ఒలింపిక్స్‌లో పతకం సాధించడమేమో కానీ.. ఈ టోర్నీలో పాల్గొనాలని ప్రతి ఒక్క క్రీడాకారుడు ఆశ పడుతుంటారు. ఆ వేదిక ద్వారా సత్తాచాటాలని భావిస్తుంటారు. అలాగే అభిమాన అథ్లెట్ ఆట కోసం ఫ్యాన్స్ కూడా వేయి కళ్లతో ఎదురుచూస్తుంటారు. నాలుగేళ్లకొకసారి జరిగే ఈ విశ్వసమరంలో ఎందరో అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ ఈసారి ఎందరికో స్ఫూర్తిగా నిలిచిన కొందరు స్టార్ ప్లేయర్లు ఈ మెగాటోర్నీకి దూరమయ్యారు. వారి అసమాన పోటీని అభిమానులు మిస్ అవనున్నారు. వారెవరో చూద్దాం.
సైనా నెహ్వాల్
భారత బ్యాడ్మింటన్ చరిత్రలో తనకంటూ ఓ అధ్యాయాన్నే లిఖించుకుంది సైనా నెహ్వాల్. అంచెలంచెలుగా ఎదుగుతూ ఎందరో క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచింది. జూనియర్ స్థాయి పతకం నుంచి ఒలింపిక్ పతకం వరకు చేరిన ఆమె ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. వరుసగా మూడుసార్లు విశ్వక్రీడల్లో పాల్గొన్న సైనా.. ఈసారి మాత్రం టోక్యో ఒలింపిక్స్‌కు దూరమైంది. ర్యాంకింగ్స్‌లో దిగువన ఉన్న కారణంగా ఈమెతో పాటు కిదాంబి శ్రీకాంత్ ఈసారి మెగాటోర్నీకి అర్హత సాధించలేకపోయారు. స్పెయిన్ స్టార్ షట్లర్ కరోలినా మారిన్ కూడా ఈ పోటీల్లో పాల్గొనట్లేదు. గాయానికి శస్త్ర చికిత్స జరిగిన కారణంగా ఈమె టోర్నీ నుంచి తప్పుకొంది.
ఫెదరర్
టెన్నిస్ లెజెండ్ రోజర్ ఫెదరర్ ఈసారి ఒలింపిక్స్‌లో పాల్గొనట్లేదని చెప్పేశాడు. వింబుల్డన్ టోర్నీ ఆడుతున్న సమయంలో తన మోకాలికి గాయం అవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాడు. ఫెదరర్ ఇక ఒలింపిక్స్ ఆడే అవకాశాలు పెద్దగా లేకపోవచ్చు. రోజర్‌కు ప్రస్తుతం 39 ఏళ్లు. ఇప్పటికే అతడిని గాయాలు వేధిస్తున్నాయి. ఇంకా.. చాలా ఏళ్లుగా మేజర్ టోర్నీ టైటిళ్లను నెగ్గలేదు. మళ్లీ వచ్చే ఒలింపిక్స్ వరకు అతడు ఫామ్‌లో ఉండటం కష్టమే. దీంతో భవిష్యత్ విశ్వక్రీడల్లో ఫెదరర్ ఆటను చూడమే అనుమానమే.
నాదల్
ఫ్రెంచ్ ఓపెన్ సెమీ ఫైనల్లో జకోవిచ్ చేతిలో ఓడిపోయాడు మరో టెన్నిస్ స్టార్ ప్లేయర్ రఫెల్ నాదల్. అనంతరం వింబుల్డన్‌తో పాటు ఒలింపిక్స్‌కూ దూరమవుతున్నట్లు వెల్లడించాడు. 2008, 2016 విశ్వక్రీడల్లో స్పెయిన్ తరఫున స్వర్ణం సాధించాడితడు. ఇప్పటికే గాయాలు ఇబ్బందిపెడుతుండటం వల్ల మెగాటోర్నీకి దూరమవడమే మేలని భావించాడు. నాదల్ ఖాతాలో 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఉన్నాయి. ఇతడితో పాటు డొమినిక్ థీమ్ కూడా టోక్యోకు వెళ్లట్లేదని స్పష్టం చేశాడు.
సెరెనా విలియమ్స్
ఒలింపిక్స్ నుంచి తప్పుకొంటున్నట్లు అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ప్రకటించింది. యూఎస్ ఒలింపిక్ జాబితాలో పేరు లేని కారణంగా ఆమె ఈ మెగా ఈవెంట్ నుంచి తప్పుకొంది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో సింగిల్స్, డబుల్స్‌లో పాల్గొన్న సెరెనా.. రెండు గోల్డ్ మెడల్స్ సాధించింది. సిడ్నీ ఒలింపిక్స్ 2000లో మహిళల డబుల్స్‌లో స్వర్ణం గెలిచిందీ స్టార్ ప్లేయర్. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లోనూ బంగారు పతకం తన ఖాతాలో వేసుకుంది. తన సోదరి వీనస్ విలియమ్స్ జతగా డబుల్స్‌లో గోల్డ్ మెడల్స్ సాధించింది సెరెనా. ఇక రియో వేదికగా 2016 మెగా ఈవెంట్లో మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టింది. ఇప్పటికే గాయాలతో సతమతమవుతోన్న 39 ఏళ్ల సెరెనా భవిష్యత్ విశ్వక్రీడల్లోనూ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది.
మో ఫరా
బ్రిటన్‌కు చెందిన అథ్లెట్ మో ఫరా(Mo Farah).. తన సుదూర పరుగుతో ఎన్నో రికార్డులు, ఘనతలూ సాధించాడు. చివరగా రియో ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణాలతో పాటు మొత్తంగా నాలుగుసార్లు ఒలింపిక్స్ ఛాంపియన్‌గా నిలిచాడు. కానీ ఈ ఏడాది టోక్యోలో జరగనున్న విశ్వ క్రీడల(Tokyo Olympics)కు కనీసం అర్హత సాధించలేకపోయాడు. ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో భాగంగా బ్రిటీష్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 27ని.28 సెకండ్ల కనీస అర్హత సమయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో ఈసారి మెగాక్రీడలకు దూరమయ్యాడు.
నెయ్మర్
2016 రియో ఒలింపిక్స్‌లో బ్రెజిల్ స్వర్ణం సాధించడంలో కీలకపాత్ర పోషించాడు ఆ దేశ స్టార్ ఫుట్‌బాల్ ప్లేయర్ నెయ్మర్ జూనియర్. ఫైనల్లో పెనాల్టీ కిక్‌తో సొంతగడ్డపై జట్టుకు విజయాన్ని అందించాడు. కానీ ఈసారి టోక్యో ఒలింపిక్స్‌ను మిస్ అవబోతున్నాడు. విశ్వక్రీడల్లో పాల్గొనాలనుకున్న స్టార్ ప్లేయర్లకు ఫుట్‌బాల్ క్లబ్‌లు (PSG) రెడ్ కార్డ్ చూపించాయి. దీంతో ఇతడితో పాటు మహ్మద్ సాలా, ఎంబపే కూడా ఒలింపిక్స్‌లో పాల్గొనట్లేదు.
ఇవీ చూడండి