Djokovic Australian Open: ఈ నెల 17న ఆరంభమయ్యే ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ జకోవిచ్ ఆడతాడా? అందుకు ఆ దేశ ప్రభుత్వం అతనికి అనుమతినిస్తుందా? అన్న ప్రశ్నలకు ఇంకా జవాబు రాలేదు. కానీ నిర్వాహకులు మాత్రం టోర్నీ డ్రాలో ఈ ప్రపంచ నంబర్‌వన్ ఆటగాడికి టాప్ సీడ్ కట్టబెట్టారు.
గురువారం ప్రకటించిన డ్రా ప్రకారం ఈ సెర్బియా ఆటగాడు.. తొలి రౌండ్లో తన దేశానికే చెందిన ప్రపంచ 78వ ర్యాంకర్ కెక్‌మనోవిచ్‌తో పోటీపడనున్నాడు. కానీ ఆస్ట్రేలియా ప్రభుత్వం జకో విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
ఈ టోర్నీలో ఆడాలంటే తప్పనిసరిగా రెండు డోసుల టీకా వేసుకోవాలనే నిబంధన నుంచి అతను వైద్య మినహాయింపు పొందాడు. కానీ ఆ కారణం సహేతుకంగా లేదని సరిహద్దు భద్రతా దళం అతణ్ని విమానాశ్రయంలోనే అడ్డుకుని వీసా రద్దు చేసి ఓ హోటల్‌కు తరలించింది. దీనిపై కోర్టుకు వెళ్లి విజయం సాధించిన జకో.. ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి ప్రాక్టీస్ కూడా చేస్తున్నాడు. కానీ వ్యక్తిగత అధికారంతో అతని వీసాను రద్దు చేసే విషయాన్ని ఇమ్మిగ్రేషన్ మంత్రి అలెక్స్ హాక్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
తాజాగా విలేకర్లతో మాట్లాడిన ఆ దేశ ప్రధాని మోరిసన్.. "జకోవిచ్ వీసా విషయంలో వ్యక్తిగత రద్దును ఉపయోగించే అధికారం అలెక్స్‌కు ఉంది. దీనిపై ఈ సమయంలో ఇంకెలాంటి వ్యాఖ్యలు చేయను" అని పేర్కొన్నారు.