టేబుల్ టెన్నిస్‌లో భారత్ తరఫున ఎక్కువగా వినిపించే పేరు శరత్ కమల్(Sharath kamal). ఇప్పటివరకు మూడుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇతడు త్వరలో టోక్యో ఒలింపిక్స్‌లో నాలుగోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఇందులో భాగంగా పతకం కోసం రోజుకు 12 గంటలు శ్రమిస్తున్నాడు. కరోనా కారణంగా దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన శరత్.. దోహాలో జరిగిన ఆసియన్ ఒలింపిక్స్ క్వాలిఫయర్‌లో సత్తాచాటి మెగాటోర్నీకి అర్హత సాధించాడు. వ్యక్తిగత విభాగంతో పాటు మనికా బత్రాతో కలిసి మిక్స్డ్ డబుల్స్‌లో పోటీపడుతున్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా మెగాటోర్నీలో సత్తాచాటాలని పక్కా ప్రణాళికలు వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈటీవీ భారత్ శరత్ కమల్‌ను పలకరించగా పలు విషయాలు పంచుకున్నాడు.
ప్రస్తుతం మీరు సోనిపట్‌లో ఉన్నారు. ఈ శిక్షణా శిబిరం మీకు ఏ విధంగా ఉపయోగపడుతోంది?
అవును. ఇక్కడ చాలా బాగుంది. ఈ కరోనా కష్టసమయంలో ఆటపైనే ఎక్కువ దృష్టిసారించాల్సిన అవసరం ఉంది. నేను వ్యక్తిగతంగా రోజుకూ 12 గంటలు ఫిట్నెస్, ట్రైనింగ్ కోసం కేటాయిస్తున్నా.
మనికా బత్రా(Manika Batra)తో ప్రాక్టీస్ ఎలా ఉంది? మీరు దేనిపై దృష్టిసారించారు?
మనికాతో కలిసి ఆటతో పాటు వ్యూహ రచన, మ్యాచ్ సమయంలో మా ఇద్దరి మధ్య సమన్వయం గురించి చర్చిస్తున్నాం.
గాయం తర్వాత బ్యాక్ హ్యాండ్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ఒలింపిక్స్‌లో భాగంగా కొత్త వ్యూహం ఏమైనా వేస్తున్నారా?
అవును. నేను బ్యాక్ హ్యాండ్‌తో ఎక్కువగా ఆడటానికి ప్రయత్నిస్తున్నా. అలాగే నా గేమ్‌లో కొత్తరకమైన సర్వీస్ చేసేందుకు ట్రై చేస్తున్నా.
విదేశాల్లో మీ ప్రణాళికలు సరిగా ఉండట్లేదు కదా. విదేశాల్లో, వివిధ దేశాల ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేసేందుకు నేషనల్ క్యాంప్ ఉపయోగపడుతుందా?
సింగిల్స్ విభాగంలో ప్రాక్టీస్ కోసం యూరప్ వెళ్లాలని అనుకున్నా. భారత్‌లో ఎక్కువ కరోనా కేసులు ఉండటం వల్ల వీసా లభించలేదు. దీంతో ఇక్కడే శిక్షణ తీసుకున్నా. నేషనల్ క్యాంప్‌ను చాలా తొందరగా ప్రారంభించారు. ఒకవేళ యూరప్ వెళ్లినా.. ఈ క్యాంప్‌లో చేరేవాడిని. ఏదేమైనా నా సింగిల్స్ ప్రాక్టీస్ చాలా బాగా జరుగుతోంది. ఇక్కడ ఉన్న వసతుల్ని ఉపయోగించుకుని శిక్షణ కొనసాగిస్తున్నా.
చాలా కాలంగా ఈ బృందానికి హెడ్ కోచ్ లేరు. మీరు ఈ ఆటలో చాలాకాలంగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అందువల్ల జట్టుకు ఏం అవసరమో మీకు తెలిసి ఉంటుంది. ఆటను ముందుకు తీసుకెళ్లడంలో అధికారులు మరింత దృష్టిసారించాల్సి ఉందా?
హెడ్ కోచ్ చాలా ముఖ్యం. ఒకవేళ మాకు కోచ్ ఉంటే పరిస్థితులు ఇంకాస్త ఉత్తమంగా ఉండేవి. కానీ మాజీ కోచ్ మసిమో కోస్టంటినీ ఎక్కువ సమయం ఇవ్వకుండా అర్ధాంతరంగా వైదొలిగారు. కొత్త కోచ్‌ను వెతుకుదామనుకున్న సమయంలోనే కరోనా వచ్చి అంతా తారుమారు చేసింది. ఒలింపిక్స్ తర్వాత కొత్త కోచ్ గురించి ఆలోచిస్తాం.
ఈసారి టేబుల్ టెన్నిస్ విభాగంలో భారత్ నుంచి ఒలింపిక్స్‌కు ఎక్కువమంది వెళుతున్నారు. దీనిని ఏ విధంగా చూడొచ్చు?
2016లో రియో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయినప్పటి నుంచీ ఫెడరేషన్ చాలా బాగా పనిచేస్తోంది. ప్రస్తుతం ఉత్తమమైన వసతులు, నిర్వహణ వ్యవస్థ మన సొంతం. ఈ క్రమంలోనే యూటీటీ (The Ultimate Table Tennis) లీగ్ ప్రారంభమవడం వల్ల ఆటగాళ్లలో విశ్వాసం పెరిగింది. అంతర్జాతీయ స్థాయిలో రాణించగలమన్న ధీమా కలిగింది. అందువల్లే ఎక్కువ మంది ఆటగాళ్లు ఈ ఆటను ఎంచుకుని విజయం సాధిస్తున్నారు.
ఈసారి ఒలింపిక్స్‌లో అభిమానులు మీ నుంచి ఎంతవరకు పతకం ఆశించవచ్చు?
వాస్తవానికి మిక్స్డ్ డబుల్స్‌లో పతకం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. డ్రాలో బై రావడం వల్ల మేము నేరుగా ప్రీక్వార్టర్స్‌లో మా పోటీ మొదలుపెడతాం. మూడు రౌండ్స్ మెరుగ్గా ఆడితే పతకం లభిస్తుంది. కానీ ఈ మూడు చాలా కఠినమైన రౌండ్స్. ఇలాంటి పెద్ద టోర్నీల్లో ఆడేటపుడు ఆటగాళ్లపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. నేను, మనిక ఇలాంటి ఒత్తిడిలో గొప్పగా ఆడతాం. ఇదే మా బలం. భారత్‌కు ఆడుతున్న దగ్గర నుంచి నాకున్న కల ఒలింపిక్స్‌లో పతకం సాధించడం.