తెలంగాణ

telangana

ETV Bharat / sports

90 మీటర్లపై కన్నేసిన నీరజ్.. దోహా డైమండ్‌ లీగ్​లో ఆ దూరాన్ని అందుకుంటాడా? - డైమండ్​ లీగ్​ 2023 ప్రారంభ తేదీ

భారత జావెలిన్‌ స్టార్‌ నీరజ్‌ చోప్రా ఈ ఏడాది దోహాలో జరిగే డైమండ్‌ లీగ్‌ తొలి అంచె పోటీల్లో పాల్గొననున్నాడు. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించి సత్తా చాటిన ఈ స్టార్​ ప్లేయర్​కు​ ఈ ఏడాది దోహాలో పోటీలో 90 మీటర్లపై కన్నేశాడు.

neeraj chopra
neeraj chopra for diamond league 2023

By

Published : May 5, 2023, 8:28 AM IST

భారత జావెలిన్‌ స్టార్‌ అథ్లెట్​ నీరజ్‌ చోప్రా ఇప్పుడు మరో పరీక్షను ఎదుర్కోనున్నాడు. గతేడాది డైమండ్‌ లీగ్‌ ఫైనల్‌ టోర్నీలో విజేతగా నిలిచిన నీరజ్​.. ఈ సీజన్లో దోహాలో జరిగే డైమండ్‌ లీగ్‌ తొలి అంచె పోటీల్లో దిగుతున్నాడు. 2022 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన ఈ స్టార్​ ప్లేయర్​ ఇప్పుడు మరో లక్ష్యంపై కన్నేశాడు.

అయితే ఈ పోటీలో నెగ్గడం అంత సులభం కాదు. అతడికి ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా), ఐరోపా ఛాంపియన్‌ జులియన్‌ వెబర్‌ (జర్మనీ), టోక్యో ఒలింపిక్స్‌ రజత పతక విజేత జాకబ్‌ వాద్లిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌), మాజీ ఒలింపిక్‌ విజేత వాల్కాట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో) నుంచి సవాల్‌ ఎదురు కానుంది. అన్నింటికి మించి ఎప్పటి నుంచో కలగా ఉన్న 90 మీటర్ల దూరాన్ని నీరజ్‌ ఈ ఈవెంట్లో అందుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరం. ఫిట్‌నెస్‌ లేమి కారణంగా గతేడాది జరిగిన దోహా ఈవెంట్‌కు దూరమైన ఈ స్టార్​ ప్లేయర్​.. జ్యూరిచ్‌లో జరిగిన లీగ్‌లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రికార్డు చరిత్రకెక్కాడు. ప్రస్తుతం తాను శారీరకంగా, మానసికంగా మెరుగ్గా ఉన్నానంటూ పేర్కొన్న చోప్రా.. గోల్డెన్‌ క్లబ్‌లోకి చేరగలనని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

గత సీజన్​లలో జావెలిన్‌ను 89.94 మీటర్లు (స్టాక్‌హోమ్‌ డైమండ్‌ లీగ్‌) విసిరి కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శనను కనబరిచిన భారత స్టార్‌.. 90 మీటర్లను కొద్దిలో అందుకోలేకపోయాడు. దోహా లీగ్‌లోనైనా ఈ లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదలతో బరిలోకి దిగనున్నాడు. అయితే ప్రత్యర్థులైన అండర్సన్‌ (93.03 మీ), వాల్కాట్‌ (90.16 మీ) వ్లాదిచ్‌ (90.88 మీ),లకు చోప్రాతో పోలిస్తే మంచి రికార్డే ఉంది. ఇటీవల ప్రదర్శన గొప్పగా లేకపోయినా రియో ఒలింపిక్‌ రజత పతక విజేత యెగో (కెన్యా, 92.72 మీ)ను మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయలేం. ఈ నేపథ్యంలో పతకం సాధించాలన్న ఆశలు ఉండాలంటే నీరజ్‌.. జావెలిన్‌ను కనీసం 90 మీటర్లపైన విసరక తప్పదు.

"గతేడాది కేవలం 6 సెంటీమీటర్లలో దూరంలో 90 మీటర్లను అందుకోలేకపోయాను. ఈసారి ఆ లక్ష్యాన్ని సాధించాలని అనుకుంటున్నా. ఈ క్రమంలో ఒత్తిడి పెంచుకోకూడదని భావిస్తున్నా" అని నీరజ్‌ చెప్పాడు. ఇక ఈ ఏడాది జరగనున్న దోహా టోర్నీలో నీరజ్‌తో పాటు మరో భారత అథ్లెట్‌ ఎల్దోస్‌ పాల్‌ (ట్రిపుల్‌జంప్‌) కూడా పోటీలో ఉన్నాడు. బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో 17.03 మీటర్ల దూరం దూకి స్వర్ణాన్ని అందుకున్న ఎల్దోస్‌కు కూడా పోటీ తీవ్రంగా ఉండే దోహాలో పతకం గెలవడం చాలా కష్టమే అని అంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details