తెలంగాణ

telangana

ETV Bharat / sports

గాయంతో జ్వెరెవ్​ నిష్క్రమణ.. 14వ సారి ఫైనల్లో నాదల్‌.. అయినా బాధలోనే..

French Open 2022: ఒకరు ఏస్‌ కొడితే.. మరొకరు విన్నర్‌తో బదులిచ్చారు. ఒకరు క్రాస్‌కోర్టు షాట్లతో ఇబ్బంది పెట్టాలని చూస్తే.. మరొకరు మెరుపు వేగంతో సమాధానమిచ్చారు. శక్తిమంతమైన సర్వీస్‌లకు.. అంతే వేగంతో రిటర్న్‌లు. నాదల్‌, జ్వెరెవ్‌ సెమీస్‌లో కొదమ సింహల్లా తలపడ్డారు. ప్రతి పాయింట్‌ కోసం పోరాటం.. ప్రతి గేమ్‌లోనూ ఉత్కంఠ..   ప్రతి సెట్‌లోనూ హోరాహోరీ. తొలి సెట్‌ టైబ్రేకర్‌లోనే తేలింది.. రెండో సెట్‌ కూడా అదే దారిలో సాగింది. కానీ అంతలోనే తీవ్ర నిరాశ. బంతిని ఆడే ప్రయత్నంలో కిందపడ్డ జ్వెరెవ్‌ చీలమండకు తీవ్ర గాయమైంది. నొప్పితో బాధపడుతూ అతను మధ్యలోనే నిష్క్రమించాడు. 14వ సారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్లో నాదల్‌ అడుగుపెట్టాడు.

french open 2022
rafael nadal

By

Published : Jun 4, 2022, 6:55 AM IST

French Open 2022: ఎర్రమట్టి కోర్టు రారాజు రఫెల్‌ నాదల్‌ మరోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ తుదిపోరుకు చేరాడు. శుక్రవారం పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో 7-6 (10-8), 6-6తో నాదల్‌ (స్పెయిన్‌) ఆధిక్యంలో ఉన్న దశలో జ్వెరెవ్‌ (జర్మనీ) గాయంతో తప్పుకున్నాడు. రెండు సెట్ల ఆట కూడా పూర్తి కాలేదు కానీ అందుకు మూడు గంటలకు పైగా సమయం పట్టిందంటే ఆటగాళ్లిద్దరూ పాయింట్ల కోసం ఏ స్థాయిలో తలపడ్డారో అర్థం చేసుకోవచ్చు. వెనకబడ్డా వేగంగా పుంజుకోవడం.. దూరంగా వెళుతున్న విజయాన్ని పోరాటంతో లాగేయడం.. ఇదీ నాదల్‌ నైజం. తొలి సెట్‌లో అతని ఆట చూస్తే ఇలాగే అనిపిస్తోంది. ఆ సెట్‌ గంటన్నరకు పైగా సాగింది. తొలి సర్వీస్‌నే బ్రేక్‌ చేసిన మూడో సీడ్‌ జ్వెరెవ్‌ ఆరంభంలో దూకుడు ప్రదర్శించాడు. 2-4తో వెనకబడ్డ దశలో అయిదో సీడ్‌ రఫాలోని అసలు సిసలు ఆటగాడు బయటకు వచ్చాడు. ఏడో గేమ్‌లో ప్రత్యర్థికి ఒక్క పాయింట్‌ కూడా కోల్పోని అతను.. ఎనిమిదో గేమ్‌లో జ్వెరెవ్‌ సర్వీస్‌ను బ్రేక్‌ చేసి 4-4తో స్కోరు సమం చేశాడు. తన సర్వీస్‌ను నిలబెట్టుకుని 5-4తో ఆధిక్యం సాధించాడు. కానీ జ్వెరెవ్‌ కూడా తగ్గేదేలే అన్నట్లు ధైర్యంగా నిలబడ్డాడు. 5-6తో ఉన్నప్పుడు గేమ్‌ పాయింట్‌ను కాపాడుకుని 6-6తో సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించాడు. సెట్‌ సాగిన తీరు ఒకెత్తయితే.. టైబ్రేకర్‌ జరిగిన తీరు మరొకెత్తు. అందులోనూ ఆరంభంలో జ్వెరెవ్‌ పెత్తనం చలాయించాడు. కానీ 2-6తో వెనకబడ్డ తరుణంలో నాదల్‌ పుంజుకున్న తీరు అద్భుతం. అతను వరుసగా అయిదు పాయింట్లు నెగ్గాడు. శక్తిమంతమైన ఏస్‌తో మూడో పాయింట్‌ సాధించాడు. అయిదో పాయింట్‌ నెగ్గే క్రమంలో అతను ప్రదర్శించిన నైపుణ్యాలు అబ్బురపరిచాయి. కోర్టుకు రెండు మూలలా బంతిని పంపిస్తూ ప్రత్యర్థి పాయింట్‌ సాధించాలని చూశాడు. కానీ కుడి వైపు నుంచి ఎడమకు మెరుపు వేగంతో పరుగెత్తిన అతను.. బంతిని జ్వెరెవ్‌కు అందకుండా కొట్టాడు. స్కోరు 8-8తో సమమైనపుడు పట్టు వదలని నాదల్‌.. వరుసగా రెండు పాయింట్లతో సెట్‌ సొంతం చేసుకున్నాడు.

గాయంతో విలవిల్లాడుతున్న జ్వెరెవ్

అదే హోరాహోరీ..: తొలి సెట్‌ గెలుపు ఇచ్చిన ఉత్సాహంతో నాదల్‌.. ఎలాగైనా గెలిచి ప్రత్యర్థిని అందుకోవాలనే పట్టుదలతో జ్వెరెవ్‌ రెండో సెట్లో ప్రాణం పెట్టి తలపడ్డారు. ఒకరి సర్వీస్‌ను మరొకరు బ్రేక్‌ చేసుకుంటూ సాగారు. మూడో గేమ్‌ పాయింట్‌ను సాధించుకునేందుకు నాదల్‌.. కాపాడుకునేందుకు జ్వెరెవ్‌ తీవ్రంగా ప్రయత్నించారు. ఏకంగా 44 షాట్ల పాటు సుదీర్ఘంగా సాగిన ఆ ర్యాలీలో చివరకు నాదల్‌కే పాయింట్‌ దక్కింది. దాని కోసం చెమట చిందించిన నాదల్‌ వెంటనే అలసటతో కుర్చీపై కూలబడ్డాడు. ఆ అవకాశాన్ని ఉపయోగించుకున్న జ్వెరెవ్‌ వరుసగా మూడు గేమ్‌లు గెలిచాడు. విన్నర్లతో చెలరేగాడు. అలా అని నాదల్‌ ఆగిపోలేదు. ఆగిపోతే అతను నాదల్‌ ఎందుకవుతాడు? వెంటనే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్‌ చేశాడు. తన బ్యాక్‌హ్యాండ్‌ బలాన్ని చూపించాడు. వరుసగా తొమ్మిది, పది గేమ్‌లు గెలిచి స్కోరు 5-5తో సమం చేశాడు. ఆ దశలో తన సర్వీస్‌ నిలబెట్టుకున్న జ్వెరెవ్‌ 6-5తో సెట్‌ గెలిచేలా కనిపించాడు. కానీ బంతిని స్పిన్‌ చేస్తూ.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతూ నాదల్‌ తర్వాతి గేమ్‌ గెలిచాడు. అయితే ఆ గేమ్‌ చివరి పాయింట్‌లో బంతిని అవతలికి పంపే ప్రయత్నంలో కింద పడ్డ జ్వెరెవ్‌ కుడి కాలు చీలమండకు తీవ్ర గాయమైంది. నొప్పితో అరుస్తూ విలవిల్లాడాడు. బాధతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. నడవలేకపోవడం వల్ల అతణ్ని చక్రాల కుర్చీలో బయటకు తీసుకెళ్లారు. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని వైద్యులు తేల్చడంతో చేతి కర్రల సాయంతో కోర్టులోకి వచ్చిన అతను.. నాదల్‌తో కరచాలనం చేసి బాధతో వెళ్లిపోయాడు. అప్పటివరకూ గొప్పగా పోరాడిన అతను అలా నిష్క్రమించడం కలచి వేసింది. హోరాహోరీగా సాగుతున్న పోరుకు ఇలాంటి ముగింపు దొరకడం నిరాశ కలిగించింది.

జ్వెరెవ్​తో నాదల్

"జ్వెరెవ్‌ కన్నీళ్లతో కోర్టు వీడడం బాధ కలిగిస్తోంది. అతనో గొప్ప ఆటగాడు. ఈ టోర్నీలో మంచి ప్రదర్శన చేస్తూ వచ్చాడు. తొలి గ్రాండ్‌స్లామ్‌ విజయం కోసం అతని పోరాటం నాకు తెలుసు. అతను ఎన్నో గ్రాండ్‌స్లామ్‌లు గెలవాలి. ఇది చాలా కష్టమైన మ్యాచ్‌. అతను నాకు బలమైన పోటీదారు. మరోసారి ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఫైనల్‌ చేరడం ఓ కలగా ఉంది. కానీ మ్యాచ్‌కు ఇలాంటి ముగింపు నిరాశ కలిగించింది"

-నాదల్‌, టెన్నిస్ క్రీడాకారుడు

ఫైనల్​కు రూడ్​:ఫ్రెంఛ్​ ఓపెన్​ ఫైనల్స్​కు చేరుకున్నాడు క్యాస్పర్​ రూడ్​. పురుషుల సింగిల్స్​ మరో సెమీఫైనల్లో సిలిచ్​ను ఓడించాడు. 3-6, 6-4, 6-2, 6-2 తేడాతో గెలుపొందాడు. ఫైనల్లో నాదల్​తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.

ఇదీ చూడండి:ఫ్రెంచ్​​ ఓపెన్​లో భారత్​కు నిరాశే.. సెమీస్​లో బోపన్న జోడీ ఓటమి

ABOUT THE AUTHOR

...view details