ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సి నాయకత్వంలోని అర్జెంటీనాను సౌదీఅరేబియా మట్టికరిపించింది. దాదాపు 88 వేలకుపైగా హాజరైన జనసందోహంలో సౌదీ అరేబియా 2-1 తేడాతో అర్జెంటీనాను ఓడించింది. దీంతో సౌదీ అరేబియా అభిమానులు "మెస్సి ఎక్కడ..? మేం అతడిని ఓడించాం".. "మా జట్టు మా కలలను నెరవేర్చింది" అంటూ ఆనందంతో సంబరాలు జరిపారు.
సౌదీ గోల్‌కీపర్ ఆల్ ఓవైస్ ఈ మ్యాచ్‌లో హీరో. అర్జెంటీనా ఆటగాళ్లు గోల్‌పోస్టు వైపు కొట్టిన బంతులను అద్భుతంగా అడ్డుకొన్నాడు. ఆట ప్రారంభమైన పదో నిమిషంలోనే పెనాల్టీ రూపంలో వచ్చిన అవకాశాన్ని మెస్సి గోల్‌గా మలిచాడు. తొలి అర్ధ భాగంలో అర్జెంటీనా ఆటగాళ్లు పదేపదే గోల్‌పోస్టు వైపు దూసుకెళ్లారు. అయితే సౌదీ గోల్‌కీపర్ సమర్థంగా అడ్డుకొన్నాడు. ఆ తర్వాత రెండో అర్ధభాగంలో సౌదీ అరేబియా దాడి మొదలుపెట్టింది. 48వ నిమిషంలోనే సలేహ్ ఆల్ షెహ్రి, 53వ నిమిషంలో సలీమ్ ఆల్ డాసరి గోల్స్ చేసి అర్జెంటీనాను కంగుతినిపించారు. మ్యాచ్ ముగిశాక మెస్సి షాక్‌కు గురై అలాగే కాసేపు ఉండిపోయాడు.