అది ఒడిశా జిల్లా సుందర్ గఢ్ జిల్లా కడోబహల్ గ్రామంలో గిరిజన వాడ. పూట గడవని పెంకుటింట్లో పుట్టాడతను. హాకీ అంటే ఇష్టం. ఎప్పటికైనా దేశం తరపున ఆడాలన్న కసితో పెరిగాడు. వెదురు కర్రలనే హాకీ స్టిక్‌గా చిరిగిన బట్టలతో తయారు చేసిన బంతినే బాల్‌గా ఉపయోగించి నిరంతరం ప్రాక్టీస్ చేసేవాడు. పేదరికం సృష్టించిన ఎన్నో అడ్డంకుల్ని దాటి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం.. వహించే స్థాయికి చేరాడు నీలం సంజీప్ జెస్. పల్లెటూరి నుంచి ప్రపంచ వేదికపై అడుగు పెట్టాడు. ఒడిశాలో జరగనున్న హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టులో కీలక ఆటగాడిగా సత్తా చాటేందుకు నీలం సిద్ధమయ్యాడు.
వ్యవసాయం చేస్తున్న నీలమ్ తల్లి పెంకుటింటి జీవనం.. గ్యాస్,కరెంట్ సైతం..
నిరంతర శ్రమతో హాకీ జాతీయ జట్టులో కీలక ఆటగాడిగా మారినా నీలమ్ సంజీప్ జెస్ జీవితం ఏమీ మారలేదు. జాతీయ ఆటగాడు అయినా ఇప్పటికీ పెంకుటిల్లులోనే నీలమ్ కుటుంబం జీవిస్తోంది. మూడేళ్లుగా జాతీయ హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నా జట్టులో స్టార్ డిఫెండర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నా నీలమ్ ఆర్థిక కష్టాలు తీరలేదు.
ఇప్పటికీ నీలమ్ తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తున్నారు. నీలమ్ ఇప్పటికీ సొంతంగా పక్కా భవనాన్ని మాత్రం నిర్మించుకోలేకపోయాడు. ఇప్పటికీ 40 సంవత్సరాల క్రితం తన తండ్రి నిర్మించిన పెంకుటింట్లోనే జీవిస్తున్నాడు. కడు పేదరికంలో ఉన్న ఆ కుటుంబం ఆ ఇంటిని కూడా 40 ఏళ్ల క్రితం గ్రామస్థుల నుంచి అప్పుగా తీసుకున్న డబ్బుతో కట్టుకుంది. ఆ ఇంటికి గ్యాస్, నీటి కనెక్షన్లు కూడా లేవు. 19 ఏళ్ల పాటు నీలమ్ ఇంటికి విద్యుత్ కూడా లేదు. 2017లో ఆ ఇంటికి కరెంట్ వచ్చింది. అప్పటివరకూ ఆ చీకట్లు కమ్ముకున్న పెంకుటింటిలోనే నీలమ్ జీవించాడు.
రైతు బిడ్డ నీలమ్..
నీలమ్ తండ్రి బిపిన్, తల్లి జిరా ఇద్దరు చిన్న రైతులు. వారికి ఉన్న కొద్దిపాటి పొలంలో బంగాళాదుంపలు, కాలీఫ్లవర్‌లు పండిస్తున్నారు. సంజీప్‌కు ఒక సోదరుడు, ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. అయితే ఎక్కువగా టోర్నీల్లో భాగంగా జట్టుతో కలిసి నగరాల్లో తిరిగే నీలమ్ ఖాళీ సమయాల్లో వచ్చి తన పాత పెంకుటింట్లోనే ఉంటాడు.
ఇంతటి కఠిన పరిస్థితులను తట్టుకుని ప్రపంచకప్ జట్టులో నీలమ్ సభ్యునిగా ఎన్నికవ్వడం మాములు విషయం కాదు. 12వ దక్షిణాసియా క్రీడల్లో రజత పతక విజేతగా నిలిచిన భారత హాకీ జట్టులో నీలం సంజీప్ సభ్యుడు. అండర్ 18 ఆసియా కప్ లో టీమిండియాను గోల్డ్ మెడల్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన సంజీప్ అండర్-23 పురుషుల హాకీ టోర్నమెంట్‌లో భారత యువ జట్టుకు ప్రాతినిధ్యం వహించి.. కాంస్య పతకాన్ని సాధించాడు. తమ అబ్బాయి దేశానికి ప్రాతినిధ్యం వహించడం తమకెంతో గర్వంగా ఉందని నీలమ్ తల్లిదండ్రులు సంబరపడి పోతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సాయం అందలేదని ప్రభుత్వం ఏదైనా పథకం కింద ఇల్లు కేటాయించాలని అభ్యర్థిస్తున్నారు.
నీలమ్ గెలుచుకున్న అవార్డులు