తెలంగాణ

telangana

ETV Bharat / sports

రైతులకు క్రీడాకారుల సంఘీభావం.. పోలీసులు అడ్డగింత - కర్తార్​ సింగ్​ రెజ్లర్

రైతులకు సంఘీభావంగా పంజాబ్​ క్రీడాకారులు కదలివచ్చారు. జాతీయ క్రీడా పురస్కారాలను తిరిగి ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్​ వైపు వెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు.

Farmers protest: Athletes march towards Rashtrapati Bhavan to return awards, halted midway
రాష్ట్రపతి భవన్​ వైపు క్రీడాకారుల పాదయాత్ర.. అడ్డుకున్న పోలీసులు

By

Published : Dec 7, 2020, 7:42 PM IST

Updated : Dec 7, 2020, 8:35 PM IST

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగిస్తున్న రైతులకు సంఘీభావంగా పంజాబ్​ క్రీడాకారులు కదలివచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న 35 జాతీయ క్రీడా పురస్కారాలను తిరిగి ఇచ్చేందుకు రాష్ట్రపతి భవన్​ వైపు సోమవారం వెళ్లారు. ఆ రాష్ట్రం నుంచి రెండుసార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన మాజీ రెజ్లర్​ కర్తార్​ సింగ్.. ఈ బృందానికి​ నేతృత్వం వహించారు.

"రైతులు ఎప్పుడూ మాకు మద్దతుగా నిలిచారు. మా రైతు సోదరులపై లాఠీఛార్జ్​ చేయడం, వాళ్లు రాకుండా రోడ్లు మూసేయడం లాంటి ప్రభుత్వ ప్రయత్నాలను చూశాం. తమ హక్కుల కోసం రైతులు చలిగాలులను లెక్క చేయకుండా కూర్చుకున్నారు. నేనూ రైతు కొడుకునే. ఐజీ, పోలీసు అయినప్పటికీ ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నాను. ఈ క్రూరమైన చట్టాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్ధిస్తున్నాను. కరోనా భయంతో దేశం మొత్తం వణికిపోతున్న సమయంలో బిల్లును ఆమోదించారు. కొత్త చట్టంపై ప్రజలు సంతోషంగా లేనప్పుడు.. ఈ వివాదాస్పద చట్టాన్ని అంగీకరించడానికి రైతులపై ప్రభుత్వం ఎందుకు బలవంతం చేస్తోంది?"

- కర్తార్ సింగ్​, భారత మాజీ క్రీడాకారుడు

కర్తార్​ సింగ్​.. 1982లో అర్జున అవార్డు, 1987లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు. ఒలింపిక్​ స్వర్ణ విజేత మాజీ హాకీ క్రీడాకారిణి గుర్మైల్​ సింగ్​, మాజీ మహిళా హాకీ కెప్టెన్​ రాజ్​బీర్​ కౌర్​ తదితరులు సంఘీభావం తెలిపిన వారిలో ఉన్నారు. 2014లో ధ్యాన్​చంద్​ అవార్డును గుర్మైల్​ సొంతం చేసుకోగా.. 1984లో అర్జున పురస్కారానికి రాజ్​బీర్​ ఎంపికయ్యారు.

ఆదివారమే దిల్లీ చేరుకున్న క్రీడాకారులు ప్రెస్​ క్లబ్​ ఆఫ్​ ఇండియా నుంచి రాష్ట్రపతి భవన్​ వైపు పాదయాత్రగా సాగారు. సమీపంలోని కృష్ణ భవన్​ వద్ద ఉన్న పోలీసులు, కర్తార్​ సింగ్​ బృందాన్ని వెనక్కి పంపారు.

వేర్వేరు సమస్యలు

క్రీడాకారుల నిరసనపై స్పందించిన భారత ఒలింపిక్​ కమిటీ అధ్యక్షుడు నరీందర్​ బాత్రా.. రైతుల సమస్యలు, జాతీయ అవార్డులు వేర్వేరు సమస్యలని అన్నారు. ఆ రెండింటిని కలిపి చూడొద్దని సెక్రటరీ జనరల్​ రాజీవ్​ మెహతాతో సంయుక్త ప్రకటన చేశారు.

మంగళవారం బంద్​.. బుధవారం సమావేశం

వివాదాస్పదంగా మారిన రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. రైతులంతా డిసెంబరు 8న భారత్​ బంద్​ కోసం పిలుపునిచ్చారు. వివిధ రాజకీయ పార్టీల మద్దతుతో బంద్​ను జయప్రదం చేస్తామని రైతు సంఘాలు తెలిపాయి. మరోవైపు కేంద్రం రైతులతో పలు దఫాలుగా చర్చిస్తూనే ఉంది. రైతు సంఘాలతో ప్రభుత్వ అధికారులు డిసెంబరు 9న మరోసారి సమావేశం కానున్నారు.

ఇదీ చూడండి:మంగళవారం 'భారత్​ బంద్​'- అన్ని వర్గాల మద్దతు!

Last Updated : Dec 7, 2020, 8:35 PM IST

ABOUT THE AUTHOR

...view details