స్వర్ణం ఏమో కానీ.. నా లక్ష్యం మాత్రం అదే! - భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ టోక్యో ఒలింపిక్స్
టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో సత్తాచాటేందుకు సిద్ధమవుతున్నాడు భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్. మెగాటోర్నీలో పతకమే లక్ష్యంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇతడిని ఈటీవీ భారత్ పలకరించగా పలు విషయాలు పంచుకున్నాడు.
ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలనే కల ఓ వైపు.. నాన్న మరణం మరోవైపు.. అంతటి దుఃఖంలోనూ తిరిగి ఈత కొలనులో అడుగుపెట్టిన అతను అనుకున్నది సాధించాడు. రోమ్‌లో జరిగిన 100మీ. బ్యాక్‌స్ట్రోక్ ట్రయల్స్‌లో 53.77 సెకన్ల టైమింగ్ నమోదు చేసి.. ఫినా 'ఎ' ప్రమాణాన్ని అందుకుని కల నిజం చేసుకున్నాడు. కరోనా కారణంగా సాధనకు అంతరాయం కలిగినా.. తండ్రి మరణం కలచి వేసినా.. వాటన్నింటినీ దాటి ఇప్పుడు టోక్యో ఒలింపిక్స్(Tokyo Olympics)లో సెమీస్ చేరుకోవాలనే లక్ష్యాన్ని అందుకునే దిశగా సాగుతున్నాడు. అతడే భారత స్విమ్మర్ శ్రీహరి నటరాజ్. మెగాటోర్నీలో పతకం కోసం శ్రమిస్తోన్న ఇతడిని ఈటీవీ భారత్ పలకరించగా పలు విషయాలు వెల్లడించాడు.
- నేను క్రికెటర్ల కుటుంబం నుంచి వచ్చా. అమ్మ మినహాయిస్తే ప్రతి ఒక్కరికీ క్రికెట్ అంటే చాలా మక్కువ. నేను క్రికెట్ ఆడకున్నా వారు ఎక్కడా ఇబ్బంది పడలేదు. కానీ ఓ క్రీడలో దేశానికి అత్యుత్తమ టోర్నీలో పతకం కోసం పోటీపడతానని అస్సలు ఊహించలేదు.
- 2017లో బ్యాక్‌స్ట్రోక్ విభాగంలో నేను జాతీయ రికార్డు నెలకొల్పా. ఈ దేశం తరఫున నేనేదో సాధించబోతున్నా అని అప్పుడు అనిపించింది.
- నేను క్రికెట్ కూడా బాగా ఆడతా. కానీ ఈత అంటే ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అందునే ఈ ఆటను ఎంచుకున్నా. చాలా కాలంగా నా లక్ష్యం కోసం శ్రమిస్తున్నా.
- ప్రజలు నా నుంచి ఏం ఆశిస్తున్నారో, ఏం ఆశించట్లేదో నాకు తెలియదు. కానీ ఒలింపిక్స్‌లో సెమీ ఫైనల్ వరకైనా వెళ్లాలని నేను భావిస్తున్నా. ఫైనల్ వరకు వెళితే అది మరింత గొప్పగా అనిపిస్తుంది.
- ఈ ఒలింపిక్స్ నా కెరీర్లో అతిపెద్ద సవాలు. స్విమ్మింగ్‌లో భారత్‌కు అత్యున్నత పేరు తీసుకురావాలని అనుకుంటున్నా. ఇది నాకు చాలా ఛాలెంజింగ్‌గానూ, కొంత ఆశ్చర్యంగానూ ఉంది.
- నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాల్ని ఎదుర్కొన్నా. ఆ సమయంలో నాకు అండగా నిలిచిన కుటుంబం, కోచ్, ఫిజియో, భారత క్రీడా సమాఖ్యలకు ధన్యవాదాలు.