తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచాన్ని గోల్స్ మాయలో పడేసేదెవరో?.. 'ఫిఫా వరల్డ్ ​కప్​' గెలిచేదెవరో? - ఫిఫా వరల్డ్​ కప్​ షెడ్యూల్

FIFA World Cup 2022 : విశ్వవ్యాప్తంగా విశేష ఆదరణ ఉన్న ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌నకు రంగం సిద్ధమైంది. ప్రత్యర్థిని రెప్పపాటులో బోల్తా కొట్టించి గోల్స్‌ వేటలో ఆటగాళ్లు దూసుకెళ్లే సమయం ఆసన్నమైంది. రేపు ఆరంభమయ్యే ఫిఫా ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌తో మైదానంలో 32 జట్ల యుద్ధానికి తెరలేపనుంది. గల్ఫ్‌ దేశం ఖతార్‌.. తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి వేదికగా మారింది. 29 రోజుల పాటు ప్రపంచం మొత్తం గోల్స్‌ మాయలో పడిపోనుంది. ఈ 22వ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టైటిల్‌ను ఒడిసి పట్టేందుకు జట్లన్నీ సమాయత్తం అయ్యాయి.

FIFA World Cup 2022
FIFA World Cup 2022

By

Published : Nov 19, 2022, 8:55 PM IST

FIFA World Cup 2022 : నాలుగేళ్లకు ఓసారి జరిగే ఫుట్‌బాల్ సమరానికి సమయం ఆసన్నమైంది. విశ్వవ్యాప్తంగా సాకర్‌ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్షణం.. రానే వచ్చింది. మైదానంలో 32 జట్ల మహా సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. మెస్సీ, రొనాల్డో, ధామస్‌ ముల్లర్‌, నెయ్‌మార్‌, ఎంబప్పే వంటి స్టార్‌ ఆటగాళ్లకు ఇదే చివరి ప్రపంచకప్‌ అని భావిస్తున్న వేళ ఈసారి ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ రసవత్తరంగా సాగనుంది. గల్ఫ్‌ దేశం ఖతార్‌ తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు వేదికగా మారింది. నవంబర్‌ 20న ఆతిథ్య జట్టు మ్యాచ్‌తోనే మొదలయ్యే 22వ ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ 29 రోజుల పాటు ప్రపంచాన్ని గోల్స్‌ మాయలో పడేయనుంది. ఈ మెగా టోర్నీ కోసం అయిదు నగరాల్లో ఎనిమిది వేదికలను సిద్ధం చేసిన ఖతార్‌ ప్రపంచవ్యాప్తంగా తరలివచ్చే అభిమానుల కోసం కఠిన నిబంధనలను కూడా సడలించింది.

ఈసారి ప్రపంచకప్‌లో 32 జట్లను ఎనిమిది గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో నాలుగు జట్లున్నాయి. ప్రతీ జట్టు తమ గ్రూప్‌లో మిగిలిన మూడు జట్లతో ఆడతాయి. నవంబర్ 20 నుంచి డిసెంబర్ 2 మధ్య 14 రోజులలో మొత్తం 48 గ్రూప్ మ్యాచ్‌లు జరుగుతాయి. ఇక్కడ ప్రతి గ్రూప్‌లోని టాప్-2 జట్లు రౌండ్-16కి చేరుకుంటాయి. డిసెంబరు 3 నుంచి నాకౌట్ మ్యాచ్‌లు ప్రారంభం కానున్నాయి. అనంతరం క్వార్టర్‌ఫైనల్‌, సెమీ ఫైనల్ మ్యాచులు జరుగుతాయి. డిసెంబర్ 18న ఫైనల్ ఉంటుంది. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 64 మ్యాచ్‌లు జరగనున్నాయి. సాధారణంగా ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను వేసవిలో నిర్వహిస్తారు. అయితే ఖతార్‌లో ఆ సమయంలో విపరీతమైన వేడి ఉండడంతో ఈసారి టోర్నీని ముందుకు జరిపారు. ఖతార్‌లో వాతావరణాన్ని ఫుట్‌బాల్ ప్లేయర్లు తట్టుకోలేరనే ఉద్దేశంతో ఈసారి టోర్నీని 29 రోజుల్లో ముగించబోతున్నారు. సాధారణంగా 30 నుంచి 31 రోజుల పాటు ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది.

ఇప్పటి వరకు జరిగిన అన్ని ప్రపంచకప్‌లలో ఆడిన ఏకైక జట్టుగా బ్రెజిల్‌ నిలవగా తర్వాతీ స్థానాల్లో జర్మనీ, అర్జెంటీనా నిలిచాయి. 92 ఏళ్ల ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ టోర్నీ చరిత్రలో ఖతార్‌ జట్టు తొలిసారి ఆడుతోంది. గతంలో ఏనాడూ ఖతర్‌ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేదు. ఆతిథ్య దేశం హోదాలో ఖతార్‌కు నేరుగా టోర్నీలో ఆడే అవకాశం లభించింది. 2018 ఫిఫా ప్రపంచకప్‌ను కైవసం చేసుకున్న ఫ్రాన్స్ ఈసారి సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. బ్రెజిల్, బెల్జీయం, అర్జెంటీనా కూడా తమ కలను సాకారం చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. గతేడాది యూరో కప్ ఛాంపియన్‌గా నిలిచిన ఇటలీ ఈ ప్రపంచకప్‌నకు అర్హత సాధించలేకపోయింది.

ఇవీ చదవండి :కివీస్​ సంప్రదాయాలతో టీమ్ ​ఇండియాకు ఘన స్వాగతం క్రికెటర్​ లుక్స్​ హైలెట్​

మనికా బాత్రా రికార్డు.. ఆసియా కప్​ టేబుల్‌ టెన్నిస్‌లో కాంస్యం

ABOUT THE AUTHOR

...view details