German Open: భారత యువ కెరటం లక్ష్యసేన్‌కు నిరాశ. జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో అతను రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. సెమీఫైనల్లో గొప్ప పోరాటంతో ప్రపంచ నంబర్‌వన్ అక్సెల్‌సెన్‌కు షాకిచ్చి టైటిల్‌పై ఆశలు రేపిన అతడు తుది సమరంలో తడబడ్డాడు. ఆదివారం పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 18-21, 15-21తో కున్లావత్ వితిద్‌సరన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓటమి చవిచూశాడు. ఈ మ్యాచ్‌లో తొలి గేమ్ ఆరంభం నుంచి విజృంభించిన థాయ్ స్టార్ 4-0 ఆధిక్యంలో నిలిచాడు. కానీ పుంజుకున్న లక్ష్య.. 4-4తో స్కోరు సమం చేశాడు. అయితే పట్టువదలని వితిద్ విరామ సమయానికి 11-6తో ఆధిక్యంలో నిలిచాడు. బ్రేక్ తర్వాత లక్ష్య మెరుగ్గా ఆడాడు. తన శైలిలో షాట్లు కొడుతూ నెమ్మదిగా అంతరాన్ని తగ్గించాడు. కానీ ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన వితిద్ తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లోనూ థాయ్ ఆటగాడిదే జోరు. ఒక దశలో 7-3తో ఆధిక్యంలో నిలిచిన అతడు ఆ తర్వాత 15-10తో విజయం దిశగా దూసుకెళ్లాడు. ఆఖర్లో లక్ష్య కాస్త ప్రతిఘటించినా.. అయిదే మ్యాచ్ పాయింట్లు సాధించిన వితిద్.. అదే దూకుడుతో మ్యాచ్‌తో పాటు టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
జర్మనీపై భారత్ ప్రతీకారం
FIH Women Pro League: ఎఫ్‌ఐహెచ్ మహిళల ప్రొ లీగ్ హాకీ టోర్నమెంట్లో జర్మనీపై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ 3-0తో షూటౌట్లో జర్మనీని ఓడించింది. నిర్ణీత సమయానికి రెండు జట్లు 1-1 గోల్స్‌తో సమవుజ్జీలుగా నిలిచాయి. 27వ నిమిషంలో జర్మనీ తరఫున ఫెలీసియా గోల్ చేయగా.. నిషా (40వ ని) చేసిన గోల్‌తో భారత్ స్కోరు సమం చేసింది. ఆ తర్వాత రెండు జట్లు మరో గోల్ చేయలేకపోవడంతో మ్యాచ్ షూటౌట్‌కు మళ్లింది. షూటౌట్లో భారత్ తరఫున సలీమా, సంగీత, సోనిక గోల్స్ కొట్టగా.. జర్మనీ ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది. కెప్టెన్ సవిత అద్భుతంగా గోల్‌కీపింగ్ చేసి ప్రత్యర్థి ప్రయత్నాలను అడ్డుకుంది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో జర్మనీ షూటౌట్లో 2-1తో భారత్‌పై గెలిచిన సంగతి తెలిసిందే. ఈ విజయంతో బోనస్ సహా రెండు పాయింట్లు సాధించిన భారత్ (12) రెండో స్థానంలో కొనసాగుతోంది.
జాతీయ జూనియర్ చెస్ ఛాంప్ ప్రియాంక
National Chess Champion: తెలుగు తేజం నూతక్కి ప్రియాంక జాతీయ జూనియర్ చెస్ ఛాంపియన్ అయింది. దిల్లీలో ముగిసిన ఈ ఛాంపియన్‌షిప్‌లో ప్రియాంక అండర్-20 బాలికల విభాగంలో విజేతగా నిలిచింది. 9 రౌండ్లలో ఆమె 7.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ప్రియాంక ఇటీవలే మహిళా గ్రాండ్‌మాస్టర్ హోదాను సాధించింది.