నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఫ్రెంచ్ ఓపెన్ పురుషుల సింగిల్స్ సెమీస్‌లో అలెగ్జాండర్ జ్వెరెవ్ అనూహ్యంగా తప్పుకోవాల్సి వచ్చింది. బంతి ఆడే ప్రయత్నంలో కిందపడి, నొప్పితో విలవిలాడిన జ్వెరెవ్.. నిరాశతో ఆట మధ్యలో నిష్క్రమించాల్సి వచ్చింది. అయితే ఆటలో కొదమ సింహాల్లా తలపడిన వీరు.. కోర్టు బయట ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని క్రీడా స్ఫూర్తిని చాటారు. దీనిపై నెటిజన్లు క్రీడా స్ఫూర్తి అంటే ఇదే అంటూ కామెంట్లు పెడుతున్నారు. వారిద్దరూ కలిసి ఉన్న ఫొటోపై మన క్రికెట్ దిగ్గజాలు కూడా స్పందించారు.
జ్వెరెవ్ తప్పుకోవాల్సి రావడంపై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి విచారం వ్యక్తం చేశారు. 'ఇందుకే ఆటకు ఏడిపించే శక్తి కూడా ఉందనేది' అంటూ ట్వీట్ చేశారు. జ్వెరెవ్ తప్పక తిరిగివస్తారని ఆకాక్షించారు. అలాగే రఫేల్ నాదల్ చూపిన క్రీడాస్ఫూర్తి, వినయం అమోఘం అంటూ కొనియాడారు. వారిద్దరు కలిసి ఉన్న చిత్రాన్ని షేర్ చేశారు. మన క్రికెట్ లెజెండ్ సచిన్ తెందూల్కర్ కూడా నాదల్ వ్యక్తిత్వాన్ని కొనియాడారు. నాదల్ చూపిన వినయం, శ్రద్ధ ఆయన్ను ప్రత్యేకంగా నిలుపుతాయంటూ ట్వీట్ చేశారు.
ఈ సంఘటన మినహా ఎర్రమట్టి కోర్టులో రఫెల్ నాదల్ తన హవా కొనసాగించాడు. ఫ్రెంచ్ ఓపెన్ తుదిపోరుకు చేరుకున్నాడు. సెమీస్‌లో 7-6 (10-8), 6-6తో నాదల్ (స్పెయిన్) ఆధిక్యంలో ఉన్న దశలో జ్వెరెవ్ (జర్మనీ) గాయంతో తప్పుకున్నాడు. రెండు సెట్ల ఆట కూడా పూర్తి కాలేదు గానీ అందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే ఆటగాళ్లిద్దరూ పాయింట్ల కోసం ఏ స్థాయిలో తలపడ్డారో అర్థం చేసుకోవచ్చు. బంతిని అవతలికి పంపే ప్రయత్నంలో కింద పడ్డ జ్వెరెవ్ కుడి కాలు చీలమండకు తీవ్ర గాయమైంది. నొప్పితో అరుస్తూ విలవిల్లాడాడు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నడవలేకపోవడం వల్ల అతణ్ని చక్రాల కుర్చీలో బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వైద్యులు తేల్చడంతో చేతి కర్రల సాయంతో కోర్టులోకి వచ్చిన అతను.. నాదల్‌తో కరచాలనం చేసి, వీక్షకుల కోసం చేతులు గాల్లోకి ఊపాడు. అయితే అప్పటికే అతడి ఆటతీరుతో మురిసిన వీక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. అలాగే అతడు కన్నీళ్లతో కోర్టును వీడటం నాదల్‌నూ బాధించింది. అతను ఎన్నో గ్రాండ్‌స్లామ్‌లు గెలవాలని కోరుకున్నాడు.
ఇదీ చూడండి :ISSF World Cup 2022: మెరిసిన అంజుం.. షూటింగ్ ప్రపంచకప్‌లో రజతం