తెలంగాణ

telangana

ETV Bharat / sports

కొవిడ్‌ సోకినా విచ్చలవిడిగా తిరిగిన జకోవిచ్‌! - ఆస్ట్రేలియా ఓపెన్ 2022

Djokovic in Australian Open: ఆస్ట్రేలియన్​ ఓపెన్​ ఆడేందుకు అక్కడికి వెళ్లిన సెర్బియా టెన్నిస్​ స్టార్​ నొవాక్ జకోవిచ్​ వీసా రద్దు వ్యవహారం ఇంకా కొనసాగూతూనే ఉంది. ఈ నేపథ్యంలో అతడికి సంబంధించి కొన్ని విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. కరోనా సోకినా అతడు జనసమూహాల్లోకి వెళ్లి విచ్చలవిడిగా తిరిగినట్లు తెలిసింది. మెగాటోర్నీలో పాల్గొనేందుకు అతడు చేసిన నాటకీయ పరిణామాలు బయపడ్డాయి. ఫలితంగా అతడికి జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

djokovic
జకోవిచ్

By

Published : Jan 13, 2022, 4:57 PM IST

Djokovic in Australian Open: వైరస్‌కు ప్రాంతాలు.. మతాలు.. భావజాలంతో సంబంధం లేదు.. ఎవరికైనా సోకుతుంది. నిప్పు కాలడం ఎంత నిజమో.. వైరస్‌ ప్రభావానికి గురైతే అనారోగ్యం పాలవడం అంతే నిజం. కొందరు సెలబ్రిటీలు, నాయకులు ఈ చిన్న విషయాన్ని కూడా నమ్మకుండా విచ్చలవిడిగా తిరుగుతూ తమ ప్రాణాలకు ప్రమాదం తెచ్చుకోవడంతో పాటు చుట్టుపక్కల వారిని మృత్యువు ముంగిటికి పంపుతున్నారు. తాజాగా టెన్నిస్‌ క్రీడాకారుడు నొవాక్‌ జకోవిచ్‌ వ్యవహారం కాకపుట్టిస్తోంది. కొవిడ్‌ సోకిందని తెలిసినా ఇష్టమొచ్చినట్లు కార్యక్రమాల్లో పాల్గొన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఫలితంగా అతడు ఆస్ట్రేలియా ఓపెన్‌లో పాల్గొనే అంశంపై నీలినీడలు కమ్ముకొన్నాయి.

మొదటి నుంచి టీకాకు వ్యతిరేకి..

జకోవిచ్‌ మొదటి నుంచి టీకా తీసుకోవడానికి వ్యతిరేకం. 2020 ఏప్రిల్‌లో ఈ మేరకు బహిరంగ ప్రకటన చేస్తూ.. కొవిడ్‌ టీకాకు వ్యతిరేకమని తెలిపాడు. తప్పనిసరి పరిస్థితి వస్తే అప్పుడు ఆలోచిస్తానని చెప్పాడు. అదే ఏడాది కరోనా వ్యాప్తి పెరగడంతో టెన్నిస్‌ టూర్లు రద్దయ్యాయి. దీంతో సెర్బియా, క్రొయేషియా మధ్య ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌లు నిర్వహించాడు. అక్కడ కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ల కారణంగా క్రీడాకారులతోపాటు జకోవిచ్‌, అతని భార్య జెలినాకు కూడా వైరస్‌ సోకింది.

కొవిడ్‌ సోకిందని తెలిసి కూడా..

ఆస్ట్రేలియాలో కఠిన నిబంధనలు విధించినా కొవిడ్‌ అదుపులోకి రావడంలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ జరిగే విక్టోరియా రాష్ట్రం కీలక నిర్ణయం తీసుకొంది. 2021 నవంబర్‌లో టోర్నీ ఆడే ప్రతి క్రీడాకారుడు టీకా తీసుకోవాలనే నిబంధన విధించింది. సరైన ఆరోగ్య కారణాలు చూపి మినహాయింపు పొందవచ్చని పేర్కొన్నారు. అప్పటికి జకోవిచ్‌ టీకా తీసుకోలేదు.

డిసెంబర్‌ 14న బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఓ బాస్కెట్‌ బాల్‌ టోర్నీలో జకోవిచ్‌ పాల్గొన్నాడు. అక్కడి క్రీడాకారులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ తర్వాత పలువురు క్రీడాకారులకు కరోనావైరస్‌ సోకినట్లు తేలింది. ఆ తర్వాత డిసెంబర్‌ 16వ తేదీన జకోవిచ్‌ కొవిడ్‌ పరీక్ష నివేదికలో పాజిటివ్‌ వచ్చింది. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు.

మర్నాడే బెల్‌గ్రేడ్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు యాంటీజెన్‌, పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. యాంటీజెన్‌లో నెగిటివ్‌ రావడంతో ఆ కార్యక్రమంలో పాల్గొని పిల్లలతో కలిసి మాస్కులేకుండా ఫొటోలకు పోజులిచ్చాడు. ఆ తర్వాత పీసీఆర్‌ పరీక్షలో అతనికి పాజిటివ్‌గా తేలింది. జకోవిచ్‌ మాత్రం 16వ తేదీన నిర్వహించిన పీసీఆర్‌ పరీక్ష ఫలితాలు 17వ తేదీన కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత వచ్చాయని చెబుతున్నాడు. నమూనా ఇచ్చాక ఐసోలేషన్‌లో ఎందుకు లేడో చెప్పలేదు. పీసీఆర్‌ పరీక్షలో పాజిటీవ్‌ వచ్చినా జకోవిచ్‌ ఆగలేదు.. 18వ తేదీన ఫ్రెంచి పత్రిక లెక్విప్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు.

జకోవిచ్

జనవరి 4వ తేదీన జకోవిచ్‌ ఆస్ట్రేలియాకు పయనమవుతున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. ఆయనకు ఆరోగ్య కారణాలతో టీకా నుంచి మినహాయింపు ఇచ్చినట్లు ఆస్ట్రేలియా టెన్నిస్‌ అధికారులు ధ్రువీకరించారు. ఆ కారణాలు ఏమిటో వెల్లడించలేదు. దీంతో వివాదం మొదలైంది. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్‌ మారిసన్‌ దీనిపై స్పందిస్తూ "మా సరిహద్దుల్లో నిబంధనలు అందరికీ ఒక్కటే" అని ట్వీట్‌ చేశారు. ఆ తర్వాత జకోవిచ్‌ ఇమ్మిగ్రేషన్‌ డిటెన్షన్‌ సెంటర్‌కు చేరగా.. వివాదం కోర్టుకు చేరింది. జకోవిచ్‌కు లాయర్‌తో మాట్లాడేందుకు తగినంత సమయం ఇవ్వకుండా వీసా నిరాకరించారని న్యాయమూర్తి కెల్లీ తేల్చారు. జకోవిచ్‌ను విడుదల చేయాలని ఆదేశించారు. దీంతో జకోవిచ్‌ బయటకు వచ్చిన కొన్ని గంటల్లోనే మెల్‌బోర్న్‌ పార్క్‌లో సాధన చేస్తూ కనిపించాడు. ఇది వివాదాన్ని మరింత రాజేసింది.

అబద్ధాలు బయటపడ్డాయిలా..

  • ప్రయాణించేందుకు అవసరమైన పత్రాల్లో కూడా నొవాక్‌ జకోవిచ్‌ అబద్ధాలు పేర్కొన్నాడు. ఆస్ట్రేలియా ప్రయాణానికి 14 రోజుల ముందు ఎక్కడికైనా వెళ్లారా అని ఆ పత్రాల్లో ప్రశ్నించగా.. 'లేదు' అని జకోవిచ్‌ పేర్కొన్నాడు. కానీ అతడు స్పెయిన్‌లో ప్రయాణించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. తన ఏజెంటు తప్పు కారణంగా పత్రాల్లో అలా రాసినట్లు వెల్లడించాడు.
  • కోర్టులో జకోవిచ్‌ డిసెంబర్‌ 16న కొవిడ్‌ బారిన పడ్డట్లు వెల్లడించాడు. ఆ తర్వాత 'గార్డియన్‌ ఆస్ట్రేలియా' వంటి పత్రికలు డిసెంబర్‌ 16, 17, 18 తేదీల్లో జకోవిచ్‌ పర్యటనల చిత్రాలతో సహా కథనాలు ప్రచురించడంతో ఆస్ట్రేలియాలో గగ్గోలు మొదలైంది. ఫ్రెంచి పత్రిక లెక్విప్‌కు ఇంటర్వ్యూ ఇవ్వడం తప్పేనని అంగీకరించాడు.

రికార్డు కోసం ఆత్రుత..!

ప్రపంచం మొత్తం ఒమిక్రాన్‌ పడగనీడలోకి జారిపోతున్నా.. టెన్నిస్‌ నెంబర్‌-1 క్రీడాకారుడు జకోవిచ్‌కు తన రికార్డే ముఖ్యం. ఇప్పటికే స్పెయిన్‌ బుల్‌ రఫెల్‌ నాదల్‌, టెన్నిస్‌ మాస్ట్రో రోజర్‌ ఫెదరర్‌ 20 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ సాధించారు. జకోవిచ్‌ కూడా 20 గ్రాండ్‌ స్లామ్‌ టైటిల్స్‌ అందుకొన్నాడు. అన్ని సాధారణంగా ఉంటే వీరు ముగ్గురు ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడాల్సి ఉంది. ఈ ముగ్గురులో ఎవరు టైటిల్‌ గెలిచినా.. 21 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌ సాధించిన తొలి క్రీడాకారుడిగా సరికొత్త చరిత్ర సృష్టిస్తారు. రఫెల్‌ నాదల్‌ ఈ టోర్నీకి వస్తుండగా.. ఫెదరర్‌ శస్త్రచికిత్స నుంచి కోలుకొంటున్నాడు.

మండిపడుతున్న షేన్‌వార్న్‌..!

జకోవిచ్‌ వ్యవహారంపై దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ కూడా గళం విప్పాడు. కొవిడ్‌ సోకిందని తెలిసినా జనంలో తిరిగిన జకోవిచ్‌ను ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనిచ్చింది ఎవరని ప్రశ్నించారు. అతడికి వైద్య కారణాలతో అనుమతులు ఇచ్చిందెవరో వెల్లడించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. విక్టోరియా వాసిగా నేను సిగ్గుపడుతున్నాను అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

నోవాక్‌ జకోవిచ్‌పై ముసురుకొన్న కష్టాలు..

  • మరో వైపు కోర్టు తీర్పు ఇచ్చినా.. జకోవిచ్‌ వీసాను రద్దు చేసే విషయాన్ని ఆస్ట్రేలియా ఇమ్మిగ్రేషన్‌ మంత్రి అలెక్స్‌ హాక్‌ పరిశీలిస్తున్నారు.
  • కొవిడ్‌ సోకినా బయట తిరిగినట్లు అంగీకరించడంతో సెర్బియా చట్టాల ప్రకారం జకోవిచ్‌కు జరిమానా లేదా జైలు శిక్ష పడే అవకాశం ఉంది.

అయినప్పటికీ..

ఇన్ని వివాదాల నడుమ కూడా ఆస్ట్రేలియా ఓపెన్​ పోరులో తలపడేందుకు సిద్ధమవుతున్నాడు జకోవిచ్. ఈ మేరకు అతడు మియామిర్ కెక్​మనోవిక్ తొలి మ్యాచ్​ ఆడనున్నాడు. స్పానిష్​ ఆటగాడు రఫేల్ నాదల్.. మార్కోస్ గైరన్​తో తలపడనున్నట్లు టోర్నీ నిర్వాహకులు గురువారం వెల్లడించిన డ్రా ప్రక్రియ ద్వారా స్పష్టమైంది. అయితే.. జకోవిచ్​ను మ్యాచ్​ ఆడించాలా? లేదా? అనే దానిపై ఆస్ట్రేలియా ప్రభుత్వం నుంచి అనుమతి రావాల్సి ఉంది.

ఇదీ చదవండి:

కోర్టులో జకోవిచ్​కు ఊరట.. వీసా పునరుద్ధరణ

నంబర్​ వన్​గానే బరిలోకి జకోవిచ్.. ప్రాక్టీస్​ షురూ..

ఆ పొరపాటు వల్లే ఇదంతా.. క్షమించండి: జకోవిచ్

ABOUT THE AUTHOR

...view details