కరోనా ధాటికి ప్రపంచం విలవిల్లాడుతోంది. వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. ఆ వైరస్ పేరు వింటేనే భయపడే పరిస్థితి తలెత్తింది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్ సైతం వాయిదా పడ్డాయి. ఈ వైరస్ కారణంగా వివిధ రంగాలు నష్టాల బాట పడుతుంటే.. ఒక్క రంగం మాత్రం అభివృద్ధి దిశగా సాగుతోంది. అదే ఈ- స్పోర్ట్స్. కరోనా మహమ్మారి దెబ్బకు అందరూ ఇళ్లకే పరిమితం కావడం వల్ల అంతర్జాలంలో ఆటలాడే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఈ- స్పోర్ట్స్ వృద్ధి చెందడానికి, ప్రపంచ వ్యాప్తంగా కొత్త ఆటగాళ్లను ఆకర్షించడానికి ఇదే సరైన సమయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇంట్లో ఉంటూనే..
ప్రస్తుత పరిస్థితుల్లో బయటకు వెళ్లి మైదానాల్లో ఆటలు ఆడే అవకాశమే లేదు. టీవీల్లోనూ మ్యాచ్‌లు చూసే వీల్లేదు. ఇంట్లోనే ఉంటూ.. కంప్యూటర్ ముందు కూర్చుని.. అంతర్జాలంలో ఆటలాడేస్తే.. కావాల్సినంత కాలక్షేపం దొరుకుతుంది కదా అని ఆలోచిస్తున్న ప్రజలు ఈ- స్పోర్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. జర్మనీలోని ప్రధాన ఫుట్‌బాల్ క్లబ్‌ల మధ్య "బుండెస్ లీగ్ హోం ఛాలెంజ్" టోర్నీని నిర్వహిస్తున్నారు. ఒక్కో జట్టులో ఒక్కో ప్రొఫెషనల్ ఆటగాడు కూడా ఉంటాడు. అమెరికాలో ఈ- నాస్కర్ వర్చువల్ కారు రేసు కూడా అలాంటిదే. ఇందులో ఇప్పటికే రెండు రేసులు జరిగాయి. మరోవైపు ఎన్‌బీఐ 2కె వర్చువల్ టోర్నీ అభిమానులకు బాస్కెట్‌బాల్ మజాను అందిస్తోంది. ఫార్ములావన్ ఈ- స్పోర్ట్స్ గ్రాండ్ ప్రిలో ఛార్లెస్ లెక్లెర్క్ (ఫెరారీ), అలెక్స్ (రెడ్‌బుల్), నోరిస్ (మెక్‌లారెన్) లాంటి ఎఫ్1 రేసర్లతో ఇంగ్లాండ్ క్రికెటర్ స్టోక్స్ పోటీపడబోతున్నాడు. ఈ ఆటల్లో మార్పు ఉండదు.. అందించే కిక్‌లో తేడా ఉండదు.. కానీ ఆటగాళ్లు బయట కాకుండా కంప్యూటర్ తెరల ముందు సిమ్యులేటర్లతో పోటీపడతారంతే. ఈ టోర్నీలన్నింటినీ ప్రత్యక్ష ప్రసారం కూడా చేస్తున్నారు.