Vinesh Phoghat: టోక్యో ఒలింపిక్స్‌లోనూ పతకం గెలవడంలో విఫలమయ్యాక రెజ్లింగ్‌ను వదిలేయాలనుకున్నానని కామన్వెల్త్ బంగారు పతక విజేత వినేశ్ ఫొగాట్ చెప్పింది. అయితే ప్రధానమంత్రి మోదీ మాటలు తనను ఉత్తేజపరిచాయని తెలిపింది. క్వార్టర్‌ఫైనల్లో గాయంతో 2016 రియో ఒలింపిక్స్‌లో పతకానికి దూరమైన వినేశ్.. టోక్యో ఒలింపిక్స్‌లోనూ క్వార్టర్స్‌లోనే ఓడింది. తన బరువు విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా బరిలోకి దిగినా.. ఆమె పరాజయంపాలైంది. అయితే ఇటీవల కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించింది.
"ఇప్పుడు నేను సరికొత్త వినేశ్‌ని. పెద్ద మానసిక అడ్డంకిని అధిగమించా. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం నెగ్గకపోవడం వల్ల రెజ్లింగ్‌ను వదిలేద్దామనుకున్నా. అయితే అథ్లెట్లందరికీ ఒలింపిక్స్ అతి పెద్ద వేదిక. నేను నిరాశలో ఉన్నప్పుడు ప్రధానమంత్రి మోదీని కలిశా. ఆయన మాటలతో ప్రేరణ పొందాను. 'నీపై మాకు నమ్మకముంది. నువ్వు సాధించగలవు' అని ప్రధాని అన్నారు. ఆ మాటలు నాకు ఉత్తేజాన్నిచ్చాయి" అని వినేశ్ చెప్పింది.