తన బంధువుల అమ్మాయితో రిలేషన్షిప్లో ఉన్నట్లు వెల్లడించింది మహిళా స్ప్రింటర్ ద్యుతీ చంద్. కుటుంబసభ్యులు మాత్రం ఇందుకు ఒప్పుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్‌లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకే ఈ విషయం బహిర్గతం చేసినట్లు చెప్పుకొచ్చింది.
"నేను 19 ఏళ్ల మా చుట్టాలమ్మాయితో ఐదేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నాను. ఆమె ప్రస్తుతం భువనేశ్వర్‌లోని ఓ కళాశాలలో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. నేను ఎప్పుడు ఇంటికి వెళ్లినా తనతోనే సమయం గడుపుతాను. తను నా సోల్‌మేట్. భవిష్యత్తులో తనతోనే స్థిరపడాలని అనుకుంటున్నాను"
- ద్యుతీ చంద్, భారత అథ్లెట్
ఇంట్లో నుంచి ఒత్తిడి...
స్వలింగ సంపర్కం విషయం బయటపెట్టిన ద్యుతీ చంద్‌కు ఇంట్లో నుంచి ఒత్తిడి ఎదురవుతోందట. అసలు ఈ విషయాన్ని వెల్లడించడానికి రెండు కారణాలు చెప్పింది ద్యుతి.
అక్కే ఓ కారణం...
" పెద్దక్క మా ఇంట్లో పెత్తనం చేస్తోంది. గతంలో మా అన్న భార్యంటే ఇష్టం లేక వాళ్ల కుటుంబాన్ని బయటకు పంపేసింది. అదే విధంగా నన్నూ చేయాలని చూస్తోంది. అయితే నేను చిన్నపిల్లను కాను. నాకు స్వేచ్ఛగా జీవించాలని ఉంది. అందుకే నా బంధం గురించి బహిరంగపరిచాను. నా భాగస్వామి ఆస్తిలో భాగం అడుగుతుందని మా అక్క భయంతో ఉంది. అందుకే ఈ విషయంపై నన్ను జైలుకు పంపిస్తా అని భయపెడుతోంది ".
- ద్యుతీ చంద్, భారత అథ్లెట్
తన భాగస్వామి అంగీకారంతోనే ఇదంతా వెల్లడించినట్లు ద్యుతి స్పష్టం చేసింది. స్వేచ్ఛగా జీవించే హక్కు అందరికీ ఉందని.. ఏం జరిగినా ఇద్దరం కలిసి ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వివరించింది. ఒకవేళ తన పార్ట్నర్ భవిష్యత్తులో ఎవరినైనా పెళ్లి చేసుకుంటా అంటే మాత్రం అడ్డుచెప్పనని చెప్పింది.