ఫుట్‌బాల్ అంటే టక్కున మనకు గుర్తొచ్చేది రెండే పేర్లు.. ఒకటి లియోనల్ మెస్సీ ఇంకొటి క్రిస్టియానో రొనాల్డో. ఈ దిగ్గజాలు తమ ఆటతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తారు. మ్యాచ్‌ల్లో తమదైన స్టైల్లో పోటాపోటీగా ఆడుతుంటారు. అయితే వ్యక్తిగతంగా ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్న ఈ ఫుట్‌బాల్ స్టార్స్ చూసేందుకు సమానంగా కనిపించనప్పటికీ లీడ్‌లో మాత్రం లియోనల్ మెస్సీనే. ఇందుకు సరైన ఉదాహరణ గతేడాది డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్‌కప్. అప్పుడు కూడా అర్జెంటీనా ఘన విజయం సాధించి చరిత్రకెక్కింది. జట్టును తనదైన రీతిలో నడిపించిన మెస్సీ అత్యధిక గోల్స్‌ను స్కోర్ చేసి తమ 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాడు. అలా అర్జెంటీనాకు మూడోసారి టైటిల్‌ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఈ ఒక్క గెలుపుతో మెస్సీ రేంజ్ ఇంకాస్త పెరిగింది.
రొనాల్డో వరల్డ్ రికార్డు.. మరి మెస్సీ చూస్తూ ఊరుకుంటాడా? - క్రిస్టియానో రొనాల్డో లేటెస్ట్ రికార్డు
మైదానంలో పుట్‌బాల్ దిగ్గజాలు లియోనల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డోలు ఎప్పుడూ పోటాపోటీగా ఆడుతుంటారు. తమదైన స్టైల్లో బంతిని గోల్ పోస్ట్‌ను దాటిస్తూ జట్టును విజయపథంలోకి నడిపిస్తుంటారు. అయితే తాజాగా వీరిద్దరూ సరికొత్త రికార్డులను నెలకొల్పారు. ఆ సంగతులు..
రికార్డుల్లోనూ తగ్గేదేలే..
ఎప్పుడూ పోటాపోటీగా కనిపించే ఈ దిగ్గజాలు రికార్డుల విషయంలోనూ తగ్గేదే లే అంటూ దూసుకెళ్తుంటారు. ఛాన్స్ దొరికినప్పుడల్లా ఒకరి రికార్డును ఇంకొకరు బద్దల కొడుతూనే ఉంటారు. తాజాగా రొనాల్డో ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. తమ దేశం తరపున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. జర్మనీ వేదికగా జరుగుతున్న యూరోకప్ 2024 క్వాలిఫయర్‌లో భాగంగా గురువారం లిచెన్‌స్టెయిన్, పోర్చుగల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును సృష్టించాడు. ఇది ఆయన 197వ మ్యాచ్ కావడం విశేషం. అయితే ఇది వరకు ఈ రికార్డు కువైట్‌కు చెందిన బాదర్ అల్-ముతావా పేరిట ఉండేది. అప్పట్లో 196 మ్యాచ్‌లతో ఆయనతో సమానంగా ఉన్న రొనాల్డో ఈ మ్యాచ్‌తో ఆ మార్క్‌ను దాటి ముందంజలో ఉన్నాడు.
'నేను కూడా ఓ రికార్డును సృష్టిస్తా మిత్రమా..'
మెస్సీ కూడా ఏమాత్రం తగ్గకుండా 'నేను కూడా ఓ రికార్డును సృష్టిస్తా' అంటూ తన కెరీర్‌లో 800వ గోల్ సాధించి నెట్టింట వైరలయ్యాడు. బ్రూనస్ ఎయిర్స్ వేదికగా గురువారం అర్జెంటీనా, పనామాల మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్‌లో మెస్సీ టీమ్ 2-0 తేడాతో గెలుపొందింది. ఇక ఆట 89వ మినిట్‌లో అర్జెంటీనాకు లభించిన ఫ్రీ కిక్‌ను మెస్సీ తనదైన శైలిలో గోల్‌గా మార్చాడు. అలా తన కెరీర్‌లోని 800వ గోల్‌ను పూర్తి చేసుకున్నాడు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీ. అయితే ఇటీవల అర్జెంటీనా తరపున తన 99వ గోల్‌ను సాధించాడు మెస్సీ. ఇక వంద గోల్స్ మార్క్‌ను చేరుకునేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాడు. మరోవైపు క్లబ్స్ తరపున 701 గోల్స్ సాధించిన మెస్సీ ప్రస్తుతం 800 గోల్స్‌తో కొనసాగుతున్నాడు.