందుతాను.. అంటాడు ఈ బంగారు పతక విజేత.

కృష్ణ నాగర్‌

చక్రాల కుర్చీలోనే..

ముప్ఫైమూడేళ్ల కిందట.. ఇంట్లో చకచకా పాకేస్తున్న చిన్నారి భవినా పటేల్‌ని చూసి సంబరపడిపోయారు తల్లిదండ్రులు. ఈ అల్లరిపిల్లకు నడక వస్తే పట్టుకోవడం కష్టమే అని మురిసిపోయేది తల్లి. కానీ బుడి బుడి అడుగులు వెయ్యకుండానే ఏడాది పాప పోలియో బారిన పడడం వల్ల కుటుంబం పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. పేదరికం వల్ల ఆమె తండ్రి వెంటనే చికిత్స చేయించలేకపోయాడు. ఆ తర్వాత ఎక్కడెక్కడికో తీసుకెళ్లి శస్త్రచికిత్సలు చేయించినా లాభం లేకపోయింది. చిన్నారి భావినా చక్రాల కుర్చీకే పరిమితమైపోయింది. ఆ చక్రాల కుర్చీలోంచే పారాలింపిక్స్‌లో రజతం గెలిచి, దేశానికి తొలి టేబుల్‌ టెన్నిస్‌ పతకాన్ని తెచ్చిపెట్టింది. ఆ గెలుపు.. పరిస్థితులతో, తన శరీరంతో ఆమె చేసిన నిరంతర యుద్ధానికి ఫలితం. గుజరాత్‌లోని మెహసాణా జిల్లా సుంధియా గ్రామంలో జన్మించిన భవినా చక్రాల కుర్చీలోనే జీవితమంతా గడపాల్సి వచ్చినా ఆర్థికంగా అయినా ఇతరుల మీద ఆధారపడకుండా తన జీవనోపాధిని తానే సంపాదించుకోవాలనుకుంది. ఐటీఐ కోర్సు చేసేందుకు అహ్మదాబాద్‌లోని 'బ్లైండ్‌ పీపుల్స్‌ అసోసియేషన్‌'లో చేరింది. అక్కడ స్నేహితులు ఆడుతుంటే సరదాగా తనూ టేబుల్‌ టెన్నిస్‌ ఆడటం మొదలుపెట్టింది.ఆ ఆట తనలో ఆత్మస్థైర్యాన్ని నింపి, వైకల్యాన్ని మర్చిపోయేలా చేయడం వల్ల మెల్లగా పోటీల్లో పాల్గొనడం మొదలెట్టింది.

భావినా పటేల్‌

కోచ్‌ లాలా దోషి సాయంతో జిల్లా, రాష్ట్ర స్థాయిని దాటి జాతీయ, అంతర్జాతీయ స్థాయికి అంచెలంచెలుగా ఎదిగింది. ఆట ఇచ్చే ఆ ఆనందం కోసం ఆమె పడ్డ తిప్పలు అన్నీ ఇన్నీ కావు. మధ్య తరగతి కుటుంబంలో వైకల్యం ఉన్న ఆడపిల్లగా ఈ ప్రయాణంలో ఎన్నో కష్టాలను అనుభవించింది. కాళ్లు లేకపోవడం వల్ల బరువుని అదుపులో ఉంచుకోవడానికి నిత్యం ఫిజియోథెరపీ చేయాలి. అది చేస్తున్నప్పుడు విపరీతమైన ఒళ్లు నొప్పులు వచ్చేవి. ఒళ్లంతా పచ్చిపుండులా అయ్యేది. అయినా రోజుకి ఏడెనిమిది గంటలు ప్రాక్టీస్‌ చెయ్యడం ఆపలేదు. శారీరకంగా మానసికంగా ఆమె పడ్డ సమస్యలు ఒకెత్తయితే ఆర్థిక సమస్య ఒక్కటే మరొక ఎత్తు అయింది. నొప్పులు భరించి సాధన చేయడం తన చేతిలో ఉన్న పని కానీ డబ్బు సంపాదించడమెలాగో తెలిసేది కాదు. ఆర్థికసాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల చక్రాల కుర్చీతోనే ఆటోలూ, బస్సులూ ఎక్కి ప్రాక్టీస్‌కి వెళ్లేది భవినా. తర్వాత ప్రభుత్వ సాయం అందినా అది సరిపోయేది కాదు. ఒక్క బ్యాట్‌ ధరే రూ.30 వేలు ఉండేది. మూడు నెలలకోసారి కొత్త బ్యాట్‌ కొనాల్సి వచ్చేది. దానికితోడు టోర్నమెంట్‌ల కోసం విదేశాలకు వెళ్లడానికి అయితే లక్షల్లో ఖర్చయ్యేది. 'టోక్యో పారాలింపిక్స్‌ కోసం కూడా అప్పుచేసి డబ్బు సమకూర్చుకున్నా. కరోనా కారణంగా ఈ గేమ్స్‌ ఆగిపోతాయేమోనని ఎంత భయపడ్డానో. ఎందుకంటే మళ్లీ ఆడే సత్తా నాకున్నా డబ్బు పెట్టే స్తోమత లేదు' అనే భవినా టోక్యోలో రజతం సాధించి సగర్వంగా తిరిగి వచ్చింది.

ఒకనాటి కూలీ..

తంగవేలు మారియప్పన్‌.. రియో పారాలింపిక్స్‌ తర్వాత సోషల్‌ మీడియాని కుదిపేసిన పేరు. ఆ స్ఫూర్తిని అలాగే కొనసాగిస్తూ టోక్యోలోనూ గెలిచివచ్చిన అతడి కథ సినిమా కథకి తీసిపోదు. తమిళనాడులోని సేలం నగరానికి 50 కి.మీ. దూరంలో ఉండే పెరియవడుగపట్టి అనే కుగ్రామం వాళ్లది. తాగుడికి బానిసైన తండ్రి నలుగురు పిల్లల్ని కని తన మానాన తాను కుటుంబాన్ని వదిలి పారిపోతే తల్లి ఒక్కతే బిడ్డల బాధ్యతని తలకెత్తుకుంది. ఉదయమంతా వీధీవీధీ తిరిగి కాయగూరలమ్మి, మధ్యాహ్నం నుంచి ఇటుక బట్టీల్లో కూలీగా చెమటోడుస్తూ కుటుంబాన్ని పోషించేది. పిల్లల్ని బడికి పంపేది. అలాంటి పరిస్థితుల్లో ఐదేళ్ల వయసులో మారియప్పన్‌ బడికెళుతుంటే బస్సు ఢీకొని కుడికాలు విరిగింది. సమయానికి సరైన చికిత్స అందక అది వంకర తిరిగిపోయి దాని ఎదుగుదల శాశ్వతంగా ఆగిపోయింది. ఓవైపు పేదరికం.. మరోవైపు తండ్రిలేని బాధ.. వాటికి వైకల్యం కూడా జతై ఆ చిన్నారిని కష్టాలకొలిమిలో నెడితే.. బంగారంలా తనని తాను పుటంపెట్టుకుని బయటపడ్డాడు మారియప్పన్‌. పాఠశాల స్థాయి నుంచే హైజంప్‌లో రాణించేవాడు. కాలు సహకరించకున్నా ఆటల్లో అతడు చూపే ప్రతిభ అందరినీ ఆకట్టుకునేది. పలు స్థాయుల్లో బహుమతులు తెచ్చిపెట్టేది. అలా 2012లో లండన్‌ పారాలింపిక్స్‌కోసం బెంగళూరులోని కంఠీరవ స్టేడియంలో జరుగుతున్న సెలెక్షన్స్‌కి వెళ్లాడు మారియప్పన్‌. హైజంప్‌లో ఐదుగురికి మాత్రమే అవకాశం ఉంటే పది మంది పోటీపడ్డారు. అక్కడ అందరికన్నా ఎత్తుకు ఎగిరి దూకి ప్రథమస్థానంలో నిలిచాడు.

తంగవేలు మారియప్పన్‌

అయినా చివరి క్షణంలో అతడికి పాస్‌పోర్ట్‌ అందలేదు. సెలెక్షన్స్‌లో అతడి తర్వాతి స్థానంలో నిలిచిన అబ్బాయి మాత్రం చక్కగా వెళ్లి పారాలింపిక్స్‌లో రజతం గెలిచాడు. అది చూసి 'మారియప్పన్‌ వెళ్లుంటే బంగారుపతకం కచ్చితంగా వచ్చి ఉండేది' అని అన్నవాళ్లే కానీ సాయం చేసినవాళ్లు ఎవరూ లేరు. దాంతో కూడు పెట్టని ఆట మనకెందుకు అనుకున్న మారియప్పన్‌ ఆటల మీద ఆశలు వదిలేసి తల్లితో కలిసి కుటుంబపోషణ బాధ్యత పంచుకోవడం మొదలెట్టాడు. పొద్దున్నే లేచి వెళ్లి పేపర్‌బాయ్‌గా ఇళ్లమ్మట పేపర్లు పంచేవాడు. ఆ తర్వాత నిర్మాణ కూలీగానూ పనిచేసేవాడు. వచ్చిందేదో తీసుకెళ్లి అమ్మ చేతిలో పెట్టేవాడు. అలా సాగిపోతున్న మారియప్పన్‌ జీవితంలో ఊహించని మలుపు తెచ్చిన ఘనత బెంగళూరుకి చెందిన కోచ్‌ సత్యనారాయణది. లండన్‌ సెలెక్షన్స్‌ సమయంలో మారియప్పన్‌ ప్రదర్శించిన నైపుణ్యం ఆయనకు గుర్తుండిపోయింది. అందుకే స్వయంగా పిలుచుకుని మరీ శిక్షణ ఇచ్చాడు. వెతుక్కుంటూ వచ్చిన ఆ అవకాశాన్ని వృథా పోనివ్వకుండా సత్తా చాటిన మారియప్పన్‌ రియో ఒలింపిక్స్‌లో బంగారు పతకం అందుకున్నాడు. దాంతో సంతృప్తి చెంది పట్టుదల సడలిపోకుండా కాచుకుంటూ టోక్యోలోనూ పతకం సాధించిన అతడిని మొక్కవోని దీక్షకి మరోరూపం అంటే కాదనేవాళ్లెవరు?!

చెయ్యెత్తలేడు కానీ గురితప్పనీయడు!

హరియాణాలోని ఫరీదాబాద్‌ నుంచి షూటింగ్‌లో టోక్యో వేదిక మీద స్వర్ణం గెలిచేదాకా సాగిన పందొమ్మిదేళ్ల మనీష్‌ నర్వాల్‌ ప్రయాణం ఎందరికో స్ఫూర్తినిస్తుంది. చదువుకన్నా కూడా ఆటలంటేనే మనీష్‌కు ఇష్టం. అతడి తండ్రి దిల్‌బాగ్‌ ఒకప్పుడు పహిల్వాన్‌ కావడం వల్ల మనీష్‌ను ఆటలవైపే ప్రోత్సహించేవాడు. 'ఔట్‌డౌర్‌ గేమ్స్‌నే బాగా ఇష్టపడతాను. చిన్నపుడు అన్ని ఆటలూ ఆడేవాణ్ని. ఫుట్‌బాల్‌ అంటే మరీ ఇష్టం. మెస్సీ అభిమానిని. స్థానిక క్లబ్‌ తరఫున ఆడేవాణ్ని..' చక్కగా చాలినంత ఒడ్డూ పొడుగూ ఉన్న మనీష్‌ చెప్పే ఈ మాటలు వింటుంటే 'అదృష్టవంతుడు' అనుకుంటారు ఎవరైనా. కానీ అతడిని నిశితంగా చూస్తే తెలుస్తుంది అసలు విషయం. అతడికి పుట్టుకతోనే కుడిచేయి ఎందుకూ పనికిరాకుండా ఉండేది. కనీసం కదల్చడానికి కూడా వీలయ్యేది కాదు. దాంతో ఒంటిచేత్తో ఫుట్‌బాల్‌ ఆడడం సాధ్యం కాదని అర్థం కావడంతో తనకిష్టమైన ఆటని వదిలేయక తప్పలేదు మనీష్‌.

మనీష్‌ నర్వాల్‌

తండ్రి స్నేహితుడి సలహా మేరకు షూటింగ్‌ వైపు వచ్చాడు. వాళ్ల ఊరికి దగ్గర్లోని బల్లబ్‌గఢ్‌లోని కోచ్‌ రాకేష్‌ ఠాకూర్‌ నిర్వహిస్తోన్న అకాడమీలో చేరాడు. అక్కడ చేరడం మనీష్‌ జీవితాన్ని మేలి మలుపు తిప్పింది. మనీష్‌ది కుడిచేతి వాటం. కానీ వైకల్యం కారణంగా కుడిచేత్తో తుపాకీని పట్టుకోవడం సాధ్యం కాదు. దాంతో ఎడమ చేత్తో తుపాకీని పట్టుకుని పేల్చడం నేర్చుకున్నాడు. కుడి చెయ్యి కాకపోతే ఎడమ చెయ్యి.. దాందేముందీ అన్పిస్తుంది కానీ, పుట్టుకతో వచ్చే చేతివాటాన్ని మార్చుకుని పోటీకోసం సాధన చేయడం అంటే ఎవరి శరీరంతో వాళ్లు యుద్ధం చేయడమే. అందుకోసం మనీష్‌ ఎంతో శ్రమించాడు. 'ఉదయం అయిదింటికే అకాడమీలో ఉంటాడు. పట్టుదలగా సాధన చేస్తాడు. ఓటమితో కుంగిపోడు, ఆటను ఆస్వాదిస్తాడు. ఈ లక్షణాలన్నీ ఓ టీనేజర్‌కు ఉండటం గొప్ప విషయం. అందుకే అతడు ఛాంపియన్‌ అయ్యాడు' అని చెబుతాడు అతడి కోచ్‌. ప్రారంభంలో సాధారణ క్రీడాకారులతో పోటీపడుతూ అత్యుత్తమంగా రాణిస్తున్న మనీష్‌ను చూసిన కోచ్‌ జయ్‌ప్రకాశ్‌ అతడిని పారా పోటీలవైపు తీసుకొచ్చాడు. ప్రస్తుతం బీఏ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న మనీష్‌ 2017 నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఓటమి ఎదురైతే ఆటగాళ్లు సాధారణంగా కోపంతోనో, అసంతృప్తితోనో ఉంటారు. కానీ మనీష్‌ అలా కాదు. ఓటమితో మరింత స్ఫూర్తి పొందుతాడు. ఆ స్వభావమే అతడిని స్వర్ణ పతకవిజేతను చేసింది.

ఇదీ చూడండి:IND vs ENG Test: ఇంగ్లాండ్​తో సిరీస్‌ అయిందా.. ఉందా?

ABOUT THE AUTHOR

...view details