Hs Prannoy BWF Ranking : తాజాగా జరిగినప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్‌లో స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హోరా హోరీ పోరులో ప్రత్యర్థులను చిత్తు చేసిన ప్రణయ్.. ఆఖరిలో కాస్త తడబడి కాంస్య పతకంతో టోర్నీ నిష్క్రమించాడు. ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్ క్వార్టర్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించి సెమీస్ చేరినప్పటికీ.. కున్లావత్ వితిద్సన్ (థాయ్‌లాండ్) చేతిలో 21-18, 13-21, 14-21 తేడాతో కాంస్య పతకంతో సరిపెట్టుకున్నాడు. అయినప్పటికీ తన అద్భుత ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుని టాక్ ఆఫ్ ద టౌన్‌గా నిలిచాడు.
ఈ క్రమంలో తాజాగా అతడు కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంక్‌ను అందుకున్నాడు. మంగళవారంబ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో మూడు స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంక్‌కు చేరుకున్నాడు. తన కెరీర్‌లో అతడికిదే అత్యుత్తమ ర్యాంక్. గతంలో ఏడో ర్యాంక్‌లో నిలిచిన ప్రణయ్ ఇప్పుడు ఆరో ర్యాంక్‌లో నిలిచాడు.
Lakshya SenBWF Ranking : మరోవైపు పురుషుల సింగిల్స్‌లో ఇతర భారత షట్లర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. యంగ్ స్టార్ లక్ష్య సేన్.. తాజా ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం నష్టపోయి 12వ స్థానంలో నిలిచాడు. ఇక కిదాంబి శ్రీకాంత్ ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌లో మొదటి రౌండ్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. 20వ స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.