FIFA World Cup 2022 : ఓ వైపు 30 అడుగుల మెస్సీ భారీ కటౌట్లు.. మరోవైపు రొనాల్డో భారీ బ్యానర్లు.. ఇంటికి అభిమాన దేశాల రంగులు.. ఒంటిపై జెర్సీలు.. ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ ప్రారంభంతో.. ఏ అర్జెంటీనాలోనూ.. బ్రెజిల్‌లోనూ ఇలాంటి సందడి నెలకొందని అనుకుంటున్నారా? కాదు.. ఈ హంగామా ప్రారంభమైంది మన దేశంలోనే. ఫుట్‌బాల్‌ను అమితంగా ఇష్టపడే కేరళ ఫిఫా ప్రపంచకప్‌లో తమ అభిమాన ఆటగాళ్ల మెరుపులు చూసేందుకు సిద్ధమైంది. ఎటుచూసినా సాకర్ సందడి కేరళను ఊపేస్తోంది.
ఇళ్లకు ఆ దేశాల రంగులు..
కేరళలోని చాలా ప్రాంతాల్లో 2022 ఫిఫా ప్రపంచకప్ ఫుట్‌బాల్ సందడే నెలకొంది. అర్జెంటీనా, బ్రెజిల్, పోర్చుగల్ దేశాల అభిమానులు తమ అభిమాన ఆటగాళ్ల భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. పతనంతిట్ట జిల్లాలోని మల్లప్పుజస్సేరి గ్రామంలో.. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించడమే కాకుండా ఇళ్లకు అర్జెంటీనా, బ్రెజిల్ రంగులను వేశారు. అర్జెంటీనా, బ్రెజిల్ దేశాల అభిమానులు ఈ ఏడాది.. విజయంపై పందేలు కాస్తున్నారు.
కోజికోడ్‌లోని పుల్లవూరు గ్రామంలో అర్జెంటీనా.. బ్రెజిల్ అభిమానులు నదిలో మెస్సీ, రొనాల్డో, నెయ్‌మార్ జూనియర్ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఈ భారీ కటౌట్లను ట్వీట్ చేసిన ఫిఫా.. ఫిఫా ఫీవర్ కేరళను తాకిందని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. 15 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తుతో తెరను ఏర్పాటు చేసి.. ప్రపంచకప్‌ను ప్రత్యక్షంగా చూసేలా ఏర్పాట్లు చేసినట్లు ఫుట్‌బాల్ అభిమానులు తెలిపారు.