ప్రముఖ నటుడు ఆర్.మాధవన్ పుత్రోత్సాహంతో పొంగిపోయారు. ఆయన కుమారుడు వేదాంత్ మాధవన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో సత్తా చాటాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో ఏకంగా ఏడు మెడల్స్‌ను కైవసం చేసుకున్నాడు. నిర్వాహకులు నిర్దేశించిన లక్ష్యాలను కొద్ది నిమిషాల్లోనే పూర్తి చేసి.. 5 గోల్డ్ మెడల్స్, 2 సిల్వర్ మెడల్స్‌ను సాధించాడు. ఈ విషయాన్ని మాధవన్ తన అభిమానులతో షేర్ చేసుకున్నారు. ఈ సందర్భంగా తన కుమారుడి విజయం పట్ల తానెంతో గర్వంగా ఫీలవుతున్నానంటూ.. వేదాంత్ ఫొటోను జత చేసి ట్విట్టర్లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. దీంతో సినీ ప్రముఖలు, నెటిజన్లు వేదాంత్‌ను అభినందిస్తున్నారు.
ఏడు మెడల్స్‌తో సత్తా చాటిన కుమారుడు.. పుత్రోత్సాహంతో పొంగిపోయిన మాధవన్.. - వేదాంత్ మెడల్స్‌పై హీరో మాధవన్
ప్రముఖ సినీ నటుడు ఆర్. మాధవన్ కుమారుడు వేదాంత్ మాధవన్ ఏకంగా ఏడు పతకాలు సాధించి శభాష్ అనిపించుకుంటున్నాడు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023లో 5 గోల్డ్, 2 సిల్వర్ మెడల్స్‌ను సాధించాడు. ఈ సందర్భంగా మాధవన్ తన ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని పంచుకున్నారు.
వేదాంత్.. 100 మీటర్లు, 200 మీటర్లు, 1500 మీటర్ల స్విమ్మింగ్‌లో గోల్డ్, 400 మీటర్లు, 800 మీటర్ల స్మిమ్మింగ్‌లో మరో రెండు సిల్వర్ మెడల్స్ సాధించినట్లు మాధవన్ తెలిపారు. ఇక, ప్రపంచ జూనియర్ స్విమ్మర్.. అపేక్ష ఫెర్నాండెజ్ 6 స్వర్ణాలు, 1 రజతంతో మెరిసింది. ఈమె గతంలో పెరూలోని లిమాలో జరిగిన 200 మీటర్ల మహిళల బటర్‌ఫ్లై సమ్మిట్ క్లాష్‌లో తలపడి ఎనిమిదో స్థానంలో నిలిచింది. దీంతో ప్రపంచ జూనియర్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరిన తొలి భారతీయ మహిళా స్విమ్మర్‌గా ఈమె గుర్తింపు పొందింది.
వేదాంత్ రికార్డులు..వేదాంత్ మాధవన్ గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలోని అత్యంత వేగవంతమైన స్విమ్మర్‌లలో ఒకరిగా ఉన్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయిలో దేశానికి అనేక అవార్డులను తెచ్చిపెట్టాడు. 2022లో కోపెన్‌హాగన్‌లో జరిగిన డానిష్ ఓపెన్ స్విమ్మింగ్ ఈవెంట్‌లో, పురుషుల 800 మీటర్ల విభాగంలో వేదాంత్ స్థానిక స్విమ్మర్ అలెగ్జాండర్ ఎల్ జార్న్‌ను వెనక్కి నెట్టి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. అంతకుముందు ఇదే స్విమ్మింగ్ ఈవెంట్‌లో 1500 మీటర్ల లక్ష్యాన్ని ఛేదించి రజతం సాధించాడు. ఇవేకాక వేదాంత్ 2021 మార్చిలో జరిగిన లాట్వియా ఓపెన్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. గత సంవత్సరం జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు రజతాలు, మూడు కాంస్యాలను సొంతం చేసుకున్నాడు.