తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ విజేత 'స్వైటెక్‌'.. నాలుగేళ్లలో మూడు సార్లు.. - స్వైటెక్‌ అప్డేట్లు

French Open Womens Singles Winner : ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో స్వైటెక్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించి టైటిల్‌ను సాధించింది.

French Open Womens Singles Winner
French Open Womens Singles Winner

By

Published : Jun 10, 2023, 9:52 PM IST

Updated : Jun 10, 2023, 10:07 PM IST

French Open Womens Singles Winner : ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌లో స్వైటెక్‌ (పోలెండ్‌) అదరగొట్టింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ముచోవా (చెక్‌ రిపబ్లిక్‌)ను 6-2, 5-7, 6-4 తేడాతో ఓడించి టైటిల్‌ పట్టేసింది. దీంతో ఎర్రమట్టి కోర్టులో వరుసగా రెండో సారి, నాలుగేళ్లలో మూడో సారి టైటిల్‌ సాధించింది. మరోవైపు 2020, 2022లో స్వైటెక్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌ టైటిళ్లు నెగ్గింది. నిరుడు యూఎస్‌ ఓపెన్‌లోనూ విజేతగా నిలిచింది.

శనివారం జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ రసవత్తరంగా సాగింది. మొదటి సెట్‌లో స్వైటెక్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. కానీ, అనూహ్యంగా పుంజుకొన్న ముచోవా రెండో సెట్‌లో పైచేయి సాధించింది. అనంతరం విజయం మూడో సెట్‌ మీద ఆధారపడడంతో ఇద్దరూ పోటాపోటీగా ఆడారు. ముచోవా గట్టి పోటీ ఇచ్చినప్పటికీ ఆఖర్లో స్వైటెక్‌ విజయం సాధించింది.

పురుషుల సింగల్​ ఫైనల్​లోకి జకోవిచ్​
మరోవైపు,ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో జకోవిచ్‌ అడుగుపెట్టాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో ఈ మూడో సీడ్‌ ఆటగాడు 6-3, 5-7, 6-1, 6-1తో స్పెయిన్‌ యువ సంచలనం, ప్రపంచ నంబర్‌వన్‌ అల్కరాస్‌పై విజయం సాధించాడు. తొలి సెట్లో జకోదే జోరు. నాలుగో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 3-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లాడు. ఆ తర్వాత అల్కరాస్‌ తన సర్వీస్‌లు నిలబెట్టుకున్నాడు కానీ జకో సర్వీస్‌ను బ్రేక్‌ చేయలేకపోయాడు. దీంతో ఆధిక్యాన్ని కొనసాగించిన జకో సెట్‌ సొంతం చేసుకున్నాడు. రెండో సెట్లో అల్కరాస్‌ గొప్పగా పుంజుకున్నాడు. మరోవైపు జకో కూడా ఏ మాత్రం తగ్గలేదు. దీంతో సర్వీస్‌లు, రిటర్న్‌లు, విన్నర్లు, ఏస్‌లు.. ఇలా పోరు మంచి కిక్కునిచ్చింది. రెండో సెట్లో 3-3తో స్కోరు సమమైన దశలో అల్కరాస్‌ విజృంభించాడు. తన సర్వీస్‌ నిలబెట్టుకోవడంతో పాటు జకో సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 5-3తో నిలిచాడు. కానీ జకో వదల్లేదు. తర్వాతి రెండు గేమ్‌లు గెలిచి స్కోరు సమం చేశాడు.

ఆ తర్వాత రెండు గేమ్‌లను ఖాతాలో వేసుకున్న అల్కరాస్‌ సెట్‌ దక్కించుకున్నాడు. ఈ రెండు సెట్లు పూర్తి అవడానికే 2 గంటల 16 నిమిషాలు పట్టింది. ఇక మజా మరో స్థాయికి చేరుతుందనుకుంటుండగా మూడో సెట్‌ రెండో గేమ్‌ నుంచి ముందు చేతి, ఆ తర్వాత కాలి కండరాలు పట్టేయడంతో అల్కరాస్‌ ఇబ్బంది పడ్డాడు. వైద్య సాయం తీసుకున్నా ఫలితం లేకపోయింది. కోర్టులో అతను అసౌకర్యంగా కదిలాడు. కానీ పోరాట పటిమతో చివరి వరకూ నిలబడ్డాడు. దీంతో మూడు, నాలుగు సెట్లలో కేవలం ఒక్కో గేమ్‌ చొప్పున కోల్పోయిన జకో మ్యాచ్‌ సొంతం చేసుకున్నాడు. ఏకపక్షంగా సాగిన మరో సెమీస్‌లో కాస్పర్‌ రూడ్‌ (నార్వే) 6-3, 6-4, 6-0తో జ్వెరెవ్‌ (జర్మనీ)ను ఓడించాడు.

"అల్కరాస్‌ పరిస్థితి పట్ల చింతిస్తున్నా. టోర్నీలో ఈ దశలో ఇలా తిమ్మిర్లు, శారీరక సమస్యలు రాకూడదు. అతనో అద్భుతమైన పోటీదారు. పోరాటాన్ని కొనసాగిస్తూ చివరి వరకూ ఆడిన అతనికి ప్రశంసలు దక్కాలి. అతను త్వరగానే కోలుకుంటాడని ఆశిస్తున్నా. నెట్‌ దగ్గర అతనితో మాట్లాడా. అతనెంత యువకుడో తనకు తెలుసు. అతనికి ఇంకా చాలా భవిష్యత్‌ ఉంది. రాబోయే రోజుల్లో ఈ టోర్నీలో అతను చాలా సార్లు విజేతగా నిలుస్తాడు"

- జకోవిచ్‌, మూడో సీడ్‌ ఆటగాడు

Last Updated : Jun 10, 2023, 10:07 PM IST

ABOUT THE AUTHOR

...view details