క్రీడల్లో రాణించేందుకు అవకాశం రావడమే గొప్ప.. ఎంతో క్రమశిక్షణ, నిబద్ధత, పట్టుదల ఉంటేగాని అందులో పేరు తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఒకవేళ ఆ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకునేది కొందరే. అందులోనూ దీర్ఘకాలంగా రాణించేది ఇంకా తక్కువ. ఇక చెరగని రికార్డులతో తమ పేర్లను చరిత్రలో లిఖించికునే క్రీడాకారులు వేళ్ల మీద లెక్కపెట్టుకోవచ్చు. ఇలా మరపురాని ప్రదర్శన, నిలిచిపోయే రికార్డులతో అద్భుతాలను సృష్టించిన కొంతమంది క్రీడా దిగ్గజాల గురించి ఇప్పుడు చూద్దాం...
సచిన్ తెందూల్కర్..
ఈ పేరు వింటే భారత అభిమానులు రక్తం ఉప్పొంగుతుంది. క్రికెట్ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి అడుగుపెడుతుంటే కళ్లన్నీ అతడివైపే ఉండేవి. ఒకటి కాదు రెండు కాదు 24ఏళ్ల పాటు భారత క్రికెట్ ప్రస్థానంలో హెల్మెట్ పెట్టుకున్న యోధుడిలా పోరాడాడు. 5 అడుగుల 6 అంగుళాల ఎత్తున్న సచిన్ ఘనత ఎవరెస్టును అధిగమించింది. 34వేల అంతర్జాతీయ పరుగులు, వంద సెంచరీలు, 164 అర్ధశతకాలతో ఇప్పుడప్పుడే ఎవరు దరి చేరని స్థాయికి ఎదిగాడు. ఇందులో 18, 426 వన్డే పరుగులు, 15,921 టెస్టు పరుగులున్నాయి.
మైకేల్ ఫెల్ప్స్...
బంగారు చేపగా పేరుగాంచాడు అమెరికా ఈతగాడు మైకేల్ ఫెల్ప్స్ . అతడి స్మిమ్మింగ్ చూస్తే సముద్రం మీద నడిచి వెళ్తున్నాడా అని అనిపిస్తుంది. మొత్తం 28 ఒలింపిక్ పతకాలు గెల్చుకున్న ఫెల్ప్స్...ఇప్పటివరకు అత్యధిక మెడల్స్ సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఇందులో 23 స్వర్ణాలున్నాయి.
15 ఏళ్ల వయసులో తొలిసారి 2000లో సిడ్ని ఒలింపిక్స్‌లో ఫెల్ఫ్స్ పోటీపడ్డాడు. అయితే అప్పుడు పతకం గెలవలేకపోయాడు. ఆ పరాభవం అతడిలో కసిని పెంచింది. ఫలితంగా 2004 ఏథేన్స్‌లో జరిగిన విశ్వక్రీడల్లో ఆరు స్వర్ణాలతో దూసుకెళ్లాడు. రెండు కాంస్యాలనూ సొంతం చేసుకున్నాడు. 2008 బీజింగ్ క్రీడల్లో తన విజయ ప్రస్థానం శిఖరాన్ని తాకింది. 8 స్వర్ణాలతో అదరగొట్టేశాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లోనూ 4 స్వర్ణాలు, 2 రజతాలు కైవసం చేసుకున్నాడు. 2016 రియోలోనూ 5 స్వర్ణాలు, ఓ రజతంతో విశ్వక్రీడల ప్రస్థానాన్ని దిగ్విజయంగా ముగించాడు.