గ్రీసులోని ఒలంపియాలో వెలిగిన టోక్యో ఒలింపిక్ జ్యోతిని.. టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులకు అప్పగించింది గ్రీస్ ప్రభుత్వం. కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే గ్రీస్ దేశంలో టార్చ్ ర్యాలీ రద్దయింది. నేడు జపాన్‌లోని ఫుకుషిమాకు ప్రత్యేక విమానంలో ఈ టార్చ్‌ను తీసుకొచ్చారు. దాదాపు 3 నెలలు జపాన్‌లో పలు ప్రాంతాలు తిప్పిన తర్వాత జ్యోతిని టోక్యోకు చేర్చాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో ఈ ర్యాలీపై నీలినీడలు కమ్ముకున్నాయి.
56 ఏళ్ల విరామం తర్వాత జపాన్‌లో మళ్లీ ఒలింపిక్స్ జరుగుతున్నాయి. చివరిగా 1964లో ఈ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చింది. ప్రస్తుత ఒలింపిక్స్ జులై 24 నుంచి ఆగస్టు 9 వరకు జరగనున్నాయి.
ససేమిరా అంటున్నా..
టోక్యో ఒలింపిక్స్‌కు ఇంకో 127 రోజుల సమయం మాత్రమే మిగిలుంది. ఈపాటికి వివిధ క్రీడల్లో జోరుగా అర్హత టోర్నీలు జరుగుతుండాలి. ఆతిథ్య దేశంలో సన్నాహాలు జోరందుకుని ఉండాలి. టెస్ట్ ఈవెంట్లు నిర్వహిస్తుండాలి. కానీ అన్ని చోట్లా వ్యవస్థలు స్తంభించిపోయాయి. అన్ని టోర్నీలూ రద్దయిపోయాయి. దీనికి కారణం ప్రపంచ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న కరోనా వైరస్. ఈ మహమ్మారి రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తుండటం వల్ల మనుషుల ప్రాణాలకు మించి ఏదీ ముఖ్యం కాదన్న ఉద్దేశంతో ఆటలకూ చెక్ పెట్టేశాయి ప్రపంచ దేశాలు.
మిగతా టోర్నీలు ఏమైనా పర్వాలేదు కానీ.. దాదాపు రూ.9 లక్షల కోట్ల బడ్జెట్‌తో నిర్వహించే ఒలింపిక్స్‌ను రద్దు చేయడం లేదా వాయిదా వేయడమంటే మాటలు కాదు. కరోనా ప్రభావం ఎలా ఉన్నప్పటికీ ఒలింపిక్స్ తేదీల్లో మార్పు ఉండదని, యధావిధిగా జులై 24న ఆరంభమవుతాయని ఐఓసీ స్పష్టం చేస్తున్నప్పటికీ.. రాబోయే రోజుల్లో తీవ్రత పెరిగితే మార్పులు చేర్పులు అనివార్యం కావచ్చు. ఇందుకోసం ఐఓసీ ప్లాన్-బితో సిద్ధం కాక తప్పదు.
అదే అసలు సమస్య
ఒలింపిక్స్‌ను నెలో రెండు నెలలో వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడటానికి ముఖ్య కారణం.. ఈ మెగా టోర్నీ సన్నాహకాలన్నీ ఆగిపోవడమే. ఒలింపిక్స్‌కు ముందు నాలుగైదు నెలల కాలం అథ్లెట్లకు చాలా కీలకం. ఈ కాలంలో వివిధ క్రీడల్లో ఒలింపిక్ అర్హత టోర్నీలు చాలానే జరుగుతాయి. వందల మంది అథ్లెట్లు టోక్యో బెర్తుల కోసం పోటీల్లో పాల్గొంటుంటారు. ప్రస్తుతం బాక్సింగ్, బ్యాడ్మింటన్ సహా ఒలింపిక్స్ అర్హతను నిర్దేశించే ఎన్నో టోర్నీలు ఆగిపోయాయి. వీటిని మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియట్లేదు. వీటి సంగతి తేలకుండా ఒలింపిక్స్ నిర్వహణ సాధ్యం కాదు. అర్హత టోర్నీల విషయానికి వస్తే.. ఈ సమయంలో విదేశాలకు వెళ్లి సాధన చేయాల్సిన క్రీడాకారుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. అత్యంత కీలక సమయంలో సాధన ఆగిపోవడం ఒలింపిక్స్ సన్నాహాలకు గట్టి దెబ్బే. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ను వెనక్కి జరపాలన్న డిమాండ్ క్రీడాకారుల నుంచే వస్తోంది.
అత్యుత్తమ మార్గమిదే..